Monday, January 20, 2025

మేమే కొంటాం

- Advertisement -
- Advertisement -

Integrated New Agriculture Policy should come:cm kcr

యాసంగి ధాన్యం ప్రతి గింజా

డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం

యుద్ధ ప్రాతిపదికన మూడు,నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత బాధ్యతను విస్మరించింది
ధాన్యం కొనాలని కోరడానికి వెళ్లిన మంత్రులను అవమానించారు
తెలంగాణ ప్రజలు నూకలు అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి పొగరుబోతుగా మాట్లాడారు

కేంద్రం వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్ర చేస్తోంది
ఓట్ల కోసం బిజెపి దేశంలో భావోద్వేగాలను రెచ్చగొడుతోంది
ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతోంది
కేంద్రంలో దిక్కుమాలిన దరిద్రపు ప్రభుత్వం ఉంది

6 ప్రైవేట్ వర్శిటీలకు కేబినెట్ ఆమోదం
తక్షణమే ఫార్మా యూనివర్సిటీ
వర్సిటీల్లో 3500 పోస్టుల భర్తీకి విద్యాశాఖ కామన్‌బోర్డు నియామకానికి నిర్ణయం
111 జివొ ఎత్తివేత ఖాయం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు. రైతులకు ఊరట కలిగించే విధంగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యాసంగిలో పండిన వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కెసిఆర్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 5 వరకు మరోసారి ఉద్ధృతంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 6 ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును ఆమోదించినట్లు కెసిఆర్ వెల్లడించారు. కావేరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అమిటీ, సీఐఐ, గురునానక్, ఎంఎన్‌ఆర్ విశ్వవిద్యాలయాలకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సివిల్ ఏవియేషన్ విస్తృతంగా పెరుగుతోందన్నారు. యూనివర్సిటీల్లో 3,500 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఆధ్వర్యంలో కామన్ బోర్డు ఏర్పాటు చేసి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సివిల్ ఎవియేషన్ రంగం అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు రెండో రన్ వే ఏర్పాటుకు నిర్ణయం తీసకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబయి ఎయిర్‌పోర్టు రెండో స్థానంలో, బెంగుళూరు ఎయిర్‌పోర్టు మూడో స్థానంలో, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగవ స్థానంలో ఉందని అన్నారు.

111 జీవో ఎత్తివేస్తూ నిర్ణయం

తమ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. సిఎస్ ఆధ్వర్యంలో త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు.

యాసంగి ధాన్యం మొత్తం కొంటాం

రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.కనీస మద్దతు ధర ప్రకారం క్వింటాల్ ధాన్యానికి రూ.1,960 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం నుంచే యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ధాన్యం డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు.

యాసంగి ధాన్యంలో వచ్చే 37 శాతం నష్టం కేంద్రమే భరించాలని, అది చేయకుండా కేంద్రం రాద్ధాంతం చేస్తుందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. మోరీల్లాగా నోరులు పెట్టుకుని పెడ బొబ్బలు పెడుతున్నారని విమర్శించారు.ధాన్యం కొనటం చేతకాదని కేంద్రం నేరుగా చెప్పొచ్చు కదా..? అని అడిగారు.బాయిల్ రైసు ఎగుమతి చేస్తూ.. చేయట్లేదని అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. యాసంగి వడ్లలో నూకల శాతం పెరుగుతుందని చెప్పారు. సాధారణంగా వర్షాకాలంలో క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం వస్తాయి, అదే యాసంగిలో 35 కిలోలు మాత్రమే వస్తాయని వివరించారు. యాసంగి ధాన్యం మిల్లింగ్ చేస్తే క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం రాదని, యాసంగిలోనూ క్వింటాల్‌కు 67 కిలోల బియ్యం ఇవ్వాలంటే కుదరదని అన్నారు. క్వింటాల్ వడ్లకు 34 కిలోల బియ్యమే వస్తుందని వివరించారు. 30 కిలోల తేడాను భరించేందుకు కేంద్రం ఒప్పుకోవట్లేదని అన్నారు. భారతదేశం ఆహార భద్రతను కేంద్రానికి అప్పగించింది. కాబట్టి ఆ నష్టాన్ని కేంద్రం భరించాలని అన్నారు. అందుకే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారని, గిడ్డంగుల సామర్థ్యం ఎఫ్‌సిఐకే ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆహర భద్రత బాధ్యతను విస్మరించిందని అన్నారు. ధాన్యం కొనడానికి కేంద్రం వద్ద డబ్బులు లేవా?.. ప్రధాని మోదీకి మనసు లేదా..? అని ప్రశ్నించారు.

ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారు

భారత ప్రజల ముందు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించామని, అందుకే ఢిల్లీలో ధర్నా చేశామని సిఎం కెసిఆర్ చెప్పారు. బ్యాంకులను ముంచిన కార్పొరేట్లను కేంద్రం కాపాడుతుందని ఆరోపించారు. ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారని విమర్శించారు. బ్యాంకులను ముంచినోళ్లు సేఫ్‌గా లండన్‌లో ఉంటున్నారని, వారిని అరెస్టు చేయడానికి సిబిఐ అధికారులు వెళితే వారిని వెనక్కి పిలిపిస్తారని పేర్కొన్నారు. బడా కంపెనీలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు,కానీ తెలంగాణలోని 60 లక్షల మంది రైతులకు సంబంధించి రూ .3,500 కోట్లు ఇవ్వమంటే మాత్రం కేంద్రం భరించడం లేదని చెప్పారు. ఒక్క అదానీ గ్రూప్‌కే ఇటీవల రూ .12 వేల కోట్లు మాఫీ చేశారని గుర్తు చేశారు. వారిని మాత్రం ఏమీ అనరని, రైతుల కోసం రూ .3,500 కోట్లు ఖర్చు చేయమంటే మాత్రం చేయరని పేర్కొన్నారు. రైతులను ఎలా కాపాడుకోవాలో తమ బాగా తెలుసు అని, రైతాంగాన్ని కాపాడుకోవాలని కేబినెట్ సమావేశంంలో చర్చించినట్లు తెలిపారు. ఈ ఏడాది 21 లక్షల ఎకరాలలో యాసంగిలో వరి పంట తగ్గిందని, యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీ నియమించామని వెల్లడించారు. రాష్ట్రంలో సమర్థమైన ప్రభుత్వం ఉందని, రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం చేయాలని నిర్ణయించామని అన్నారు.

పక్కా ప్రణాలికతో కీలక నిర్ణయాలు తీసుకున్నాం

సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి, చితికిపోయిన రంగం వ్యవసాయ రంగమని,‚ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం చెల్లాచెదురై ఆకలి చావులు చూశామని, అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పక్కా ప్రణాలికతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అనేక ఉద్దీపనలు సమకూర్చామని అన్నారు. సాగునీటి రంగం, నాణ్యమైన విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.మిషన్ కాకతీయతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో కోతలు లేకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీరు, విద్యుత్ వసతి బాగా పెరిగిందని, దాంతో గొప్ప పంటలకు తెలంగాణ ఆలవాలంగా మారిందని అన్నారు. ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయడం, మిషన్ కాకతీయ పూర్తి చేయడం, రీ ఇంజినీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి వరల్డ్ లార్డెస్ట్ మల్టీ ఇరిగేషన్ స్కీం పూర్తి చేశామని తెలిపారు.

వాటి ఫలితాలు కూడా అందుతున్నాయని చెప్పారు. వీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాగు ఖర్చు కోసం ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి ఇస్తున్నామని తెలిపారు. రైతులు చనిపోతే 8 రోజుల్లో రైతు బీమా అందించే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. 24 గంటలు ఉచిత విద్యుత్, ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. గతంలో రైతులు బకాయిలు ఉన్న రూ.500 కోట్ల నీటి తీరువా రద్దు చేసి, కొత్తగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా ఇవి ఇప్పడం లేదని చెప్పారు. కరోనా సమయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో 7 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందని అన్నారు.

కేంద్రంలో దిక్కుమాలిన, దరిద్రపు ప్రభుత్వం ఉంది

కేంద్రంలో దిక్కుమాలిన, దరిద్రపు ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తోందని కెసిఆర్ ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని కుదేలు చేయాలని చూస్తుందని అన్నారు. వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని కోరినా చేయడం లేదని చెప్పారు. ఎరువుల ధరలు భారీగా పెంచారని, తెలంగాణ ధాన్యం విషయంలో కేంద్రం పిచ్చిగా వ్యవహరించిందని మండిపడ్డారు. దేశ ఆహార భద్రత కేంద్రానిదేనని గుర్తు చేశారు. విద్యుత్ సంస్కరణలు పేరిట రైతుల నుంచి ఛార్జీలు వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెబుతున్నారని పేర్కొన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని, ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నూకలు తినే అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి అన్నారని… ఇంత చక్కని పంటలు పండిస్తూ ప్రజలు నూకలు తినాలా..? అని ప్రశ్నించారు.ఎంత గర్వం కేంద్ర మంత్రికి అని మండిపడ్డారు. ‘క్యా చమత్కార్’ అంటూ కేంద్ర మంత్రి పిచ్చి ప్రేలాపనలు చేశాడని, అసలు ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా..? అని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదని, వారి అసమర్థతను ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు ఉద్యమించారని గుర్తు చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టాలని ప్రధాని మోదీ చూశారని ఆరోపించారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పి 3 సాగు చట్టాలను రద్దు చేశారని అన్నారు. ఇప్పుడు ఎరువుల ధరలు విపరీతంగా పెంచి సాగు వ్యయం పెంచారని మండిపడ్డారు.

