Thursday, November 21, 2024

కిం కర్తవ్యం?

- Advertisement -
- Advertisement -

Inter exams from May 1 -Tenth exams from May 27

పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సమాలోచనలు
మే 1 నుంచి ఇంటర్ పరీక్షలు, మే 27 నుంచి టెన్త్ పరీక్షలు
మరికొన్ని రోజులు కరోనా పరిస్థితులు పరిశీలించి పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం
1 నుంచి 9తో పాటు టెన్త్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశం

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో టెన్త్, ఇంటర్, ఇతర పరీక్ష పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం మే 1నుంచి ఇంటర్ పరీక్షలు, మే 27 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే పరీక్షల నిర్వహణపై మరికొంత వేచిచూసి, ఇతర రాష్ట్రాలలో పరీక్షల నిర్వహణపై అవలంభిస్తున్న విధానాలను పరిశీలించి పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కరోనా పరిస్థితులు, పరీక్షలకు నిర్వహణపై విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌తో గత ఏడాది మార్చి నుం చి దాదాపు 11 నెలల పాటు బడులు మూతబడి ఉన్నాయి.

కరోనా కేసులు కొంచెం తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9వ తరగతి ఆపైన తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాథమిక తరగతులకు మాత్రం ఈ విద్యాసంవత్సరం ప్రత్యక్ష బోధన ప్రారంభం కాలేదు. కానీ పాఠశాలల్లో మళ్లీ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో మళ్లీ మార్చి 24 నుంచి విద్యాసంస్థలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పరీక్షలు నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరుగుతాయా..? లేక గత ఏడాది మాదిరిగా అందరినీ పాస్ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది అధిక శాతం ఆన్‌లైన్ క్లాసులే

ప్రస్తుత విద్యాసంవత్సరంలో అధిక శాతం ఆన్‌లైన్ క్లాసులే కొనసాగాయి. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు 9,10, ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహించారు. ఈ స్వల్ప వ్యవధి మినహా ఈ విద్యాసంవత్సరం అంతా 10వ తరగతి విద్యార్థులు పూర్తిగా ఆన్‌లైన్ క్లాసులపైనే ఆధారపడ్డారు. గత ఏడాది చివరి వరకు తరగతులు జరిగినప్పటికీ అందరినీ పరీక్షలు లేకుండానే పాస్ చేసిన నేపథ్యంలో ఈసారి కూడా పాస్ చేద్దామా..? లేక పరీక్షలు నిర్వహిద్దామా..?అని విద్యాశాఖ, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 10 తరగతితో సహా 1 నుంచి 9 తరగతుల విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండా పాస్ చేసే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిసింది. అయితే గత ఏడాది ఫార్మేటివ్ అసెస్‌మెం ట్స్ (ఎఫ్‌ఎ) పరీక్షలు, ఒక సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్ష జరిగాయి. వాటితోపాటు ఇంటర్నల్ మార్కు ల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయిం చి పాస్ చేశారు. అయితే ఈసారి అవేవీ జరుగలేదు. ఈ సారి ఒకే ఒక ఎఫ్‌ఎ పరీక్షను కొన్ని పాఠశాలల్లో నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ పరీక్షలు లేకుండా పాస్ చేయాల్సి వస్తే ఎలాంటి విధానం అవలంభించాలనే అంశంపై వివిధ కోణాలలో చర్చిస్తున్నారు. మే నెల మొదటివారం వరకు కరోనా వ్యాప్తిని పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని, కేసులు తగ్గితే కనుక పరీక్షలు నిర్వహించాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది. కేసుల వ్యాప్తి తగ్గకపోతే మాత్రం పరీక్షలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇక ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పైతరగతులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. జెఇఇ, నీట్ వంటి జాతీయ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ప్రథమ సంవత్సరం విద్యార్థులను పరీక్షలు కనీస మార్కులతో పాస్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో వారం రోజుల పాటు కరోనా పరిస్థితులను పరిశీలించి ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News