గత కొన్ని దశాబ్దాలుగా భూతాపం పెరుగుతోందన్నది మనకు తెలిసిందే. సముద్ర ఉపరితలం మీద ఉన్న ఉష్ణోగ్రతలను కూడా శాస్త్రవేత్తలు సంగ్రహిస్తున్నారు. కానీ దిగ్భ్రాంతి కలిగించే పరిశోధన సముద్రం అడుగున కూడా ఉష్ణతరంగాలను కనుగొనడం. సముద్ర నీటి మట్టాలపై ఎలాంటి హెచ్చరిక సంకేతాలు లేకపోయినా సముద్ర గర్భం నీటి అడుగున కూడా ఉష్ణతరంగాలు ( heat waves ) ఉన్నాయని శాస్త్రవేత్తలు పసిగట్టగలిగారు. అమెరికాకు చెందిన నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఒఎఎ) శాస్త్రవేత్తల నమూనాల ఆధారంగా ఈ పరిశోధన సాగింది. “ లోతులేని సముద్రం నీటి అడుగుకు వెళ్లి అసాధారణ సంఘటనలను పరిశోధించడం తమకు ఇదే మొదటిసారి.”
అని పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఎన్‌ఒఎఎ ఫిజికల్ సైన్స్ లాబొరేటరీ వాతావరణ శాస్త్రవేత్త డిల్లాన్ అమయా తన అనుభవం వెల్లడించారు. ఉత్తర అమెరికా చుట్టుపక్కల ఉన్న ఖండాంతర తక్కువ లోతు సముద్ర నీళ్లలో ఈ పరిశోధన సాగించారు. వీరు ముఖ్యంగా సముద్రాలు నిరంతరం వేడెక్కుతున్నాయని కనుగొనడం చెప్పుకోతగింది. సముద్రం మీదనే కాదు అడుగున కూడా. ఇది సముద్ర ప్రాణులపై ప్రభావం చూపిస్తోంది. ఉపరితలంపై ఉండే వేడి కన్నా అడుగున ఉన్న వేడి చాలా ఎక్కువగా సుదీర్ఘకాలం ఉంటోందని బయటపడింది. ఈ వేడి ఒక తీరానికి మరో తీరానికి వేరేగా ఉంటుంది.
లోతు అంతగా లేని తీరంలో సముద్ర ఉపరితల వేడి, నీటి అడుగునున్న వేడి ఒకే సమయంలో సంభవిస్తుంటాయని పరిశోధకులు గ్రహించారు. అయితే చాలా లోతున్న సముద్రంలో అడుగునున్న ఉష్ణతరంగాలు ఉపరితలంపై ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా విపరీతంగా పెరగవచ్చు. ఈ ఉష్ణోగ్రత అర సెంటిగ్రేడ్ నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండవచ్చు. ఈ వేడి స్థిరంగా ఉండడంతో సముద్రంలో జీవించే ప్రాణులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు.