మొదటిసారిగా కీలకమైన మార్పులు
డిసెంబర్ 13 నుంచి 18వరకు అర్ధ
సంవత్సరం, ఫిబ్రవరి 10 నుంచి 18
వరకు ప్రీ ఫైనల్, మార్చి 23 నుంచి
వార్షిక పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం దసరా, సంక్రాంతి సెలవులు కుదించి జూన్ 1 నుంచి జరుగుతున్న 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను పరిగణనలోకి తీసుకుని, వాటికి మరో 173 రోజుల ప్రత్యక్ష తరగతులతో కలిపి మొత్తం 220 పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. ఇందులో సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ్‌గా, డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు రెండో టర్మ్‌గా పరిగణించనున్నారు. 2022 ఏప్రిల్ 22వ తేదీని చివరి పనిదినంగా నిర్ణయించారు. దసరాకు ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజులు సెలువులు ప్రకటించింది.
పరీక్షల విధానంలో కీలక మార్పులు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ఇంటర్ పరీక్షల నిర్వహణ విధానంలోనూ ఇంటర్ బోర్డు కీలక మార్పులు తీసుకొచ్చింది. అర్ధ సంవత్సర, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో లేని విధంగా ఈసారి కొత్తగా ఇంటర్మీడియట్‌లో అర్ధ సంవత్సరం, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. డిసెంబరు 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత కారణంగా ఒకవేళ వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోతే అర్ధ సంవత్సరం లేదా ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానైనా ఉత్తీర్ణులను చేయవచ్చునని విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
100 శాతం సిలబస్ పూర్తి చేయాలి
ఈ ఏడాది సిలబస్‌లో ఎలాంటి తగ్గింపు లేకుండా వంద శాతం సిలబస్ పూర్తి చేయనున్నారు. సిలబస్ తగ్గింపు, లేదా పూర్తి సిలబస్ తదితర సిలబస్‌కు సంబంధించి అకడమిక్ క్యాలెండర్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో పూర్తి సిలబస్‌కు అకడమిక్ క్యాలెండర్ రూపొందించినట్లుగా అర్ధరమవుతోంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో ఈ సారి పూర్తి సిలబస్‌ను పూర్తి చేసి,మొత్తం ఇంటర్మీడియేట్ సిలబస్‌కు పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్చి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు 2022 మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. మే చివరి వారంలో అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
2021 సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టర్మ్
2021 అక్టోబర్ 13 నుంచి 16 వరకు దసరా సెలవులు
2021 అక్టోబర్ 18వ తేదీన కళాశాలల పునఃప్రారంభం
2021 డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు
2021 డిసెంబర్ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 13 వరకు రెండో టర్మ్
2022 ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు
2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు
2022 మార్చి 23 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు
2022 మే చివరి వారంలో అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
2022 ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
2022 జూన్ 1 న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం