కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన
న్యూఢిల్లీ: భారత్‌నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసలును డిసెంబర్ 15నుంచి పునరుద్ధరిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటుగా విదేశాంగ, ఆరోగ్య శాఖలతో సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే యుకె, సింగపూర్, చైనా, బ్రెజిల్, బంగ్లాదేశ్, మారిషస్, జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటుగా కొత్త కొవిడ్ వేరియంట్ కలకలం రేపుతున్న దేశాలైన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, ఇజ్రాయెల్ హాంకాంగ్ వంటి మొత్తం 14 దేశాలకు మాత్రం పరిమితమైన సేవలు కొనసాగించనున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో గత ఏడాది మార్చి 19నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను భారత ప్రభుత్వం నిలిపి వేసిన విషయం తెలిసిందే. అపటినుంచి పలు దఫాలుగా ఆ నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అయితే పలు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాల్లో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో మాత్రమే గత ఏడాది జులై నుంచి 28దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతున్న కేంద్రం కార్గో సర్వీసులను మాత్రం నిరాటంకంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.