Thursday, January 23, 2025

ఇజ్రాయెల్‌కు మరో ఎదురు దెబ్బ

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఇసిజె) ఈ 19వ తేదీన మరొకసారి తీవ్రంగా అభిశంసించింది. గత మే 24 నాటి మొదటి అభిశంసన తర్వాత రెండు నెలలలోనే ఇది రెండవ అభిశంసన కావడం గమనించదగ్గది. ఈ రెండు కేసులలో విచారణకు వచ్చినవి రెండు వేర్వేరు అంశాలు. గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సామూహిక మారణహోమానికి పాల్పడుతున్నదా అనేది మే నెల తీర్పులోని అంశం కాగా, పాలస్తీనాను వారు చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంటున్నారా అన్నది ఈ 19 నాటి అంశం. అంతర్జాతీయ న్యాయస్థానం తన తాజా తీర్పులో ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.

అటు వెస్ట్ బ్యాంక్‌లోని విస్తారమైన స్థలాలను అనేక సంవత్సరాలుగా ఆక్రమించటమే గాక, వేలాది మంది యూదులను అక్కడ స్థిర పరుస్తున్నారు. అట్లా స్థిరపడేందుకు మరి కొన్ని వందల మందిని ఇటీవలే అనుమతించారు. ఈ విధమైన సెటిల్‌మెంట్లు కూడా పూర్తిగా చట్ట విరుద్ధమని ఐసిజె ప్రకటించింది. అంతటితో ఆగక ఆ సెటిల్‌మెంట్లు అన్నింటిని ఖాళీ చేయాలని, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను గత 57 సంవత్సరాలుగా ఆక్రమించుకున్నందుకు పాలస్తీనా ప్రజలకు నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది. ఇది సూచన మాత్రమే కావడం ఎందుకంటే, అంతర్జాతీయ న్యాయస్థానం యథాతథంగా చట్ట ప్రకారం పని చేసేదే అయినా, ఐక్యరాజ్య సమితికి అనుబంధమైనది.

దానికి విచారణాధికారాలు తప్ప, కేసులను స్వయంగా దర్యాప్తు చేసేందుకు యంత్రాంగం లేదు. దోషులను శిక్షించే అధికారాలూ లేవు. అయితే, ఆ వ్యవస్థ ఐక్యరాజ్య సమితిది అయినందున కోర్టు తీర్పుల ప్రభావం నైతికంగా, రాజకీయంగా చాలా ఉంటుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌పై ఈ రెండు తీర్పుల వల్ల కలిగే వత్తిడి కూడా అటువంటిదే. నైతిక వత్తిడి వల్ల ఎవరైనా తమ తీరును మార్చుకుంటే సరేసరి. ఒకవేళ ధిక్కరించినట్లయితే ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. కాని అంతర్జాతీయంగా వారికి గౌరవ మర్యాదలు, మద్దతు తగ్గిపోతాయి.

ప్రస్తుత విషయాన్నే గమనించండి. గత మే 24 నాటి తీర్పును తిరస్కరించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, ఈ తాజా తీర్పును కూడా ఆ వెంటనే తిరస్కరించారు. ఆయన సమాధానం ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలు యూదులవేనని, అటువంటి చోట వారు స్థిరపడటం చట్ట విరుద్ధం ఎట్లా అవుతుందని ఎదురు ప్రశ్నలు వేశారాయన. దానిని బట్టి వారి విధానం ఇదే విధంగా కొనసాగగలదన్నది స్పష్టం. ఇజ్రాయెల్ ఈ విధానాన్ని 57 సంవత్సరాలుగా కొనసాగించగలగడానికి గాని, భవిష్యత్తులోనూ ఆ పని చేయగలమనే ధైర్యానికి గాని ఆధారాలు కేవలం రెండు. ఒకటి సైనిక బలం, రెండు అమెరికా కూటమి మద్దతు.

