మనతెలంగాణ/హైదరాబాద్ : వివాహితపై అత్యాచారం, అపహరణ, తుపాకీతో బెదిరింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును సోమవారం నాడు వనస్థలిపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈక్రమంలో హయత్‌నగర్ కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగేశ్వరరావును విచారణ కోసం వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అత్యాచారం, హత్యాయత్నం జరిగిన ప్రదేశంతో పాటు కారు ప్రమాదం జరిగిన స్థలంలో పోలీసులు మంగళవారం నాడు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణకు పాల్పడిన కేసులో మాజీ సిఐ నాగేశ్వరరావును నెల 10న అరెస్టు చేసి 11న రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. దర్యాప్తులో పురోగతి కోసం నాగేశ్వర్రావును 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హయత్‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాల్చింది. ఈ కేసులో వనస్థలిపురం పోలీసులు నిందితుడిని ఇబ్రహీం పట్నం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలపై ప్రశ్నించారు. అలాగే ప్రమాద ఘటన వెంటనే గాయపడిన మాజీ సిఐ అజ్ఞాతంలోకి వెళ్లాడని, అతనికి ఎవరెవరు సహకరించారన్న కోణంలోనూ విచారణ చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా నిందితుడు బాధితులతో రాజీ ప్రయత్నాలు చేసిన వారి వివరాలను సేకరించనుట్లు తెలియవచ్చింది.