జూన్‌లో కఠిన చర్యలను నివారించాలనుకున్నాం
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేటు పెంచాం
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబై : జూన్‌లో ఆర్‌బిఐ ఎంపిసి(ద్రవ్య విధాన సమీక్ష) సమావేశం జరగడానికి సమయానికి ముందే ఆకస్మికంగా వడ్డీ రేట్లను పెంచడానికి గల కారణాలను రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు. వచ్చే నెలలో కఠిన చర్యలను నివారించేందుకు గాను ముందస్తుగా ఎంపిసి సమావేశం నిర్వహించిందని, అందుకే మే 4న రెపో రేటును పెంచుతూ ప్రకటన చేశామని ఆయన అన్నారు. మే 24 తేదీల్లో నిర్వహించిన ఎంపిసి సమావేశం మినిట్స్ ప్రకారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే ముందస్తుగా ఎంపిసి సమావేశం నిర్వహించామని అన్నారు.
సత్వరమే నిర్ణయం తీసుకోవడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణకు దోహదం చేస్తుందని, అదే సమయంలో మధ్యకాలికంగా వృద్ధి రేటును పెంచేందుకు దోహదం చేస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నామని దాస్ వెల్లడించారు. ఈ రేటు పెంపు ద్వారా సమాజంలో బలహీన వర్గాల కొనుగోలు శక్తి పెరగడానికి దోహదం చేస్తుందని అన్నారు. ఎంపిసి ఎక్స్‌టర్నల్ మెంబర్ జయంత్ ఆర్ వర్మ 100 బేసిస్ పాయింట్లు పెంచాలని అభిప్రాయపడ్డారని, అయితే ఆఖరికి 40 బేసిస్ పాయింట్ల రెపో రేటు పెంపునకు సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారని దాస్ వివరించారు.
సవాళ్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది: సిఇఎ
రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని ప్రదాన ఆర్థిక సలహాదారు(సిఇఎ) వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, వేగవంతమైన కార్పొరేట్ ఆరోగ్యం కారణంగా పెద్ద దేశాలతో సమానంగా భారత్ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు.