న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ల ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఇండియన్ సార్స్‌కోవ్2 కన్సార్టియం (ఇన్సాకాగ్) మురుగునీటిలో పరిశోధనలు మొదలు పెట్టింది. ఇందులోభాగంగా దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో నమూనాలు సేకరించి పరిశోధన చేస్తున్నట్టు తెలియజేసింది. పర్యావరణంలో కొవిడ్ స్థాయిలను తెలుసుకోవడంతోపాటు వైరస్ మ్యుటేషన్, కొత్త వేరియంట్ల జాడలను కనుక్కునేందుకు ఈ పరిశోధన సహాయపడుతుందని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోడా పేర్కొన్నారు. భారత్‌లో పోలియో నిర్మూలన సమయం లోనూ ఈ తరహా పర్యవేక్షణ చేశామని చెప్పారు.
కేవలం గొంతు, నోరు నుంచే కాకుండా విసర్జన ప్రక్రియ లోనూ కరోనా వైరస్ బయటపడుతుందని , దీని ద్వారా వైరస్ ఉనికిని మరింత అంచనా వేయవచ్చని అన్నారు. ఇటువంటి పద్ధతిని టైఫాయిడ్‌ను గుర్తించేందుకు 1920 లో ఐర్లాండ్ తొలిసారి ఉపయోగించగా, అనంతరం పోలియో, మిజిల్స్, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ల ఆనవాళ్లను తెలుసుకోడానికి వినియోగించారని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సీసీఎంబీ , ఐఐసీటీ పరిశోధనా సంస్థలు మురుగునీటి విశ్లేషణను తొలి, రెండో వేవ్ సమయం లోనే చేపట్టాయి. నగరం లోని పలు చెరువులు, కాలువల్లోనూ నీటి నమూనాలను సేకరించి విశ్లేషించాయి. వైరస్ ఆనవాళ్లు, వైరల్ లోడ్ గురించి నివేదికలు రూపొందించాయి.