ఈ నెలాఖరుకల్లా పూర్తి కానున్న ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు
మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : జెబిఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ), జెబిఎస్ నుండి శామీర్ పేట్ (21 కి.మీ) మెట్రో కారిడార్‌లకు డిపిఆర్‌లు సిద్దం చేయడానికి అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఎఎంఎల్) ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. డిపిఆర్‌ల తయారీకి ముఖ్యంగా మూడు రకాలైన అధ్యయనాలు అవసరమని ఆయనన్నారు.
ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు (జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్), పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్‌లలో ప్రస్తుతం జరుగుతున్న రోజు వారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్‌లో జరగబోయే రోజు వారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు పరిశీలిస్తామని ఎన్‌విఎస్ రెడ్డి చెప్పారు.
ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న థూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతు జీవాల జీవవైవిధ్యం, జీవనాధారభ్రుతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. భూసామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలనుఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. సామాన్యంగా ప్రతి అర కిలోమీటర్ కి ఒక బోర్ హోల్ చొప్పున భూ సామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకోవడం జరుగుతోందని, ఒక్కొక్క బోర్ హోల్ ను ఏభై నుండి వంద అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, ఏ స్థాయిలో భూమి గట్టి తనంగానీ లేదా రాతి పొరలు తగులుతాయో పరిశీలిస్తామని మెట్రో ఎండి చెప్పారు.
ఇప్పటికే హెచ్‌ఎండిఎ, జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టడం వల్ల, ఇప్పుడు మెట్రో సంస్థ జెబిఎస్ – మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జెబిఎస్ – శామీర్ పేట్ మార్గంలో 19 చోట్ల ఈ భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని జాగాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. ప్రజలకుఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ అధ్యయనాలన్నీ పూర్తి చేసి మర్చినెలాఖరుకు శంషాబాద్ విమానాశ్రయం – ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డిపిఆర్ లను సంపూర్ణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డిపిఆర్ లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడించారు.