కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామమోహన్ నాయుడు గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో 36 ఏళ్ల రామమోహన్ నాయుడు అత్యంత పిన్నవయస్కుడైన మంత్రి. అత్యంత ముఖ్యమైన ఈ మంత్రిత్వశాఖ బాధ్యతలను తనకు అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ్తనకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, క్యాబినెట్‌లో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీకి ఆయన కృగజ్ఞతలు తెలిపారు. విమానయానం సామాన్యుడికి రోజురోజుకు చేరువవుతున్న తరుణంలో విమానయానం మరింత సులభతం చేయడమే తన ముఖ్యమైన ప్రాధాన్యతలలో ఒకటని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తన మంత్రిత్వశాఖకు సంబంధించి ఒక 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందిచనున్నట్లు ఆయన తెలిపారు. విమాన టిక్కెట్ల ధరలు అధికంగా ఉండడంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తాను త్వరలోనే సమీక్షా సమీవేశాలు నిర్వహింనున్నట్లు ఆయన చెప్పారు. విమాన టికెట్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా తగ్గించడం అతి పెద్ద సవాలని ఆయన చెప్పారు. టికెట్ల ధరలు అందుబాటులోకి రానంతవరకు విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి చేరువచేయడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ నాయకత్వంలో ఎన్డిఎ కూటమి బలంగా ఉందని, తమకు అప్పగించిన బాధ్యతల పట్ల ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలన్నీ సంతృప్తిగా ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.