ముంబై : వచ్చే మూడు నెలల వరకు చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్‌సిఎస్‌ఎస్), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి), కిసాన్ వికాస్ పత్ర (కెవిపి), సుకన్య సమృద్ధి యోజన వంటి పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే రాబోయే ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు ఈ పథకాలకు పాత వడ్డీ రేటునే పొందుతారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవడంతో పొదుపుదారులకు పెద్ద ఊరట లభించింది.
పెట్టుబడిదారులు సుకన్య సమృద్ధి యోజనపై 7.60 శాతం వడ్డీని పొందుతారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి)పై 6.8 శాతం వడ్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పిపిఎఫ్ 7.1 శాతం, కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడిపై 6.9 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. 2020 ఏప్రిల్ 1న వీటిపై వడ్డీ రేట్లను తగ్గించారు. అప్పుడు వాటి వడ్డీ రేట్లను 1.40 శాతం వరకు కోత పెట్టారు. దీని తర్వాత 2021 మార్చి 31న కూడా కోత నిర్ణయం తీసుకోగా, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. పొదుపు పథకాల వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికానికి ఒకసారి సమీక్షించి నిర్ణయం ప్రకటిస్తారు.