జనవరి 31 వరకు రద్దు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ విషయంలో మళ్లీ మెళిక పడింది. ఒమిక్రాన్ వేరియంట నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదివరలో డిసెంబర్ 15 వరకు అంతర్జాతీయ విమానాలు పునరుద్ధరించరాదని డిజిసిఎ డిసెంబర్ 1న నిర్ణయించింది. కానీ ఆ ప్రకటన చేసి వారం అయినా కాక ముందే మళ్లీ నిర్ణయాన్ని మార్చుకుంది. “ అంతర్జాతీయ విమానాలు నడిపించే నిర్ణయాన్ని 2022 జనవరి 31 వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సేవలను 2020 మార్చి 23 నుంచి రద్దు చేసిందన్నది తెలిసిందే. కానీ ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను వందే భారత్ మిషన్ కింద 2020 మే నుంచి నడిపిస్తున్నారు. అది కూడా కొన్ని ఎంచుకున్న దేశాలతో చేసుకున్న “ఎయిర్ బబుల్’ ఏర్పాట్ల కింద. దాదాపు 32 దేశాలతో భారత్ బబుల్ ఒప్పందాలు చేసుకుంది. అలా ఈ ఒప్పందం చేసుకున్న దేశాల్లో అమెరికా, ఇంగ్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఉన్నాయి. ఈ బబుల్ ఒప్పందం అన్నది రెండు దేశాల మధ్య చేసుకున్నది. ఒప్పందం చేసుకున్న దేశాలు తమ దేశం నుంచి తమ ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడిపిస్తాయి.