ఎన్నికల సంవత్సరంలో ప్రజలను మితిమించి బాధిస్తే అధికారానికి నూకలు చెల్లిపోతాయనే భయంతో ధరలను అదుపు చేయాలని ప్రధాని మోడీ ప్రభుత్వం సంకల్పించినట్టు స్పష్టపడుతున్నది. ఇందుకోసం రిజర్వు బ్యాంకు బుధవారం నాడు రెపో రేటును పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలా పెంచడం ఇది వరుసగా ఆరవసారి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు తానిచ్చే రుణంపై అదనంగా 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీని వడ్డించింది. దీనితో ఈ వడ్డీ రేటు ఇంతకు ముందున్న 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెరుగుతుంది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) మెజారిటీ నిర్ణయాన్ని తీసుకొన్నది. ఆరుగురు సభ్యులు గల ఈ కమిటీలో నలుగురు వడ్డీ రేటు పెంచాలని సూచించగా ఇద్దరు వ్యతిరేకించారు. దీనితో బ్యాంకులు ఇచ్చే గృహ, ఆటోమొబైల్ తదితర రుణాలపై వడ్డీ పెరిగి వాటి నెలవారీ చెల్లింపులు భారమవుతాయి లేదా రుణ తీర్మాన వ్యవధి పెరుగుతుంది.
రుణ భారం పెరగడం వల్ల ఉత్పాదకత తగ్గి ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అదే సమయంలో డిపాజిట్లపై బ్యాంకులు చెల్లించే వడ్డీ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.అయితే రెపో రేటు పెంపుదల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పరిమితమై ధరలు కూడా అదుపులో వుంటాయా అనే ప్రశ్నకు ఔనని కచ్చితమైన సమాధానం చెప్పలేము. ఎందుకంటే గత కొన్ని మాసాలుగా పెట్రోల్, డీజెల్ ధరలు ఆకాశానికి అంటి కొనసాగుతున్నాయి. ఈ రేట్లను తగ్గించకుండా సరకుల ధరలు తగ్గాలని ఆశించడం అత్యాశే అవుతుంది. డీజెల్ అధిక రేటు సరకుల రవాణా ఖర్చును విపరీతంగా పెంచివేసింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి మనం ఆయిల్‌ను చవక ధరకు కొంటున్నాము. అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాతో తెగతెంపులు చేసుకొని దాని ఆయిల్‌ను, గ్యాస్‌ను కొనడం మానేసుకొన్నాయి.
మనం మాత్రం అమెరికా నుంచి ఆంక్షలు విరుచుకుపడతాయేమోననే భయాన్ని పక్కన పెట్టి రష్యా నుంచి ఆయిల్‌ను తక్కువ ధరకు దిగుమతి చేసుకొంటున్నాము. పర్యవసానంగా రూ. 35 వేల కోట్లు పొదుపు చేసుకొన్నామని వార్తలు చెబుతున్నాయి. ఈ ప్రయోజనాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం ఇంత వరకు ప్రజలకు బదలాయించ లేదు. పెంచిన డీజెల్, పెట్రోల్ ధరలను తగ్గించ లేదు. ఆ పని చేయకుండా దేశంలో ద్రవ్యోల్బణం, ధరలు అదుపులోకి రావాలని కోరుకోడం దురాశే కాగలదు. దేశంలో వినియోగించే ఆయిల్‌లో దాదాపు 80% మేరకు దిగుమతి చేసుకొంటున్నాము. కొవిడ్, యుద్ధం వంటి విపత్తుల సమయంలో సరఫరా మార్గాలు మూసుకుపోతే మనం దిగుమతి చేసుకొనే ఆయిల్ సహా అన్ని సరకుల ధరలూ పెరిగిపోతాయి. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రకం ఆయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ 95 డాలర్లుగా వుంది. ఈ ధర పెరిగితే మన ఆర్థిక వ్యవస్థ మీద మరింత భారం పడుతుంది.
అందుచేత కేవలం రెపో రేట్లు పెంచడం ద్వారా ధరలను, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలం అని అనుకోడం భ్రమ మాత్రమే అవుతుంది. రిజర్వు బ్యాంకు తరచూ పెంచుతున్న రెపో రేట్ల వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిన సందర్భాలు బహు అరుదు. అంతర్జాతీయ ఆర్థిక రంగం పరిస్థితి పూర్వం కంటే మెరుగైందని అయినప్పటికీ సంపన్న దేశాల్లో ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్‌దాస్ అన్నారు. 202223 ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధి రేటు 7% వద్ద ఘనంగా వుంటుందని కూడా ఆయన చెప్పుకొన్నారు. చిల్లర ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున 6.5 శాతంగా వుంటుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి తగ్గుతుందని కూడా చెప్పారు. రెపో రేటు పెంచినందువల్ల బ్యాంకులు ప్రజల నుంచి పొదుపు సొమ్మును ఆకర్షించడానికి ప్రాధాన్యమిస్తాయని అందుకోసం నిర్ణీత వ్యవధి (ఫిక్సెడ్) డిపాజిట్లపై వడ్డీని పెంచి తీరుతాయని నిపుణులు భావిస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో వుంచడానికి 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రిజర్వు బ్యాంకు రెపో రేటును 225పాయింట్లు పెంచింది. తాజాగా పెంచిన 25 బేసిస్ పాయింట్లతో మొత్తం పెరిగింది 250 పాయింట్లు. ఆ మేరకు ద్రవ్యోల్బణం అదుపు అయిన సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం సరకులను ప్రజలకు చవకగా అందించడం మీద దృష్టి పెడితే అది అసాధ్యం కాబోదు. దేశంలో సరఫరా మార్గాలలో గల అవరోధాలను తొలగించగలిగితే అది సాధ్యమే. దళారుల ప్రమేయం వీలైనంత పరిమితంగా వుండే ఆర్థిక వ్యవస్థలో ధరలు ఎంతో కొంత అదుపులో వుండే అవకాశముంది. ప్రధాని మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ స్థాయి దళారుల మీద మక్కువ ఎక్కువ. అందుచేత వున్నట్టుండి ఉల్లిపాయల వంటి సరకుల ధరలు అమాంతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణాన్ని విజృంభింపజేస్తాయి. అటువంటి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు రెపో రేటు పెంపుదల ప్రభావం అత్యంత పరిమితంగానే వుంటుంది.