ప్రపంచంలోని పలు దేశాలలో ఈ రోజు మదర్స్ డే జరుపుకొంటారు. అమ్మలందరికీ హారతులీయాల్సిన శుభదినం. మాతృమూర్తుల్ని గౌరవించడమే ఈ మదర్స్ డే ఉద్దేశం. అమ్మతనంలో ఎంతో కమ్మదనం దాగి వుంది. ప్రతి ఒక్కరికీ అమ్మ ఆరాధ్య దైవం. అమ్మలేనిదే మనం లేము. అమ్మ ప్రేమ లేనిదే మనమూ లేము. నవ మాసాలు మనల్ని కడుపులో పెట్టుకొని ఎంతో మురిపెంగా చూసుకొంటూ, ఈ లోకంలోకి ఆహ్వానించేందుకు ఆతృతతో ఎదురు చూస్తూ, రోజులు లెక్కపెట్టుకొంటూ బ్రతికేస్తుంది అమ్మ. మన పసితనం నుండి పెద్ద వారమయ్యేవరకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ప్రతి రోజూ మనం తిన్నాకే తను తింటుంది. మనకు జబ్బు చేస్తే తను బాధపడుతుంది. మనం ఏడుస్తుంటే తనూ మనసులో రోధిస్తుంది. మన కోసం కోటి దేవుళ్లకు మొక్కుతుంటుంది. ఆమే…. మనందరి అమ్మ.
ఈ మదర్స్ డే అనేది పాశ్చాత్య సంస్కృతి నుండి జీవం పోసుకొన్న ఓ గొప్ప సంస్కృతి. ఇది అన్నా జార్విస్ అనే మహిళ చొరవతో అమెరికాలో పుట్టుకొచ్చింది. 1907లో మొట్ట మొదటి సారి ఈ మదర్స్ డే జరుపుకొన్నారు. అన్నా జార్విస్ తన తల్లి చేసిన సేవలకు స్మృతిగా వెస్ట వర్జీనియాలోని గ్రాఫ్టలో ఆండ్య్రూ మెథడిస్ట్ చర్చిలో ఈ మదర్స్ డే జరుపుకొంది. అప్పట్నించి దీనిని అంతర్జాతీయ ఈవెంట్ గా దాదాపు 40 దేశాలు జరుపుకుంటున్నాయి. కొన్ని దేశాలు మార్చిలో, మరి కొన్ని దేశాలు మే 9న జరుపుతున్నారు. శాంతి కోసం మహిళా ఏక్టావిస్ట్ అన్నా జార్విస్ తల్లి. ఆమె గొప్పతనానికి గుర్తుగా జరుపుకొంటున్న ఈ మదర్స్ డే ఇప్పుడిప్పుడే ఇండియా అంతటా వ్యాప్తి చెందుతున్నది. 1920 సం నుండి హాల్ మార్క్ అనే సంస్థ ఈ మదర్స్ డేని వ్యాపారంగా మార్చుకొంది. ఇప్పుడు కూడా మనం షాపులకెళ్తే మదర్స్ డే సందర్భంగా వివిధ ప్రేమ వ్యాఖ్యానాలతో రకరకాల గ్రీటింగ్ కార్డ్, రకరకాల గిఫ్ట్‌లు దర్శనమిస్తాయి. పిల్లలు ఆనందంగా వీటిని కొని తల్లుల్ని ఆనందింప చేస్తుంటారు. అమ్మను గౌరవించడం అన్న ఈ సంస్కృతి ముమ్మాటికి వ్యాప్తి చెందాల్సిందే. అలా అని ఈ రోజు తూతూ మంత్రంగా తల్లులకు గిఫ్ట్‌లు ఇచ్చి సంతోషపడకుండా, అమ్మలు బతికున్నంత కాలం వాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. పూజించాలి, గౌరవించాలి. ప్రేమను పంచాలి. అమ్మ కంఠ ఎన్నడూ కన్నీరు రాకుండా కాపాడుకోవాలి. జన్ననిచ్చి, జీవితామంతా మన కోసమే బతుకుతూ రాలిపోయే అమ్మలకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం! తల్లి గూర్చి రాబర్ట్ బ్రౌనింగ్ ఏమంటాడో తెలుసా! All love begins and ends there అంటే ప్రేమ అన్నది అమ్మ రూపంలో పుట్టి అమ్మతోటే ముగుస్తుంది. ఆయన మాటల్లో ఎంతటి మాధుర్యం దాగి వుందో!
