Monday, January 20, 2025

ఆర్‌బిఐ ‘వడ్డీ’ షాక్

- Advertisement -
- Advertisement -

రెపో రేటు 0.40 శాతం పెంపు
ద్రవ్యోల్బణం పెరుగుదల వల్లే నిర్ణయం
ఎంపిసి సమావేశం వివరాలను ప్రకటించిన ఆర్‌బిఐ గవర్నర్

 

ముంబై : ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) అకస్మాత్తుగా వడ్డీ రేట్లను పెంచి షాక్ ఇచ్చింది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు (0.40 శాతం) పెంచింది. దీంతో వడ్డీ రేటు 4.40 శాతానికి పెరుగనుంది. ఈ నిర్ణయంతో గృహ, వ్యక్తిగత రుణ రేట్లు, ఇఎంఐలు భారం కానున్నాయి. గత మూడు నెలలుగా ద్రవ్యోల్బణం పరిమితి 6 శాతం పైనే కొనసాగుతుండడంతో ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. మే 2, 3 తేదీల్లో గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలోని ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) అత్యవసర సమావేశం నిర్వహించింది. దీని అనంతరం బుధవారం మీడియా సమావేశంలో గవర్నర్ ఈ వివరాలను వెల్లడించారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు క్షీణించడం వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు నుండి మెటల్ ధరలలో భారీ హెచ్చుతగ్గులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి రెండు నెలలకోసారి ద్రవ్య విధాన సమావేశం జరుగుతుంది. చివరి సమావేశం ఏప్రిల్ 6-8 తేదీలలో జరిగింది. చివరిసారిగా 2020 మే 22న రెపో రేటులో మార్పు చేశారు. అప్పటి నుంచి ఇది చరిత్రాత్మక కనిష్ట స్థాయి 4 శాతం వద్ద కొనసాగుతోంది. రెపో రేటు అనేది బ్యాంకులు ఆర్‌బిఐ నుండి రుణం పొందే రేటు, అయితే బ్యాంకులు తమ డబ్బును ఆర్‌బిఐ వద్ద డిపాజిట్ చేస్తే వచ్చే వడ్డీని రివర్స్ రెపో రేటు అంచారు. రెపో రేటు పెరిగినప్పుడు, వడ్డీ రేట్లు పెరగడం వల్ల కస్టమర్‌కు రుణం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు అధిక ధరలకు సెంట్రల్ బ్యాంక్ నుండి డబ్బును పొందుతాయి. క్రెడిట్ పాలసీ జిడిపి ద్రవ్యోల్బణ అంచనాలలో మార్పులతో ఆర్‌బిఐ మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. జిడిపి వృద్ధి అంచనాను 7.2 శాతానికి తగ్గించడం, ద్రవ్యోల్బణం అంచనాను 5.7 శాతానికి పెంచడం రాబోయే రోజుల్లో రెపో రేటును పెంచేందుకు స్పష్టమైన సూచన అని గత ఆర్‌బిఐ సమీక్ష అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. ఈ సంవత్సరం కనీసం 50 బేసిస్ పాయింట్లు పెంపును ఆశిస్తున్నామని అన్నారు.

సిఆర్‌ఆర్ కూడా పెరిగింది

ఆర్‌బిఐ నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ను కూడా 0.50 శాతం పెంచాలని నిర్ణయించింది. దీన్ని 4.5 శాతానికి పెంచారు. సిఆర్‌ఆర్ అనేది బ్యాంకులు ఎల్లప్పుడూ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉంచవలసిన మొత్తంగా చెబుతారు. సెంట్రల్ బ్యాంక్ సిఆర్‌ఆర్‌ని పెంచాలని నిర్ణయించుకుంటే, పంపిణీ కోసం బ్యాంకుల వద్ద అందుబాటులో ఉండే మొత్తం తగ్గుతుంది. సిస్టమ్ నుండి లిక్విడిటీని తగ్గించడానికి సిఆర్‌ఆర్‌ని రిజర్వు బ్యాంక్ ఉపయోగిస్తుంది.

6 శాతం దాటిన ద్రవ్యోల్బణం

ఏప్రిల్‌లో విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం 5.85 శాతం నుంచి 7.68 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బిఐ గరిష్ట పరిమితి 6 శాతం దాటడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం 2022 ఫిబ్రవరిలో 6.07 శాతం, జనవరిలో 6.01 శాతం నమోదైంది. 2021 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.52 శాతంగా ఉంది.

 

ముఖ్యాంశాలు

రెపో రేటు 40 బేసిస్ పాయింట్ల పెంపుతో 4.4 శాతానికి పెరిగింది. ఈ రేటు తక్షణమే అమల్లోకి రానుంది. 2018 ఆగస్టు తర్వాత మొదటిసారిగా పాలసీ రేటు పెంపు ఇదే, దీంతో కార్పొరేట్, వ్యక్తుల రుణాల వ్యయం పెరుగనుంది. నగదు నిల్వ నిష్పత్తి 50 బేసిస్ పాయింట్ల పెంపుతో 4.5 శాతానికి పెంచగా, ఇది మే 21 నుంచి అమల్లోకి వస్తుంది. ఆర్‌బిఐ సర్దుబాటు ధోరణిని అవలంభిస్తూనే, ద్రవ్యోల్బణం లక్షం పరిధిపై దృష్టి పెట్టనున్నట్టు ఆర్‌బిఐ తెలిపింది. తదుపరి ఎంపిసి సమావేశం జూన్ 68 తేదీల్లో జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News