Monday, December 23, 2024

అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారు ఆశిష్ జైన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్‌తో పాటు రూ.3.71 కోట్ల స్వాధీనం

మనతెలంగాణ/హైదరాబాద్ ః హైదరాబాద్ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్‌ను అమెరికాకు సరఫరా చేస్తున్న అశిష్‌జైన్ అనే వ్యక్తిని ఆదివారం నాడు ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో అమెరికాతో పాటు పలు దేశాలకు ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా హైదరాబాద్ నుంచి ఔషధాల రూపంలో అశిష్‌జైన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఎన్‌సిబి అధికారులు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. నిందితుడు ఆశిష్ జైన్ నుంచి నిషేధిత డ్రగ్స్‌తో పాటు రూ. 3.71 కోట్ల నగదును ఎన్‌సిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలుదారుల నుంచి ఆశిష్ జైన్ క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, క్రెడిట్ కార్డుల రూపంలో లావాదేవీలు జరిపినట్లు ఎన్‌సిబి అధికారులు నిర్ధారించారు. ఇదిలావుండగా నగరంలోని దోమలగూడాలో నివాసముంటున్న అశిష్‌జైన్ హైదరాబాద్ కేంద్రంగా విదేశాలకు నిషేధిత డ్రగ్స్‌ను గుట్టుగా సరఫరా చేస్తున్నాడని న్యూఢిల్లీ ఎన్‌సిబి అధికారులకు సమాచారం అందింది.

దీంతో న్యూఢిల్లీకి చెందిన ఎన్‌సిబి అధికారుల బృందం దోమలగూడాలోని అశిష్‌జైన్ ఇంటితో పాటు కార్యాలయంలో ఈనెల 5న సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో డ్రగ్స్ సంబంధించి ఆశీష్ నుంచి ఎన్‌సిబి అధికారుల బృందం కీలక సమాచారం సేకరించినట్లు తెలియవచ్చింది. జెఇఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఆశిష్ జైన్ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి భారీగా నిషేధిత డ్రగ్స్‌తో పాటు వాటి ద్వారా సంపాదించిన రూ. 3.71కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సోదాలలో రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్ టాప్, పెన్‌డ్రైవ్‌లతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తుసామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇంటి నుంచే సరఫరా ః

నగరంలోని దోమలగూడాలోని ఓ ఇంట్లో ఆశిష్ జైన్ నివాసం ఉంటూ జెఇఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఓ ఇంటర్నెట్ ఫార్మసీని నిర్వహిస్తున్నాడు. అమెరికాతో పాటు, పలు దేశాలకు సైకోట్రోపిక్లో నిషేధిత ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, ఆల్పాజోలాం, డయాజెపమ్, లోరాజెపమ్, క్లోనజెపమ్, జోల్పిడమ్, ట్రమొడాల్ వంటి మత్తు పదార్థాలను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు ఎన్‌సిబి అధికారులు గుర్తించారు. ఈ మెయిల్, ఇంటర్నెట్ వాయిస్ కాల్స్‌లో విదేశీయుల నుంచి ఆర్డర్లు తీసుకుని ఆపై జెఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఖాతా తెరిచి ముందుగా పేమెంట్ చేయించుకునేవాడని , ఇందుకు క్రెడిట్ కార్డ్, పేపాల్‌తో పాటు బిట్ కాయిన్లను కూడా అనుమతించినట్లు విచారణలో తేలింది. డ్రగ్స్‌కు సంబంధించి మొత్తాలు అందగానే అత్యవసర మందుల పేరుతో నిషేధిత డ్రగ్స్‌ను ఎయిర్ కార్గో, షిప్మెంట్ల ద్వారా సంబంధిత చిరునామాకు కొరియర్ చేస్తున్నట్లు ఎన్‌సిబి అధికారులకు ముందస్తుగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గడచిన రెండేళ్లలో ఆశిష్ జైన్ దాదాపు వెయ్యికి పైగా కొరియర్లను భారత్ నుంచి అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఈ సైకోట్రోపిక్ డ్రగ్స్‌ను పంపించినట్లు ఎన్‌సిబి విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు విచారణలో మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియాకు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News