నేటినుంచి ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష
ముంబయి: రెండేళ్లుగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. ఫలితంగా రుణాలకు సంబంధించి నెలవారీ వాయిదాలు (ఇఎంఐ) మొత్తం పెరుగుతోంది, లేదా రుణం చెల్లించాల్సిన కాలం ఎక్కువ అవుతోంది. గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్‌బిఐ) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతం చేయడంతో అందుకు అనుగుణంగా బ్యాంకులు రుణాల రేట్లను పెంచుతున్నాయి. రెపో రేటు మరింత పెరిగే అవకాశముందని గతంలో ఆర్‌బిఐ తన మధ్యంతర సమీక్షలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారంనుంచి జరిగే ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్షపై అందరి దృష్టీ ఉంది. ‘ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశముంది’ అని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గత సమావేశంలోనే పేర్కొన్నారు. దీంతో మరోసారి వడ్డీరేట్ల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. ఈ సారి సమీక్షలో 30-40 బేసిస్ పాయింట్లు పెంచినా 2022 -23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెపో రేటు 5.15 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.
నగదు నిల్వల నిష్పత్తి( సిఆర్‌ఆర్)ని 50 బేసిస్ పాయంట్ల మేర పెంచి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బిఐ ప్రయత్నించే అవకాశం ఉంది. గత సమీక్షలో ఆర్‌బిఐ సిఆర్‌ఆర్ నిష్పత్తిని 0.50 శాతం పెంచడంతో దాదాపు రూ.87 వేల కోట్ల నగదు ప్రవాహంఆర్‌బిఐనుంచి ఆర్థిక వ్యవస్థలోకి తగ్గింది.ఆర్‌బిఐ అంచనాలను మించి రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరినుంచి ఏప్రిల్ వరకు 6 శాతానికి మించే కొనసాగింది. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8,డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీనితో పాటుగా ప్లాస్టిక్, స్టీల్‌పై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గించింది.దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గుతుండడం, రుతుపవనాలు సానుకూలంగా ఉంటాయనే నివేదికలు ఈసారి ఆర్‌బిఐ పరపతి సమీక్షలో కీలకం కానున్నాయి.