Wednesday, January 22, 2025

కమలంలో కుమ్ములాటలు

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉండాలంటే కీలకమైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు పార్టీకి కీలకంగా ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా వంటి పలు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తగలడంతో బిజెపి కేంద్రంలో సొంతబలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ రాష్ట్రాలలో ఎదురుదెబ్బలు తగలడానికి రాజకీయ ప్రత్యర్థులు బలపడటంకన్నా సొంత పార్టీలోని బలహీనతలే, ముఖ్యంగా శ్రుతిమించుతున్న అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణం కావడం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. ఈ కుమ్ములాటల్లో ఉత్తరప్రదేశ్‌లో బజారునపడ్డాయి.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బలహీన పరిచేందుకు, ఆయనను గద్దె దించేందుకు పార్టీలో బలమైన వర్గాలు గత రెండు నెలలుగా అవిశ్రాంతంగా ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇస్తున్న బహిరంగ ప్రకటనలను చూస్తుంటే ఢిల్లీలోని పెద్దల అండదండలతోనే ఆ విధంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఈ వారం రెండు రోజుల పాటు పార్టీ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులతో ఢిల్లీలో జరిపిన భేటీలో పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయం పెంపొందించుకోవాల్సిన అవసరం గురించి ఒక వంక ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ మరోవంక ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల మధ్య సైతం సయోధ్య అవసరమని స్పష్టం చేశారు. బిజెపి అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రులు ఉన్నారు.

అయితే, వారిలో చాలా మందికి ముఖ్యమంత్రులతో పొసగడం లేదు. బహిరంగంగానే తమ ఆధిపత్యం చూపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బజారునపడిన అంతర్గత కుమ్ములాటలు సర్దిచెప్పలేని పక్షంలో త్వరలో మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. 2017లో ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు నాటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మద్దతుతో రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా తానే ముఖ్యమంత్రిని అనుకున్న కేశవ్ ప్రసాద్ మౌర్యకు అర్ధాంతరంగా యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి రావడంతో దిక్కుతోచలేదు. అప్పటి నుండి ఆ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 2022 ఎన్నికల కన్నా ముందు ఆదిత్యనాథ్‌ను గద్దె దించి తాను అధిష్టించాలని ప్రయత్నం చేసినా ఫలించలేదు.తాజాగా అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆదిత్యనాథ్ పట్ల ధిక్కార స్వరాలు తరచూ వినిపిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల అనంతరం ఒక వైపు ఆదిత్యనాథ్, మరోవైపు బిజెపి కేంద్ర నాయకత్వం బలహీనం కావడంతో ధిక్కార స్వరాలు వినిపించినా తనపై క్రమశిక్షణ చర్య తీసుకోలేరనే ధీమా ఆయనలో వ్యక్తం అవుతున్నది. అయితే ఆదిత్యనాథ్ ఏమాత్రం చెక్కుచెదరకుండా తనపని తాను చేసుకొంటూపోతున్నారు. కేశవ ప్రసాద్ మౌర్య ప్రముఖ ఒబిసి నాయకుడు కావడంతో ఎన్‌డిఎ కూటమిలో ఉన్న యుపికి చెందిన చిన్న చిన్న ఒబిసి పార్టీలు సైతం ఆయనకు మద్దతుగా స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే జాతీయ స్థాయిలో ప్రజలలో విశేషమైన అభిమానం సంపాదించుకున్న బిజెపి నాయకులలో ఆదిత్యనాథ్ ముఖ్యులు. ఆయనను గద్దెదించితే పార్టీ కోలుకోలేని దెబ్బతింటుందని బిజెపిలో సీనియర్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
1999లో అర్ధాంతరంగా కళ్యాణ్ సింగ్‌ను గద్దెకు దించడం తో 2017 వరకు యుపిలో బిజెపి అధికారానికి దూరంగా ఉండాల్సివచ్చింది.

అదే విధంగా 2011లో కర్ణాటకలో బిఎస్ యెడ్యూరప్పను గద్దె దించడంతో ఆయన తిరుగుబాటు చేశారు. ఫలితంగా 2013లో పార్టీ అధికారానికి దూరమైంది. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటే 10 శాతం వరకు ఓట్లు పొందారు. తిరిగి ఆయన బిజెపిలో చేరితే గాని బిజెపి మరోసారి అధికారం చేపట్టలేకపోయింది. ‘మోడీ గ్యారంటీలు’ పేరుతో ఇక ఓట్లు పొందే అవకాశం లేదని స్పష్టంకావడంతో జాతీయ స్థాయిలో ప్రజలను ఆకట్టుకోగల నేత యోగి ఆదిత్యనాథ్ మాత్రమే అని పార్టీ శ్రేణులలో పెరుగుతున్న అభిప్రాయం బిజెపి జాతీయ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తున్నది.అందుకనే ఆయన ప్రభుత్వం కారణంగానే బిజెపికి పరాజయం ఎదురైందని బలమైన అభిప్రాయం వ్యాప్తి చేసేందుకు మౌర్య వంటి నాయకుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పార్టీ శ్రేణులలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీలో చిరకాలంగా పనిచేస్తున్న వ్యక్తులను పక్కనపెట్టి బయట నుండి వచ్చిన సంపన్నులకు సీట్లు ఎక్కువగా ఇస్తున్న కారణంగానే మొన్నటి ఎన్నికలలో పార్టీ సొంతం గా మెజారిటీ పొందలేకపోయిందనే వాదనలు బలం పుంజుకొంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సైతం అదే విధంగా జరిగిందనే అభిప్రాయం బలపడుతుంది.ఇతర పార్టీలలోని అవినీతిపరులు, నేరచరిత్ర గలవారితో పాటు అసలు ప్రజాజీవనంతో సంబంధంలేని ఆర్థిక అక్రమాలకు పాల్పడే వారిని అందలం ఎక్కించడాన్ని ప్రజలు సైతం హర్షించడం లేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

