Friday, January 24, 2025

నౌకాదళ కీర్తి కిరీటం

- Advertisement -
- Advertisement -

CM Shinde Expands Cabinet Over 40 Days స్వావలంబనకి అనేక ముఖాలు. భారత్ వంటి సువిశాల దేశం దీనిని సాధించుకోడం మామూలు విషయం కాదు. 75వ స్వాతంత్య్ర దినోత్సవవేళ, ఆజాదీ కా అమృతోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సమయంలో సరికొత్త భారీ యుద్ధ విమాన వాహక నౌక (ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్) ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను నౌకాదళంలోకి చేర్చుకోగలగడం నిస్సందేహంగా ఒక శిఖరప్రాయమైన సందర్భం. స్వదేశీ నైపుణ్యం తో, సామగ్రితో నిర్మించుకున్న ఈ నౌక మన నౌకాదళంలోని నౌకలన్నింటిలోకి పెద్దది. దీని ప్రవేశంతో మన నౌకానిర్మాణ సామర్థ పతాకం ప్రపంచ గగనాల్లో సగర్వంగా రెపరెపలాడుతుంది. ఎందుకంటే ఇటువంటి భారీ నౌకలను సొంతంగా నిర్మించుకోగల సామర్థం ఇతర కొద్ది దేశాలకే వుంది. దీని చేరికతో మన దేశం అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ల పక్కన చేరుతుంది.

ఈ మహా సదేశీ యుద్ధ విమాన వాహక నౌకను కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డులో శుక్రవారం నాడు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నౌకాదళ కొత్త పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. దానిని ఛత్రపతి శివాజీకి అంకితమిచ్చారు. నూతన భవిష్యత్ అనే సూర్యోదయాన్ని నేడు భారతీయులందరూ వీక్షిస్తున్నారని ఆయన అన్నారు. విక్రాంత్ కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదు, భారత్ కృషికి, నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. విక్రాంత్‌లో మహిళా సైనికులు సైతం వుంటారని ప్రధాని చేసిన ప్రకటన హర్షించదగినది.

నౌకాదళం అన్ని విభాగాల్లోనూ మహిళలకు ప్రవేశం వుంటుందని ఆయన చెప్పారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు గల నవీన ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో 24 రష్యన్ మిగ్ 29 యుద్ధ విమానాలు, కామోవ్ 31 హెలీకాప్టర్లు, ఎన్‌హెచ్ 60 ఆర్ బహుళ వినియోగ హెలీకాప్టర్లు, స్వదేశీ అడ్వాన్డ్ లైట్ హెలీకాప్టర్లు వుంటాయి.1600 మంది సిబ్బందిని కలిగి వుండే ఈ నౌకలో 2200 కంపార్టుమెంట్లు వుండేలా నిర్మాణం జరిగింది. మహిళా ఆఫీసర్లు, సెయిలర్ల కోసం ప్రత్యేక కేబిన్లను నిర్మించారు. దీని బరువు 43 వేల టన్నులు. అంతే బరువు గల సాగర జలాలను చీల్చుకుంటూ దూసుకుపోగలదు. అయితే చైనా ఫుజియన్ విమాన వాహక నౌక సామర్థం 80 వేల టన్నులు. అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక యుఎస్‌ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌక కెపాసిటీ 112000 టన్నులు. సాగర జలాల్లో సైతం చైనా మనకు కొరకరాని కొయ్యగానే వుంది. దాని వద్ద మూడు యుద్ధ విమాన వాహక నౌకలున్నాయి. మనకు ఈ విక్రాంత్‌తో పాటు విక్రమాదిత్య అనే మరో ఆధునికీకరించిన యుద్ధ నౌక మాత్రమే వున్నాయి.

చైనా అణు విద్యుత్‌తో నడిచే మరో నౌకను కూడా సమకూర్చుకోనున్నదని వార్తలు చెబుతున్నాయి. దాని నిఘా నౌక ఈ మధ్యనే శ్రీలంక హంబన్‌టోట రేవుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీని రాకను అడ్డుకోడానికి శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైంది. ఆ రేవును చైనా నిర్మించింది. అందుకు తగిన నిధులను శ్రీలంకకు అప్పుగా ఇచ్చింది. దివాలా తీసిన శ్రీలంక ఈ కారణం వల్ల చైనా నిఘా నౌకను రానీయకుండా చేయలేకపోయింది. శ్రీలంక జలాల నుంచి మన సైనిక రహస్యాలను తెలుసుకునే ఉద్దేశంతోనే చైనా తన నిఘా నౌకను పంపించిందని బోధపడుతున్నది. హంబన్‌టోట రేవుకు మన కన్యాకుమారి 451 కి.మీ చేరువలో వుంది. పాత ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను 1957లో శ్రీమతి విజయలక్ష్మిపండిట్ బ్రిటన్‌లోని బెల్‌ఫాస్ట్‌లో ప్రారంభించారు.1965 యుద్ధంలో బొంబాయి రేవులో క్రియాశూన్యంగా వుండిపోయిన తొలి విక్రాంత్ 1971 యుద్ధంలో ప్రశంసార్హమైన పాత్ర పోషించిందని కేవలం 10 రోజుల్లో 300 సార్లు ఈ నౌక నుంచి యుద్ధ విమానాలు రణ విహారం చేశాయని చెబుతారు. దాని పేరుతో శుక్రవారం నాడు నౌకాదళంలో చేరిన స్వదేశీ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణానికి రూ. 20 వేల కోట్లు ఖర్చయ్యాయి. కాంగ్రెస్ హయాంలో 1999లో నవ విక్రాంత్ నిర్మాణం మొదలైంది.

దీని ఇరుసు ఏర్పాటు 2001లో జరిగింది. ప్రథమ దశ నిర్మాణం 2013లో పూర్తి అయింది. అందుచేత ఈ ఘన సందర్భాన్ని బిజెపి పాలకులు తమ ఖాతాలో మాత్రమే వేసుకోలేరు. ఇది ఏ ఒక్కరి కృషి ఫలితమూ కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి దశాబ్దాల్లో దేశ పునర్నిర్మాణ కృషికి అంకితమైన తీరు చరిత్రాత్మకమైనది. ప్రభుత్వరంగం పరిఢవిల్లిన విధానం వేనోళ్ల పొగడదగినది. ఇప్పుడు మొత్తం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు కారుచవకగా కట్టబెడుతూ నవీన భవితవ్యమనే సూర్యోదయాన్ని కళ్లారా చూడండని ప్రధాని మోడీ జాతికి చెప్పడం హాస్యాస్పదంగా వుంది.చమురు రంగంలో పూర్తి పరాధీనంగా వున్న భారత్ సొంత వనరులను సమకూర్చుకోనంత వరకు పరిపూర్ణ స్వావలంబన సాధించుకున్నట్టు చెప్పుకోజాలదు. అనేక విషయాల్లో ఇప్పటికీ మనం చైనా కంటే బాగా వెనుకబడి వున్నాము. దీనిని గమనంలో పెట్టుకొని దేశంలోని అన్ని శక్తుల సమష్టి, సమైక్య కృషితో పరిపూర్ణ నవ భారతాన్ని ఆవిష్కరించుకోవలసి వుంది. దురదృష్టవశాత్తు మానవ వనరులను మత ప్రాతిపదిక మీద చీల్చి మెజారిటీ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో కొనసాగే దుస్తంత్రాన్నే మన దేశ పాలకులు పాటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News