మోడీ ఈ విషయాన్ని అంగీకరిస్తారా?: కాంగ్రెస్ సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ కేంద్రంగా కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. విక్రాంత్ నిర్మాణాన్ని సమష్టి కృషిగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ అభివర్ణించారు. ప్రధాని ఈ విషయాన్ని అంగీకరిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ‘1999నుంచి పాలించిన ప్రభుత్వాల సమష్టి కృషి ఫలితంగా నేడు ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ప్రధాని దీనిని గుర్తిస్తున్నారా?1971 నాటి చైనా యుద్ధంలో సేవలందించిన నాటి ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అప్పటి రక్షణ మంత్రి కృష్ణమీనన్ దానిని యుకెనుంచి భారత్‌కు తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు’ అని జైరాం రమేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘వాస్తవానికి చాలా ఏళ్ల క్రితమే ఎకె ఆంటోనీ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాన్ని డిజైన్ చేసి తయారు చేసి, పరీక్షించి చివరికి నౌకాదళంలో చేర్చడానికి 22 సంవత్సరాలు పట్టింది. మోడీ ప్రభుత్వం చేస్తున్నదల్లా దాన్ని ప్రారంభించడమే. దానికి ఆయన క్రెడిట్ తీసుకుంటున్నారు’ అనికూడా జైరాం రమేశ్ అన్నారు.