విశాఖ : ‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం జాతికి అంకితం ఇచ్చారు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖ లోని నేవల్ డాక్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్క పాల్గొన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో కోల్‌కతా లోని గార్డెన్ రీచ్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ ) సంస్థ ‘ఐఎన్‌ఎస్ సంధాయక్ ’ ను నిర్మించింది. దీని నిర్మాణానికి 2019 లో నాంది పలికి 2021 డిసెంబర్ 5 న జలప్రవేశం చేయించి పనులు పూర్తి చేశారు. ఇది 3800 టన్నుల సామర్థంతో 110 మీటర్ల పొడవుంది. హెలిపాడ్, సర్వే సాంకేతిక పరికరాలు , రెండు డీజిల్ యంత్రాలు అమర్చారు. సంధాయక్ కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం. థామస్ వ్యవహరించనున్నారు.