Monday, November 25, 2024

బిసిల సమగ్రాభివృద్ధికి – సంపూర్ణ రిజర్వేషన్ల అమలే శరణ్యం: విసి రవీందర్‌యాదవ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు జరిగినప్పడే వెనకబడిన తరగతుల అభ్యున్నతి సాధ్యమని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. బిసి రిజర్వేషన్ల ఆధ్యుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా ఓయూ పరిపాలనా భవనంలో ఓయూ బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్స్, డాక్టర్ బీఆర్ అంబెడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, మహలఖా భాయి పరిశోధనా కేంద్రాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై నివాళులర్పించారు. వెనకబడిన తరగతుల రెండవ కమిషన్‌కు చైర్మన్ గా వ్యవహరించిన బిపి మండల్ ఆలోచనలను, సిఫార్సులను సంపూర్ణంగా అమలుచేయకపోవటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందిరాగాంధీ హయాంలోనే బిపి మండల్ సమగ్ర నివేదిక ఇచ్చినా విపి సింగ్ ప్రభుత్వం వాటిని ఆమోదించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కాలంలోనూ క్రిమిలేయర్ లాంటి ఆనాలోచిత విధానాలను చొప్పించారని అన్నారు. బిసిలకు విద్యా, ఉద్యోగ అవకాశాలతో పాటు పదోన్నతులు, రాజకీయాల్లోనూ సంపూర్ణంగా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దామాషా పద్దతిలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ ప్రతిపాదన నేటికీ అనివార్యమేనని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అందించే రిజర్వేషన్లకు చూపిన చొరవ బీసీల రిజర్వేషన్ల అమల్లో ప్రభుత్వాలు చూపలేకపోయాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేసి బిసి రిజర్వేషన్లను సంపూర్ణంగా అమలు చేయటం ద్వారా అత్యధిక శాతం ఉన్న బిసిల అభ్యున్నతికి ప్రభుత్వాలు తోడ్పాటునందించాలని కోరారు. ఈకార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ, యూజిసి వ్యవహారాల డీన్ ప్రొపెసర్ జి. మల్లేశం, పరీక్షల నిర్వహణా విభాగాధిపతి ప్రొఫెసర్ రాములు, బిసి సెల్, మహాత్మా జ్యోతిబా ఫూలే పరిశోధనాకెంద్రం డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ఎస్సీ, ఎస్టీ సెల్, అంబేద్కర్ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, మైనారిటీ సెల్, మహా లఖబాయి చందా మహిళా పరిశోధనా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సైదా అజీమున్నీసా, డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్, ఔటా ప్రతినిధులు, ఓయూ ఎన్జీఓ అధ్యక్షుడు బి. జ్ఞానేశ్వర్ ఇతర అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది బిపి మండల్ చిత్రపటానికి నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News