పెట్రోల్, డీజిల్‌పై కేంద్రమే రోజు రోజుకు ధరలు పెంచుతోంది

దేశంలో కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు ఉంటాయని, తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి పన్నులు పెంచలేదని సిఎం కెసిఆర్ అన్నారు. కానీ , కేంద్రం రోజుకు రూపాయి చొప్పున పెంచుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై తమ ప్రభుత్వం పైసా పెంచలేదని, కేంద్రమే రోజు రోజుకు ధరలు పెంచుతోందని సిఎం మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచలేదని, కేంద్రం మాత్రం ఎన్నోసార్లు ఎక్సైజ్ పన్నులు పెంచిందని విమర్శించారు. కేంద్రం పన్నులు పెంచి… రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని అంటున్నారని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహారించడమే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని ఆరోపించారు. రాష్ట్రం బలహీనంగా…కేంద్రం బలంగా ఉండేలా విధానాలు ఉన్నాయని చెప్పారు. దేశంలో రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి… ఆర్థికంగా దివాళా తీయాలి..రాష్ట్రాలు వారి చెప్పుచేతల్లో ఉండాలన్నదే కేంద్రం ఉద్ధేశమని అన్నారు. ఇది ఫెడరల్ సమాఖ్య స్పూర్తికి పూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం పరిణితి పెరిగిన దేశాల్లో సెంట్రల్ నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ అవుతాయని చెప్పారు. కేంద్రం రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాల్సింది పోయి .. రాష్ట్రాల హక్కులు హరిస్తుందని విమర్శించారు.

రాజకీయ లబ్ధి మత ఘర్షణలు జరిగేలా చూస్తున్నారు

రాజకీయ లబ్ది కోసం బిజెపి పార్టీ మతోన్మాదాన్ని పేట్రేగించే ప్రయత్నం చేస్తుందని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఓట్ల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలోనే కాశ్మీర్ ఫైల్స్ అని, ఇంకోటని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగ జరిగిందని,కానీ ఎన్నికలు ఉన్న గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలల్లోనే శ్రీరామనవమి సందర్భంగా రాళ్లు రువ్వడం, మతఘర్షణలు జరిగాయని తెలిపారు. రాజకీయ లబ్ధి మత ఘర్షణలు జరిగేలా చూస్తున్నారని విమర్శించారు. సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును.. హిజాబ్ అంశంతో ప్రపంచస్థాయిలో బద్నాం చేశారని అన్నారు. కర్ణాటకలో ఆరు రకాల నిషేదాలు ఉన్నాయని తెలిపారు. ఐటీ పరిశ్రమ దెబ్బతింటే నిరుద్యోగిత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మత పిచ్చితో దేశం ఛిన్నాభిన్నమైతే సంబాలించుకోవడానికి వందేళ్ల పడుతుందని చెప్పారు. విదేశాలలో 13 కోట్ల మంది మన దేశ ప్రజలు ఉంటున్నారని, దేశంలో ఏమైనా ఆ ప్రభావం వారిపై ఉంటుందని అన్నారు. అందుకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఉన్మాదుల చేతిలోపడి కొట్టుకుపోతే వంద సంవత్సరాలు భారత దేశం వెనక్కి పోతుందని తెలిపారు. ఉన్మాదుల చేతులో మేధావులు, యువత పడితే దేశం వెనక్కి వెళ్లిపోతుందని తెలిపారు. భారత్ బుద్ధి జీవుల దేశం అని, మతోన్మాదాన్ని దేశ ప్రజలు తిప్పికొడతారని అన్నారు. బిజెపి వైఖరిని ప్రజలు గమనించి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి

దేశంలో రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాల్సి ఉందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై చర్చించేందుకు భారత రైతాంగానికి చెందిన రైతు ప్రతినిధులతో హైదరాబాద్‌లో వర్క్ షాప్ నిర్వహించి అక్కడే పాలసీ ప్రకటిస్తామని వెల్లడించారు. రైతుల కోసం మరో మహాసంగ్రామం చేపడతామని రాకేశ్ టికాయత్ చెప్పారని, త్వరలోనే మొదలు పెడతామని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News