Wednesday, April 16, 2025

శాంతి చర్చలకు మేధావులే బాట వేయాలి

- Advertisement -
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలకు బేషరతుగా సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ 2 ఏప్రిల్ 2025 పత్రికా ప్రకటన ద్వారా తెలియచేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మావోయిస్టు పార్టీ తిరిగి శాంతి చర్చలకు ప్రతిపాదించింది. ఇప్పటికీ బలంగా ఉన్న చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత రెండు మూడేళ్ళుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో వందల సంఖ్యలో తీవ్రవాదులు, సానుభూతిపరులు మరణిస్తున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఈ చర్చలకు మావోయిస్టు పార్టీ తెరలేపిందని భావిస్తున్నారు.
చర్చల ప్రతిపాదనలు పంపిన మావోయిస్టు పార్టీ. చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు, పౌరహక్కుల సంఘాల నేతలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కృషి చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పీపుల్స్‌వార్, జనశక్తి పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇరవై ఏళ్ల క్రితం జరిగిన చారిత్రాత్మక శాంతి చర్చల ప్రస్థానాన్ని మరోసారి సింహావలోకనం చేసుకోవాలి. విప్లవ ఉద్యమాల చరిత్రలో అత్యంత కీలక పరిణామంగా భావించే చారిత్రిక చర్చల ప్రక్రియ జరిగి దాదాపు 20  సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఇరవై సంవత్సరాల అనంతరం దేశంలో ముఖ్యంగా ఉమ్మడి తెలుగురాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిందా లేక పోలీస్ యంత్రాంగానిదే  పైచేయి అయిందా అనే దానికి పలు విశ్లేషణలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. 2004 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో అప్పటి పీపుల్స్‌వార్, జనశక్తి తీవ్రవాదులకు వైఎస్‌ఆర్ సిఎంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల సమయంలోనే బీహార్‌లోని ఎంసిసి, ఆంధ్రప్రదేశ్‌లోని పీపుల్స్‌వార్‌లు విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించింది. అయితే, అప్పుడు పేరుకు ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఉన్నప్పటికీ ఈ చర్చలకు పీపుల్స్‌వార్‌ను ఒప్పించడంలో అప్పటి హోంశాఖ మంత్రి కుందూరు జానారెడ్డికే క్రెడిట్ దక్కుతుంది.
ఈ చర్చల విషయంలో తటస్థులుగా భావించే ఎస్‌ఆర్ శంకరన్, పొత్తూరి వెంకటేశ్వర్ రావు, కన్నబీరన్‌లు కూడా కీలక పాత్ర వహించారు. చర్చల ఎజెండా, చర్చలకు వచ్చే పీపుల్స్‌వార్ ప్రతినిధులకు ప్రభుత్వం తరఫున కల్పించే భద్రత, చర్చల ఎజెండా, చర్చలలో ప్రభుత్వ ప్రతినిధులు, తీవ్రవాద పార్టీల ప్రతినిధులు, పౌరస్పందన వేదిక లాంటి తటస్థ ప్రతినిధులు కీలకపాత్ర వహించారు. చర్చల ప్రక్రియ సందర్భంగా మొదటి నుండి చివరి వరకు జరిగిన సంచలన పరిణామాలు, ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, అంతర్గత విషయాలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకై చేసిన ఎత్తులు, పైఎత్తులు, చర్చలు విఫలమవడానికి దారితీసిన పరిస్థితులు ఇలా ఎన్నో అంతర్గత, ఆసక్తికరమైన సంచలన విషయాలను అప్పటి స్థానిక పత్రికలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పత్రికలూ, వార్తా చానెళ్లు ప్రచురించాయి, ప్రసారం చేశాయి.
ఈ చర్చలను ప్రస్తావిస్తూ ఇప్పటికీ పలువురు తమ వ్యాసాల ద్వారా తెలియచేస్తున్నారు. ఈ చర్చల ప్రక్రియలో ఎవరిది పైచేయి అయిందనేది పక్కకు పెడితే, పీపుల్స్‌వార్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు అనేవి చారిత్రాత్మకమే అని చెప్పవచ్చు. అప్పటి చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉన్న పోడు భూములపై గిరిజనులకు హక్కు కల్పించాలనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది.