యోగి ఆదిత్యనాథ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని, కేశవ్ ప్రసాద్ మౌర్యను ముఖ్యమంత్రిగా చేయాలని గత ఐదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తాను ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాల్సి వస్తే గోరఖ్‌పూర్‌లోని తన మఠానికి తిరిగి వెడతాను గాని మరో పదవి చేపట్టనని సంకేతాలు ఇస్తూ రావడం బిజెపి వర్గాలకు కలవరం కలిగిస్తోంది. ఎందుకంటే యుపిలో రాజకీయంగా ప్రాబల్యం గల ఠాకూర్ సామాజికవర్గం వారిలో ఇప్పటికే ఆదిత్యనాథ్ కు వ్యతిరేకంగా బిజెపిలో కుట్రలు జరుగుతున్నాయనే ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో బిజెపికి ఆ పార్టీ చెప్పుకుంటున్నట్లు 400 సీట్లు వస్తే మొదటగా ఆదిత్యనాథ్‌ను గద్దె దించుతారనే ప్రచారం జరిగింది. అందుకనే ఆ సామాజిక వర్గంవారు ఎన్నికలలో ఉత్సాహంగా పాల్గొనలేదు.

మరోవంక, బిజెపికి బలమైన దన్నుగా నిలబడుతూ వస్తున్న యాదవేతరుల ఒబిసి వర్గాలలో సైతం ఇప్పుడు నిర్ల్లిప్తత వ్యక్తం అవుతున్నది. ఈ ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకనే రాజస్థాన్‌లో వసుంధరరాజే, మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహన్, మహారాష్ట్రలో నితిన్ గడ్కరీ వంటి వార్లను పక్కనపెట్టిన్నట్లు ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ విషయంలో వ్యవహరింపలేకపోతున్నారు. గతంలో ఢిల్లీ నుండి కీలుబొమ్మ ప్రభుత్వాలను రాష్ట్రాలలో నడిపిస్తున్నారని బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉండేవారు.

ఇప్పుడు బిజెపిలో కూడా అదే విధంగా జరుగుతుంది. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయాలలో పని చేసే అధికారులను సైతం ప్రధానమంత్రి కార్యాలయం నుండి రుద్దుతున్నారు. ముఖ్యమంత్రులు ఎవ్వరూ స్వతంత్రంగా వ్యవహరింపలేక పోతున్నారు. రాష్ట్రాలలో బలమైన నాయకులు ఎవ్వరూ ఉండరాదనే విధానం ఒక విధంగా బిజెపిని క్రమంగా బలహీన పరుస్తున్నట్లు స్పష్టం అవుతుంది. చాలా మంది ముఖ్యమంత్రులు తమ నియోజక వర్గాలను దాటి చెప్పుకోదగిన ప్రభావం చూపించలేని వారు కావడం గమనార్హం. మరో వంక, బిజెపిలో పార్టీ అధ్యక్ష పదవికి మూడేళ్ళ కాలపరిమితి మాత్రమే. అయినా కొత్త అధ్యక్షుల నియామకంలో ఓ విధమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.

ఇంతకు ముందు అమిత్ షా ఆ పార్టీ అధ్యక్షునిగా ఐదేళ్ల పాటు గడిపారు. ఇప్పుడు జెపి నడ్డా పదవీ కాలం ఎప్పుడో ముగిసినా తర్వాతి అధ్యక్షుడి నియామకం పట్ల శ్రద్ధ చూపడం లేదు. గతంలో మాదిరిగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు పార్లమెంటరీ బోర్డు సమావేశాలు జరపడం లేదు. ఇదివరలో ప్రతి ఏడాది నాలుగు సార్లు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతూ ఉండెడివి. కానీ ఇప్పుడు ఒకటి, రెండు సార్లకు పరిమితం చేస్తున్నారు. మితిమించిన అధికార కేంద్రీకరణ, విస్తృతమైన సంప్రదింపులు లేకుండా ఒకరిద్దరు నిర్ణయాలు తీసుకొనే సంస్కృతి కేవలం కేంద్రంలోనే కాకుండా రాష్ట్రాలలో సైతం ఆ పార్టీని బలహీనపరుస్తుంది.

మరో వంద రోజుల తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్ర కీలకం కానున్నది. ఈ ఎన్నికల ఫలితాలే కేంద్రంలో మోడీ, అమిత్ షా ద్వయం రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అందరిపై రుద్దే ప్రయత్నం జరుగుతున్నది. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తినా ‘అన్ని ఆలోచించే చేశాం’ అంటూ కొట్టిపారేస్తున్నారు. కీలకమైన కేంద్ర మంత్రులు అనేక మందికి పార్టీతో సంస్థాగతంగా ఎటువంటి సంబంధం లేనివారే. పార్టీ శ్రేణులతో అనుబంధం లేనివారే. అందుకనే వారు సైతం పార్టీ, ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడడంలేదు.

పార్టీ నాయకులను కాకుండా ఉన్నత అధికారులకే పార్టీ వ్యవహారాలను సైతం అప్పచెప్పి నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి వారు రాజకీయంగా ఎటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందే ఈ మధ్యనే చూశాం. వ్యక్తుల కేంద్రీకృతం నుండి పార్టీని విముక్తి కలిగిస్తే గాని బిజెపి తన పూర్వవైభవాన్ని పొందటం కష్టం కావచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News