Monday, January 20, 2025

అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో ః డ్రగ్స్ విక్రయిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 557గ్రాముల కొకైన్, ఎక్టసీ పిల్స్ 902, హెరాయిన్ 21 గ్రాములు, వీడ్ గంజా 45 గ్రాములు, ఎల్‌ఎస్‌డి బ్లోట్స్ 105, చరాస్ 215 గ్రాములు, అంఫెటమైన్ 7 గ్రాములు, గంజా 190 గ్రాములు, రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, రూ.5.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియా అనంబ్రా రాష్ట్రం, ఒనిట్షా ఇచిడాస్ట్రీట్‌కు చెందిన ఇవులా ఉకోడా స్టాన్లీ(43) బిజినెస్ వీసాపై 2009లో ఇండియాకు వచ్చాడు. ముంబాయిలోని అందేరీలో ఉంటూ అతడి స్నేహితుడితో కలిసి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏడాది తర్వాత గోవాలోని కండోలిమ్‌కు చేరుకొని అక్కడే కొందరు నైజీరియన్లతో కలిసి దుస్తుల వ్యాపారం చేశాడు.

అక్కడ ఉన్న నైజీరియన్లతో పరిచయం కావడంతో తరచూ కలుసుకునేవారు. వారితో మద్యం తాగేవాడు, నైజీరియన్లలో కొందరు కొకైన్ తీసుకునేవారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తు భారీగా డబ్బులు సంపాదించాడం చూశాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించాలని ప్లాన్ వేశాడు. నైజీరియన్ స్నేహితుల వద్ద నుంచి డ్రగ్స్ ఎలా సరఫరా చేయాలో స్నేహితుల వద్ద మెళకువలను నేర్చుకున్నాడు. ముంబాయిలోని నైజీరియన్ల నుంచి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి గోవాకు తెప్పించి పర్యాటకులకు విక్రయించడం ప్రారంభించాడు. ఇలా 15 సంవత్సరాల నుంచి డ్రగ్స్ విక్రయిస్తు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్‌గా ఎదిగాడు. తన డ్రగ్స్ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాడు, దేశంలోని అన్ని ప్రాంతాలకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. నిందితుడికి దేశవ్యాప్తంగా 500మంది డ్రగ్స్ కస్టమర్లు ఉన్నారు. వారికి స్టాన్లీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, అందులో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. డ్రగ్స్ విక్రయించేందుకు స్టాన్లీ హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన టీఎస్‌న్యాబ్, హెచ్‌న్యూ, ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో పంజాగుట్ట పోలీసు అధికారులు సంయుక్తంగా వేట ప్రారంభించారు. ఎట్టకేలకు నిందితుడిని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్టు చేశారు.

నైజీరియన్ల వద్ద కోనుగోలు…
స్టాన్లీ డ్రగ్స్‌ను కేవలం గోవా, ముంబాయిలో ఉంటున్న నైజీరియన్ల వద్ద నుంచి మాత్రమే కొనుగోలు చేసేవాడు. ముంబాయిలో ఉంటున్న నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కొరియర్‌లో గోవాకు తెప్పించుకునేవాడు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారికి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపేవాడు. తనకు డ్రగ్స్ సప్లయ్ చేసే ప్రధాన నిందితుడిని గోవాపోలీసులు అరెస్టు చేయడంతో పుణా నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నాడు.

 

రాజస్థాన్ మహిళతో సహజీవనం...
స్టాన్లీ వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇండియాలో ఉండడంతో గోవా పోలీసులు అరెస్టు చేశారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాత రాజస్థాన్‌కు చెందిన ఉషా చండేల్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె అప్పటికే భర్తకు విడాకులు ఇవ్వడంతో, ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడంతో, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. 2014లో ఇద్దరు కలిసి గోవాలోని కండోలీంలో కిరాణా షాపు ఏర్పాట చేశారు. ఈ క్రమంలోనే కిరణా షాపుకు ఇద్దరు నైజీరియన్లు వచ్చే వారు. వారితో స్టాన్లీకి పరిచయం ఏర్పడింది, వారు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. కోవిడ్ రావడంతో స్టాన్లీ చేస్తున్న వ్యాపారం మూతపడడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఈ సమయంలో నైజీరియన్లు చెప్పిన వారికి డ్రగ్స్ తీసుకుని వెళ్లి ఇస్తే రూ.2,000 ఇచ్చేవారు. తర్వాత డ్రగ్స్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లు ఇండియా నుంచి వెళ్లిపోవడంతో డ్రగ్స్ కస్టమర్లు స్టాన్లీని డ్రగ్స్ కోసం సంప్రదించేవారు. దీంతో తను డ్రగ్స్ సరఫరా చేసే వారి వివరాలు తెలుసుకుని వారి నుంచి డ్రగ్స్‌కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి సప్లయ్ చేయడం ప్రారంభించాడు. ఐదుగురు ట్యాక్సీ డ్రైవర్లను నియమించుకుని వారి ద్వారా కస్టమర్లకు డ్రగ్స్ పంపించేవాడు. స్టాన్లీ డ్రగ్స్ వ్యాపారం తెలియడంతో 2017లో ఎన్‌సిబి, గోవా పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ డ్రగ్స్ వ్యాపారం చేయడం ప్రారంభించాడు.

స్టాన్లీపై నెల రోజుల నిఘా…
డ్రగ్స్ కేసులో గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీసులు గోవాకు చెందిన బాబుసో దివాకర్ అలియాస్ బాబా అలియాస్ బాబును అరెస్టు చేశారు. ఈ సమయంలో స్టాన్లీ పేరు బయటికి వచ్చింది. టిఎస్ నాబ్‌కు చెందిన ఎస్సై, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు గోవాకు వెళ్లి స్టాన్లీ కదలికలపై నిఘా పెట్టారు. అదే సమయంలో స్టాన్లీ మొబైల్ నంబర్లను సేకరించి, టవర్ లొకేషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు. ఈ క్రమంలోనే స్టాన్లీ డ్రగ్స్ సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు వస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇక్కడికి రాగానే పోలీసులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News