న్యూఢిల్లీ : ప్రతి విషయాన్ని సుప్రీంకోర్టు ముందుకు తేవడం, సరిగ్గా పనిచేయడం లేదని స్పందించడం పరిపాటి అయిందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. దేశంలో స్పందించాల్సిన అంశాలు అనేకం స్థానిక, ప్రాంతీయ స్థాయిల్లో ఉండనే ఉంటాయి. అయితే ప్రతి విషయంలోనూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పులకు దిగడం కుదరని పని అని సిజెఐ స్పష్టం చేశారు. కేరళలో పలు మావటి ఇతరత్రా బందీలుగా ఉండే ఏనుగుల మరణాలపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు తిరస్కరిస్తూ సిజెఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటువంటి విషయాలు స్థానిక పరిధిలోకి వస్తాయి. వీటిపై అక్కడి హైకోర్టులు ఇతర కోర్టులను ఆశ్రయించవచ్చు. అక్కడ ఏదైనా ఘోరమైన తప్పిదం జరిగితే చక్కదిద్దేందుకు తాము ఉన్నామని సిజెఐ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఈ దేశాన్ని పాలించడం లేదు కదా అని తెలిపారు. సుప్రీంకోర్టు విధులు, బాధ్యతలు ఏమిటనేది తెలుసుకుంటే మంచిది. సూక్ష్మస్థాయిలో తలెత్తే విషయాలపై స్పందించేందుకు అధికారిక, న్యాయసంబంధిత స్థానిక వ్యవస్థలు ఉండనే ఉంటాయని తేల్చిచెప్పారు.