ఈ రెండు చెక్కుచెదరనంత కాలం వారీపని చేస్తూనే ఉంటారనేందుకు ఎటువంటి సందేహం అక్కర లేదు. కాకపోతే అమెరికా కూటమి కొన్ని నటనలు చేస్తుంటుంది. ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్‌ను ఆక్రమించుకోవడం మౌలికమైన తప్పు కాగా, సెటిల్‌మెంట్ల నిర్మాణం అక్రమమని అమెరికా కూటమికి తెలుసు. అందువల్ల, ఆ విషయమై ఐక్యరాజ్య సమితిలోనో, ఇతరత్రానో చర్చ వచ్చినప్పుడు లేదా కొత్త సెటిల్‌మెంట్లకు ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చినపుడో, అది తమకు ఆమోదనీయం కాదంటూ మొక్కుబడి ప్రకటన ఒకటి ఇస్తారు. తర్వాత అంతా షరా మామూలే. ఇటీవల గాజా యుద్ధం దరిమిలా మరొక పరిణామం జరుగుతున్నది. వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లపై సెటిలర్లు ఆయుధాలతో వరుసగా హింసాకాండకు పాల్పడుతూ వారి భూములు ఆక్రమించుకుంటున్నారు అయినప్పటికీ అమెరికా శిబిరం తన నటనలు యథావిధిగా సాగిస్తున్నది.

ఇందుకు తిరిగి రెండు కారణాలున్నాయి. పశ్చిమాసియాలో తమ ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ ఒక తప్పనిసరి అవసరమన్నది ఒక కారణం కాగా, అమెరికాలో యూదుల లాబీకి తిరుగులేని బలం ఉండటం, డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలు రెండిటిపై వారిదే ప్రాబల్యం కావడం, స్వయంగా బైడెన్, ట్రంప్‌లు యూదులు కావడం రెండవ కారణం.
ఈ పరిస్థితులలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పులను గాని, ప్రపంచాభిప్రాయాన్ని గాని లెక్క చేయవలసిన అవసరం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడాలనే ప్రతిపాదలను తోసిపుచ్చుతున్నది కూడా అందుకే. విచిత్రమేమంటే, తాము ఈ ప్రతిపాదన చేస్తున్నామని, అందుకోసం ప్రయత్నిస్తున్నామని ఒక వైపు చెప్తున్న అమెరికా, అటువంటి ఒప్పందం ఇజ్రాయెల్, పాలస్తీనా అథారిటీ మధ్య చర్చల ద్వారా జరగాలే తప్ప బయటి జోక్యం వల్ల కాదంటున్నది. ఇదెంత మోసపూరితమైన వాదనో కనిపిస్తున్నదే.

వారంటున్నది పులికి, మేకకు మధ్య అంగీకారం కుదరాలని, గాజా యుద్ధ సందర్భంగా నెతన్యాహూ ప్రభుత్వం మరొక కొత్త ప్రయత్నం చేస్తున్నది. అది గాజా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొనజూడడం తమ యుద్ధ లక్షం హమాస్ నిర్మూలన మాత్రమేనని మొదట ప్రకటించిన వారు, తర్వాత ఏమంటున్నారు? ఇక అక్కడ పాలస్తీనియన్ల స్వయం పాలనకు అవకాశం ఇవ్వబోమని హమాస్‌కు బదులు పాలస్తీనియన్ అథారిటీ నామమాత్రంగా ఉండగా, మొత్తం మీద తమ పాలనా నియంత్రణ, సైనిక నియంత్రణ ఏర్పాటు చేయగలమని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఆ వెనుక అక్కడ సైతం వారి సెటిల్‌మెంట్లు మొదలు కాగలవని భావిస్తే పొరపాటు ఉండకపోవచ్చు. ఆ విధంగా వెస్ట్‌బ్యాంక్, గాజాలతో కూడిన పాలస్తీనా యావత్తూ ఇజ్రాయెల్ ఆక్రమణతోకి వెళుతుందన్న మాట.