ఈ చర్చలకు ముందుగా ప్రభుత్వం నియమించిన అధికార పక్షం కమిటీ, మధ్యవర్తుల కమిటీ, తీవ్రవాద పక్షాల అనుకూల కమిటీ, వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, భిన్నవర్గాలు, ధ్రువాలకు చెందిన వారితో ఎడతెగని చర్చలు నిర్వహించడం, వారి అభిప్రాయాలను మంత్రి ఎంతో ఓపికతో వినడం జరిగేది. ఈ క్రమంలో ఎంతో మంది ప్రముఖులను హోం మంత్రితో కలవడం జరిగేది. ఈ శాంతి చర్చలు కొనసాగడానికి అప్పటి హోం మంత్రి కుందూరు జానారెడ్డి కీలక పాత్ర వహించినప్పటికీ, పీస్ కమిటీ లేదా తటస్థుల కమిటీ సభ్యులుగా ఉన్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్, ప్రొ. హరగోపాల్, స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వర్ రావు తోపాటు తటస్థులుగా భావించే మరికొందరు అత్యంత క్రియాశీలపాత్ర వహించారు.
ముఖ్యంగా పీపుల్స్‌వార్, జనశక్తి పార్టీలకు ఈ చర్చల పట్ల ప్రభుత్వానికి మధ్య ఒక అంగీకార వాతావరణం ఏర్పరిచారు. సరే, ఈ చర్చల వల్ల ఎవరిది పైచేయి అయిందనేది పక్కకు పెడితే, ఆదివాసులకు అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఒఎఫ్‌ఆర్) చేయడంలో ప్రముఖ పాత్రపోషించింది. ముఖ్యంగా అప్పటి శాంతి చర్చల్లో తటస్థుల కమిటీ, ప్రభుత్వ ప్రతినిధుల కమిటీ, పీపుల్స్‌వార్, జనశక్తి ప్రతినిధుల కమిటీలు క్రియాశీల పాత్ర వహించాయి.  2004 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని మానవ వనరుల సంస్థ (ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి ఇన్‌స్టిట్యూషన్) లో జరిగిన ఈ శాంతి చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగింది. దీనికి నిదర్శనం, ఈ చర్చల వివరాలను కవరేజీ చేయడానికి వచ్చిన జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలే ఉదాహరణ. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చర్చలపట్ల చొరవ చూపేందుకు అప్పటి హోం మంత్రి జానారెడ్డి మాదిరిగా నిస్వార్థ, నిష్కల్మష నాయకుడి అవసరం కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంది. జానారెడ్డికి అప్పటి మంత్రి వర్గ సహచరులైన ధర్మాన ప్రసాదరావు, కోనేరు రంగారావు, డిఎస్. రెడ్యానాయక్‌లతో పాటు కేశవరావు, పాలడుగు వెంకట రావు, మర్రి శశిధర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా వీరికి పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. వీరితోపాటు అటు మావోయిస్టులు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసే తటస్థుల అవసరం కూడా ఉంది. దీనికి, దేశంలోని మేధావివర్గం తమకుతాముగా ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ఇటీవల హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సమావేశమైన కొందరు తటస్థ ప్రముఖులు ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వ, నక్సలైట్ పార్టీల మధ్య చర్చలు జరపడానికి తాము చొరవ చూపుతామని ప్రకటించారు. అయితే, గతంలో రాష్ట్రస్థాయిలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం దీనికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. ఇది సాధ్యమయితే ప్రస్తుత వామపక్ష తీవ్రవాద రాష్ట్రాల్లో శాంతీయుత పరిస్థితులు ఏర్పడి ఆయా రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనించడానికి మార్గం సుగమవుతుంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రతిపాదిత ఏకపక్ష శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ నుండి కూడా గతంలో హైదరాబాద్‌లో ఉన్న గద్దర్, కల్యాణరావు, వరవరరావు లాంటి ప్రతినిధులు కూడా అవసరం ఉంది.
కె. వెంకటరమణ
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News