Sunday, November 17, 2024

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

1521 పరీక్షా కేంద్రాలు

పరీక్ష రాయనున్న 9.80 లక్షల మంది
నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఛాన్స్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 9వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియేట్ పరీక్షల నేపథ్యంలో కంట్రోలర్ జయప్రద భాయి, ఇతర అధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,44,189 మంది ఉన్నారని అన్నారు. రెండో ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కూడా నిర్వహించామని చెప్పారు. విద్యార్థులు tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని, దీంతో క్షేత్రస్థాయి అధికారులను మరింత అప్రమత్తం చేశామని తెలిపారు. పరీక్షల కోసం 1521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 27900 మంది ఇన్విజిలేటర్లను, 200 సిట్టింగ్ స్క్వాడ్లు, 75 ఫ్లైయింగ్ స్వ్కాడ్స్‌ను రంగంలోకి నియమించినట్లు సెక్రటరీ వెల్లడించారు.
విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు
-జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఇంటర్ పరీక్షలపై అన్ని విభాగాలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు శృతి ఓజా పేర్కొన్నారు. పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రత్యేక ఆర్‌టిసి బస్సులు నడుపనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రాథమిక వైద్య సదుపాయాలు, ఒక నర్సును అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. – ప్రతీ పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఇంటర్మీడియేట్ పరీక్షలకు నిమిషం నిబంధన అమలులోకి ఉంది. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరన్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్రిటెండ్ మెటీరియల్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, సిబ్బందికి కూడా సెల్‌ఫోన్ అనుమతి ఉండదని అన్నారు. విద్యార్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కౌన్సిలింగ్ కోసం టోల్ ఫ్రీ
మానసిక సమస్యలు, పరీక్షల ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇంటర్ బోర్డ్ ‘టెలీ మానస్’ పేరిట టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు శృతి ఓజా వెల్లడించారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు 14416 లేదా 040- 24655027 నెంబర్లకు ఫోన్ చేసి చేసి అవసరమైన కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. మానసిక నిపుణులు, ఆరోగ్య సంక్షేమ శాఖ విభాగానికి చెందిన నిపుణులు అవసరమైన కౌన్సిలింగ్ అందిస్తారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News