నిజానికి మొన్న 19వ తేదీ నాటి ఇసిజె తీర్పులోనూ ఈ ప్రస్తావనలున్నాయి. ఇజ్రాయెల్ వాదనల అర్థం వెస్ట్ బ్యాంక్‌ను చట్టాల పేరిట కాకున్నా, వాస్తవ రూపంలో ఆక్రమించుకోవటమేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. గతంలో ఐక్యరాజ్య సమితి నివేదికలు, జనరల్ అసెంబ్లీ తీర్మానాలు అనేక సార్లు ఇదే మాట అన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం అనడం ఇది మొదటిసారి. గత మే నెల విచారణకు తన లాయర్ల బృందాన్ని పంపిన ఇజ్రాయెల్, ఈసారి అందుకు బదులు తన వాదనలను లిఖితపూర్వకంగా మాత్రం పంపింది. విశేషమేమంటే, ఒక వైపు అట్లా పంపుతూనే మరొక వైపు ఈ కేసుపై ఇసిజెకు అసలు విచారణార్హత లేదని వాదించింది. ఇది రాజకీయం గా తేలవలసిన విషయమే తప్ప చట్టపరంగా కాదని లోగడ స్వయంగా ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని, ఇజ్రాయెల్ పాలస్తీనా ఒప్పందాలు కూడా ఇదే చెప్తున్నాయని ఎత్తి చూపింది.

న్యాయమూర్తులు ఈ వాదనలను నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అందుకు జెనీవా కన్వెన్షన్, హేగ్ కన్వెన్షన్లలోని పలు సెక్షన్లను ఉదహరించారు. అంతేకాదు. దశాబ్దాల పాటు జరిగిన చర్చలన్నీ విఫలమై, మరొక వైపు ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు ఆగకుండా సాగుతున్నప్పుడు ఇటువంటి వాదనలకు ఎంతమాత్రం విలువ లేదన్నారు. ఇజ్రాయెల్ తరచు చేస్తున్న ప్రకటనలను గమనించినపుడు వారి నిజమైన ఉద్దేశాలు ఏమిటో అర్థమవుతున్నదని కూడా వ్యాఖ్యానించారు. రెండు తీర్పులను ఇజ్రాయెల్ తోసిపుచ్చడం కనిపిస్తున్నదే. వారిపై ఎటువంటి వత్తిడులు పని చేయడం లేదు. నెతన్యాహూది సంకీర్ణ ప్రభుత్వం కావడం, తీవ్రవాద వైఖరి గల యూదు పార్టీలు అందులో భాగస్వాములుగా ఉండడం కూడా ఇందుకు కొంత కారణమవుతున్నది. కాని అన్నింటికన్న కీలకమైనది పైన అనుకున్నట్లు అమెరికా కూటమి మద్దతు. ఈ రెండు తీర్పుల తర్వాత మిగిలింది అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసిసి) నిర్ణయం, తీర్పు. గాజా నేరాల కింద నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయాలని ఐసిసి ప్రాసిక్యూటర్ సిఫారసు చేశారు.దానిపై నిర్ణయం వెలువడవలసి ఉంది.

వారంట్లు రాకూడదని ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. న్యాయమూర్తులను సైతం ప్రత్యక్షంగా, రహస్యంగా కూడా బెదిరిస్తున్నట్లు బయటపడింది. ఒకవేళ వారంట్లు జారీ అయితే అది ఈ కూటమికి మూడవ ఎదురు దెబ్బ అవుతుంది. వారంట్ల ప్రకారం అరెస్టు చేసే యంత్రాంగం ఐసిసికి లేదు. కాని ఆ కోర్టు ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలలో నెతన్యాహూ ఎక్కడికి వెళ్ళినా ఆయనను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేయవలసి ఉంటుంది. సంతకం అమెరికా అయితే చేయలేదు గాని దాదాపు యూరోపియన్ దేశాలన్నీ చేశాయి. పోతే, గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్నది సామూహిక హత్యాకాండ అవుతుందా లేదా అనే ప్రశ్నపై ఇసిజె గత మే నాటి తీర్పులో ఇంకా ప్రకటించలేదు గాని (ఆ విషయమై ఇంకా విచారణ జరుగుతున్నది). అటువంటి లక్షణాలు ఉన్నాయని మాత్రం అన్నది. ఇజ్రాయెల్ ఆ తీర్పును తిరస్కరించటమే గాక, హత్యాకాండను కొనసాగిస్తూనే ఉంది. మరొక వైపు అమెరికన్ రాజకీయ పార్టీలపై అక్కడి ప్రజల వత్తిడి పెరుగుతున్నది. దాని వల్ల వాటి విధానాలు ఏమైనా మారుతాయా అంటే అనుమానాస్పదమే.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News