Monday, January 13, 2025

ప్రణాళికా లోపాలతో నగరీకరణ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రద్దీని తగ్గించడానికి గతంలో అనేక ప్రణాళికలు తయారైనా అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్యమైన సంస్థలన్నీ ఢిల్లీ, ముంబై నగరాల్లోనే కేంద్రీకృతం కావడంతో రద్దీ పెరిగిపోతోందని, కొన్ని ముఖ్యమైన సంస్థలను ఇతర నగరాలకు బదలాయిస్తే ఆ నగరాలు కూడా సమాన అభివృద్ధితో రాణిస్తాయన్న ఆలోచనతో ఢిల్లీలో ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డిఎ) ప్రధాన కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా 2001లో హైదరాబాద్‌కు తరలించారు.

ఇది భారత దేశంలోని బీమా రంగాన్ని పర్యవేక్షించే స్వతంత్ర సంస్థ. ఇది జీవిత బీమాను మాత్రమే కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తుంది. ఈ విధంగా ప్రధాన సంస్థలను వేరే నగరాలకు తరలిస్తే ముంబై, ఢిల్లీ వంటి నగరాలు రద్దీ నుంచి కాస్త కోలుకోగలుగుతాయన్న లక్షంతో ఈ ప్రయత్నం చేశారు. అయితే ఆ తరువాత ప్రభుత్వాల ఆలోచనల మాదిరిగానే ఈ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు.ఇది జరిగి 24 సంవత్సరాలు కావస్తున్నా ఈ ప్రణాళిక కాగితాలకే పరిమితం కావడం పరిశీలించవలసిన విషయం. దేశంలోని అగ్రనగరాల పరిస్థితి ఏం చెబుతోందంటే వాయు నాణ్యత క్షీణిస్తున్నా, రద్దీ పెరుగుతున్నా జనం పట్టించుకోవడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల ధరలు, కాలుష్యం స్థాయిలు సమష్టిగా రానురాను పైపైకి వెళ్తున్నాయి తప్ప కిందకు దిగడం లేదు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని రెసిడెన్షియల్ ధరలు 2019 నుంచి అంచనాలకు మించి 57 శాతం వరకు పెరిగాయి.

నగరంలోని వాయు నాణ్యత స్థాయిలు చాలా దీనస్థితికి, ఇంకా తీవ్రంగా చేరుకున్నా రెసిడెన్షియల్ భవనాల ధరల్లో మార్పు మాత్రం రాలేదు. రియల్ ఎస్టేట్ రంగం ఉజ్వలంగా సాగుతోంది. ఏటేటా వాయు కాలుష్యం నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించడం ఆనవాయితీగా మారడంలో ఆశ్చర్యపడనక్కర లేదు. ఢిల్లీయే కాదు ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. దేశంలోని వాయు కాలుష్య నగరాలుగా రికార్డుకెక్కిన టాప్ 10 నగరాల్లోనూ రెసిడెన్షియల్ భవనాల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. వాయు కాలుష్య స్థాయిల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరీకరణ భారతాన్ని అత్యంత నివాసయోగ్యంగా తీర్చిదిద్దడంలో చిన్నచూపు చూస్తున్నారనడం వివాదం లేని వాస్తవం. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం దేశంలోని నగరాల మురికివాడల్లో 65 మిలియన్ మంది నివసిస్తున్నారు. ముంబై నగరం ఒక్కటే మురికివాడల్లో 5 మిలియన్ మందికి చోటు కల్పిస్తోంది. నగర జనాభాలోని 52.5 శాతం మంది ఇక్కడే నివసిస్తున్నారు.

పౌర కనీస సదుపాయాలు, సేవలు రానురాను క్షీణిస్తున్నాయి. దీనికి పౌరుల ఉదాసీనతే కారణం అయినా పూర్తిగా వారినే నిందించలేం. నగరాలకు, పట్టణాలకు సమీప గ్రామాల నుంచి ఉద్యోగ అవకాశాలు వెతుక్కోడానికి, ఇతర ఉపాధి మార్గాలు చూసుకోడానికి జనం వలస వస్తుంటారు. ఈ విధమైన ప్రాంతీయ అసమతుల్యత దేశ అభివృద్ధి చరిత్రలో ఒక అంశంగా కొనసాగుతోంది.ఏళ్ల పొడుగునా ఇతర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వలస వచ్చేవారి భారాన్ని నగరాలు భరించక తప్పదు. ఈ విధమైన పరిస్థితికి దారి తీయడానికి ప్రధాన కారకుల్లో ప్రభుత్వంతో పాటు టౌన్ ప్లానర్లు, పారిశ్రామిక అధినేతలు అతిపెద్ద దోషులుగా కనిపిస్తుంటారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ లేఅవుట్ల నిర్మాణంలో నిబంధనల గురించి అంతగా పట్టించుకోరు. దాంతో నిర్మాణాల నుంచి దుమ్ముధూళి కాలుష్యం పెరుగుతోంది. పారిశ్రామిక సంస్థలు తమ ఉత్పత్తుల వ్యర్థాల నుంచి వెలువడే పర్యావరణ ప్రమాదకర ఉద్గారాల గురించి శ్రద్ధ చూపించరు.

ఇక పాలనా యంత్రాంగం తాము కచ్చితంగా అమలు చేయాల్సిన చట్టపరమైన చర్యలను ఏదో మొక్కుబడి తంతుగా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో జెరోధా అనే సామాజిక సంస్థ నిర్వాహకులు నితిన్ కామత్, నగరాల్లో వాయు నాణ్యత, నీటి స్వచ్ఛత లతో ఆస్తుల విలువలను అనుసంధానం చేయాలని ఇటీవలనే ప్రతిపాదించారు. అంటే ఈ నాణ్యతల సూచికలు అధ్వానంగా ఉంటే ఆయా ఆస్తులను చాలా తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది.ఈ ప్రతిపాదన సమంజసంగా ఉన్నా అమలు చేయడం దాదాపు అసాధ్యమే అవుతుంది. ఉద్యోగాలు కల్పించే వాణిజ్య కేంద్రాలకు జనం పోటెత్తుతుంటారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో నివసించడానికి వీలుగా ఆస్తులను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అలాంటి చోట స్థలాల లభ్యత అంతగా లేకుంటే ఆస్తుల ధరలు అమాంతంగా పెరుగుతుంటాయి. ఇలాంటి లోపభూయిష్టమైన పట్టణీకరణ నిర్వహణ నుంచి దేశంలోని నగరాలు, పట్టణాలు తమంత తాము కోలుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది.

ఫలితంగా అనుకున్న అభివృద్ధి లక్షాల సాధనలో వెనుకబడిపోతున్నాయి. సుస్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు సమకూరేలా సమగ్రమైన నగర ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పాదచారులకు వెసులుబాటు కలిగేలా జోన్లను, రోడ్లను విస్తరించాలని, మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు వంటి రవాణా సౌకర్యాలు విస్తృతంగా మెరుగుపడేలా ప్రాధాన్యం కల్పించాలని, ఈ అర్బన్ సర్వీసులను సమర్ధంగా నిర్వహించేలా మున్సిపల్ కార్పొరేషన్లను బలోపేతం చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. నగరీకరణ చక్కగా ఉండాలంటే నిరంతర పర్యవేక్షణ ఒక్కటే పరిష్కార మార్గం. పర్యావరణ హితమైన, సరైన ప్రణాళికాబద్ధ నగరాలను తీర్చిదిద్దేందుకు భాగస్వాములంతా సిద్ధం కావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News