Friday, November 22, 2024

సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Inter first year examinations after reduction of Covid cases

ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్

మనతెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. సోమవారం ఆయన మన తెలంగాణ ప్రతినిధితో మాట్లాడుతూ, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలపై స్పష్టత ఇచ్చారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా వేయడంతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండా కనీస మార్కులతో పాస్ చేస్తారా..? లేక పరీక్షలు నిర్వహించి, అందులో సాధించిన మార్కులనే పరిగణలోకి తీసుకుంటారా..? అని విద్యార్థుల్లో కొంత అయోమయం నెలకొంది. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ స్పష్టత ఇచ్చారు. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇంటర్ తొలి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని, ఆ మార్కులనే పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.

సెలవుల్లో పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే చర్యలు

రాష్ట్రంలో వేసవి సెలవుల్లో పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ ఇంఛార్జ్ డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ హెచ్చరించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం మంగళవారం నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించిందని, వేసవి సెలవుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించవద్దని సూచించారు. వేసవి సెలవులు ఇచ్చేది విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసమని స్పష్టం చేశారు.

అయితే ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని అన్నారు. ఇంటర్మీడియేట్ విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణ పరీక్షలకు సంబంధించిన అసైన్‌మెంట్లకు ఫీజులకు ముడి పెట్టవద్దని ఉమర్ జలీల్ ప్రైవేట్ యాజమాన్యాలను కోరారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ నెల 30లోగా విద్యార్థుల నుంచి అసైన్‌మెంట్లు స్వీకరించి,  మూల్యాంకనం చేసి మే 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో మార్కులు అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఆయా జిల్లాల డిఐఇఒలు మే 6వ తేదీలోగా ఇంటర్ బోర్డు మార్కులు జాబితాను సమర్పించాలని తెలిపారు. గడువులోగా విద్యార్థుల మార్కులు పంపించకుటే ఆయా కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రికార్డు ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు

ఇంటర్మీయేట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపుల విద్యార్థులకు రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు కేటాయించనున్నట్లు ఉమర్ జలీల్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే మార్కుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News