Friday, November 22, 2024

త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం: మంత్రి సబిత

- Advertisement -
- Advertisement -

మే 15లోగా ఇంటర్ పరీక్షలు పూర్తి, వారంలోగా పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం
విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు
4 లక్షల మంది మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు-విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ పరీక్షలను మే15లోపు ఇంటర్ పరీక్షలు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మే 17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహిచనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 33 జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు(డిఇఒ), జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారులు(డిఐఒలు) విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే ఇప్పటికే 60 శాతం మంది తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలిపారని వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలన్న నిబంధన ఏమీ లేదని, తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుతిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యక్ష తరగతులు, ఆన్‌లైన్ తరగతుల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,252 స్కూల్స్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 85 శాతం స్కూళ్లు సందర్శించామని వివరించారు. వాటిని ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పేర్కొన్నారు. లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకానున్నందున కొవిడ్ మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని పేర్కొన్నారు. తద్వారా పిల్లలకు పాఠశాలలకు పంపడం సురక్షితమే అన్న భావనను విద్యార్థుల తల్లిదండ్రుల్లో కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జిల్లా స్థాయిలో విద్యాసంస్థల నిర్వహణ అంతా జిల్లా స్థాయి విద్యా పరిరక్షణ కమిటీలదేనని మంత్రి చెప్పారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో విద్యాసంస్థల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు.
కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ మధ్యాహ్న భోజనం అమలు
మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం, ఇతర ఆహార పదార్థాలన్నింటినీ కొత్తవి మాత్రమే వినియోగించాలని, కొవిడ్ 19 జాగ్రత్తలు పాటిస్తూ ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. యూనిఫాంలు కూడా కొత్తవి అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాలో 85 శాతం మంది విద్యార్థులు డిజిటల్ క్లాస్‌లు వింటున్నారని తెలిపారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థులు తరగతి గదులకు హాజరవుతున్న సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయాలలి తెలిపారు. నిరంతరం తరగతి గదులను శానిటైజ్ చేసే ప్రక్రియను కొనసాగించాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్షం చేసినా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హెచ్చరించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో 70 శాతం సిలబస్ పూర్తయినందున, విద్యార్థుల సందేహాలతో పాటు మిగతా సిలబస్‌పై దృష్టిసారించాలని మంత్రి కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా కొవిడ్ మార్గదర్శకాలు పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. పాఠశాలల పారిశుద్ధ పనులను స్థానిక సంస్థలు నిర్వహించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. పదవ తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల్లో మనోధైర్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు.
వారంలోగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్
ఇంటర్మీడియేట్ పరీక్షల షెడ్యూల్‌ను వారం రోజుల్లోగా వెల్లడిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇతర తరగతులతో పాటే క్లాసు ప్రాక్టికల్ క్లాసులు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి కళాశాలలో విధిగా ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కళాశాలల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కళాశాలలవారీగా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని కోరారు.

Inter Exams will be end by May 15: Sabitha Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News