Thursday, March 20, 2025

పరీక్షలకే పరీక్ష

- Advertisement -
- Advertisement -

ఏడాది కాలంగా విద్యార్థి నేర్చుకున్న జ్ఞానానికి గంట, మూడు గంటల్లో పరీక్షించడం సబబా? ఇది నిజంగా విద్యార్థి ఏడాది కాలంగా నేర్చుకున్న అభ్యసనానుభవాలను అంచనా వేయగలుగుతుందా? విద్యార్థి పరిపూర్ణ మూర్తిమత్వంను ఈ పరీక్షలు ఎంత వరకు కొలమానం? ఏళ్ళుగా వస్తున్న మన పరీక్షా విధానం పైన పలు రకాల సందేహాలు మన విద్యారంగం మేధావులు, నిపుణులు వ్యక్తం చేస్తూ వచ్చారు. బ్రిటీష్ వలసవాదం నుండి వచ్చిన ఈ పరీక్షా విధానం మెకాలేకి నకలని, అశాస్త్రీయమైనదని, సమూలంగా ఈ విధానం మారాలని, విద్యార్థులను ఒత్తిడికి గురిచేయని పరీక్ష విధానం కావాలని కోరుకున్నాం. అందులో భాగంగానే మన పరీక్షా విధానం లోని లోపభూయిష్టతను సరిదిద్ది పరీక్షా సంస్కరణలను తెచ్చుకున్నాం! విద్యాహక్కు చట్టం -2009 కొంతలో కొంతైనా మన అనుమానాలు నివృత్తి పరచగలిగింది.

సరికొత్త పరీక్షా సంస్కరణకు అవకాశం కల్పించింది. విద్యాహక్కు చట్టం- 2009, సెక్షన్ 29 (1) హెచ్ ప్రకారం విద్యార్థి ఏడాది కాలంగా పొందిన అభ్యసనానుభవాలు, జ్ఞానసామర్ధ్యాలు, ఒత్తిడి లేకుండా పరీక్షించే పరీక్ష విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) మన నూతన ప్రక్రియ! ఈ పరీక్షా విధానం మౌలిక మార్పులు ఏమంటే నేర్చుకున్న దంతా గంట, మూడు గంటల్లో జవాబులు రూపంలో కక్కేసే కంటే! విద్యార్థి అభ్యసన అనుభవాలతోపాటు, విద్యార్థి విద్యా సామర్థ్య అంచనా పరికరం పరీక్ష కూడా నిరంతర సమగ్ర ప్రక్రియగా ఉండాలి. అది ఏ పాఠశాలలో, ఏ విషయంలో నేర్చుకుంటున్నామో! ఆ ఉపాధ్యాయులు, ఆ అధ్యాపకులే ఎప్పటికప్పుడు నిరంతరం విద్యార్థిని అంచనా వేసుకుంటూ విద్యార్థికి పరీక్షనుండి గమనించిన అంశాలు నిరంతరం సమీక్షించి, సరిచేయడానికి సాధనంగా ఉండాలి. ఆసాధనమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) విధానం అని విద్యాహక్కు చట్టం స్పష్టం చేసింది. దీని ప్రకారం నిర్మాణాత్మక మూల్యాంకనం (ఎఫ్‌ఎ), ఇది నాలుగు దశలుగా సబ్జెక్టును విభజించి, ఆ సబ్జెక్ట్‌లో రాత సామర్థ్యం, పఠనసామర్థ్యం, ప్రాజెక్టు వర్క్ (పని అనుభవం), స్లిప్ టెస్టు (జ్ఞాన అనుభవం) వీటన్నింటినీ తరగతి సబ్జెక్టు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో నిర్వహించబడి ఒక్కో అంశానికి 5 మార్కులు చొప్పున సగటున 20 మార్కుల ఏడాదిలో ఇవ్వబడతాయి.

ఈ నిర్మాణాత్మక పరీక్ష అనేది తరగతి సబ్జెక్టు ఉపాధ్యాయుల వ్యక్తిగత బోధన సరిదిద్దడానికి, ఉపాధ్యాయులు తమ బోధనానుభవాలు సమీక్షకు, విద్యార్థి తాను వెనకబడిన విషయం తనకు తాను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. ఒక విధంగా ఇవి మనం ఎంతోకాలంగా కోరుకున్న మార్పులే! ఇకపోతే సిసిఇలో రెండవ అంశం ఏమంటే సబ్జెక్టు రెండు భాగాలుగా విభజించి ఒక్కో సెమిస్టర్‌కు 40 మార్కుల చొప్పున రెండు సెమిస్టర్‌లు కలిపి 80 మార్కులకు విద్యనేర్చిన పాఠశాలలోనే సంగ్రాహనాత్మక మూల్యాంకనం జరుగుతుంది. ఈ సంగ్రాహ నాత్మక మూల్యాంకనంలో విద్యార్థి పొందిన జ్ఞానంతో పాటు, ఆయా సబ్జక్టులలోని ఆరు అభ్యసన సామర్థ్యాలు పరీక్షించబడతాయి. అంటే విద్యార్థి ఆ వయసులో పొందాల్సిన విద్యా సామర్థ్యాలు ఎంతో కొంత నిజాయితీగా అంచనా వేయగలిగిన విధానం. ఈ మొత్తం విద్యార్థి పొందిన 100 మార్కుల నుండి 3 నుండి 10 వరకు గ్రేడులను ఆయా విద్యార్థులకు పొందిన మార్కులను బట్టి ఇస్తారు.

ఈ గ్రేడులే విద్యార్థి సమగ్ర మూల్యాంకనం అంచనాగా భావించి బోధనా లక్ష్యాలు విద్యార్థికి అందేలా ముఖ్యంగా సబ్జక్టు ఉపయోగపడే అంశంపైనే ఈ పరీక్షలు! విద్యార్థి, ఉపాధ్యాయులు చేతిలో నిరంతర సమగ్ర సాధనం అయిన ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానం వచ్చి15 ఏళ్ళుగడిచినా నేటికీ దాన్ని సంపూర్ణంగా అమలు జరిపే ధైర్యం పాలక వర్గాలకు లేదు. ఇటు అర్థం చేసుకొని అనుసరించే స్థితికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులలో లోపించింది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా వ్యవస్థ ఒత్తిడి తట్టుకోలేక, మానెటరింగ్ వ్యవస్థ సరిదిద్దుకోలేక, ఇప్పటికే సంగ్రహనాత్మక మూల్యాంకనం వార్షిక పరీక్షగా, పాత వాసనలతో నిర్వహిస్తున్న 80 మార్కులకు గాను, నిర్మాణాత్మక మూల్యాంకనం 20 మార్కులు కలిపి పాత పద్ధతిలో 100మార్కులకు ఎస్‌ఎస్‌సి పరీక్ష నిర్వహించపూనుకుంది. ఇది ఈ ఏడే అమలు పరచాలని అధికారులు ప్రయత్నించారు కూడా? కానీ, కొన్ని సాంకేతిక సమస్యల వలన మరుసటి ఏడాదికి వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా మరో పరీక్ష మార్పుకు సైతం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

మార్చిలో పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సరైన గ్రేడ్ రాని పక్షంలో మే నెలలోపు మరో ఇన్‌స్టంట్ పరీక్ష నిర్వహించి ఒకేసారి ఫలితాలు ప్రకటిస్తామని ప్రకటించారు. అంటే పాత సప్లిమెంటరీ పరీక్షలు తిరిగి పునరుద్ధరణ అన్న మాట! అంటే ప్రైవేటు విద్యా వ్యవస్థ కోరికలు తూచా తప్పకుండా అమలు జరపడానికి అధికారులు, పాలకులు సంసిద్ధం అయ్యారనే విషయం సుస్పష్టం అవుతుంది. అభ్యసనానుభవాలు, పాఠ్యాంశాలు అధ్యయనంలో అంతర్లీనంగా, అంతర్భాగంగా జరగాల్సిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) ప్రక్రియ మన పరీక్ష విధానంలో ఒత్తిడి లేని సులభతరం అయిన విధానాలకు సూచికనై ఉండగా, దాన్ని బలోపేతం చేయకపోగా ఎటు తిరిగీ మన పాత మూల్యాంకనం విధానం వైపు మన విద్యాధికారుల ఆలోచనలు కొనసాగడంలో అంతర్యం ఏమిటో ఒకపట్టాన అర్థం కాదు? మనం చట్టంగా తెచ్చుకున్న సులభం, సరళతరం అయిన పరీక్ష సంస్కరణ ఒత్తిడి లేని నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రక్రియకు బదులు దొడ్డిదారిన తెస్తున్న పాత మూల్యాంకనం విధానం ఏ రూపంలో తెచ్చినా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మనం దీర్ఘకాలిక పోరాటంతో విద్యాహక్కు చట్టంగా తెచ్చుకున్న నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రక్రియ సంపూర్ణంగా అమలు చేయాలనే డిమాండ్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు ముందుకు పోవాల్సి ఉంది. ఒత్తిడి, విద్యార్థుల ఆత్మహత్యలు లేని సంపూర్ణ పరీక్షా సంస్కరణ అమలు దిశగా అడుగులు వేద్దాం. మన పాఠశాల పరీక్షా వ్యవస్థలో సరైన మార్పులను మాత్రమే స్వాగతిద్దాం.

ఎన్. తిర్మల్
9441864514

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News