అమ్మతోనే సృష్టి ఆరంభమవుతుంది. అమ్మతోనే సృష్టి అంతమూ అవుతుంది. సినీ కవుల, వేలాది పాటల్లో అమ్మ మాధుర్యాన్ని మనం విన్నాం. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ. ఎంత గొప్ప సాహిత్యమో. అమ్మ గొప్పతనం గూర్చి రాయాలంటే పేజీలే చాలవు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తల్లికి ఒక్కటే ప్రేమ. అందులో ఎలాంటి వ్యత్యాసం వుండదు. వొక్కోసారి తండ్రులు కొడుకులు పుడితే చాలా సంతోషిస్తారు. పెద్దయ్యాక ఉద్ధరిస్తారని భ్రమపడుతారు. చివరికి వాళ్లతోనే తన్నించుకొంటారు కూడా ఎక్కువ మంది. అమ్మ మనల్ని పరిపూర్ణ మనుషుల్లా తీర్చి దిద్దుతుంది. అనురాగం, ఆప్యాయత, పెద్దల పట్ల గౌరవం, విద్యా బుద్ధులు అన్నీ అమ్మే ఓ టీచర్ మనకు నేర్పిస్తుంది. మన బుడి బుడి నడకల వేళ అమ్మ పొందే ఆనందం అంతా ఇంతా కాదు. చేయి పట్టుకు నడిపిస్తుంది. పడకుండా జాగ్రత్తలు వహించి పట్టుకొంటుంది. అప్పుడు మనకు అమ్మ ప్రేమే కన్పిస్తుంది గాని ఆ వయసులో అమ్మపడే తపన, శ్రమ, త్యాగం మనకు కన్పించవు. అమ్మఒడి వెచ్చదనం, అందులోని తీయదనం మధురాతి మధురాలు. అమ్మ ఒడిలోని మాధుర్యాన్ని అర్చిచాల్ థాంప్సన్ ఎంత చక్కగా వర్ణించాడో! There is no velvet to soft as a mothers lap, no rose as lovely as her smile, no path so flowerly, as that imprinted with her foot steps’ అనగా తల్లి ఒడిని మించిన మెత్తదనం ఏ వెల్వెట్ లోనూ వుండదు. అమ్మ చిరునవ్వు ముందు రోజా పుష్పాలు కూడా అందంగా వుండవు. అమ్మ అడుగు జాడల్ని మించి ఏ పూబాటలు వుండవు ఇలా ప్రంచంలోని మహా కవులంతా అమ్మ గూర్చి చాలా గొప్పగా చెప్పారు.
కాలం మారుతున్నా, మమత- మనసులు, తరిగి పోతున్నా, బాంధవ్యాలు దూరమైపోతున్నా వొక్కింత కూడా తరగనిది చెరగనిది అమ్మ ప్రేమ వొక్కటే. అందులోని స్వచ్ఛత కూడా వన్నె తగ్గలేదు. ఎవరు రాయగలరు అమ్మ కన్నా తీయని కావ్యం. ఈ బంధం కన్నా శాశ్వత బంధం ఇంకోటి లేదు. మనుషుల్లో పెను మార్పులు చోటు చేసుకొన్నాయి. మనిషి లేచినప్పటి నుండి పడుకొనే వరకు వొకటే పరుగు. డబ్బు సంపాదించేయాలన్న తపన ఆతృత. అమ్మలేదు, చెల్లి లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు కేవలం భార్య, తన పిల్లలు ఇదే లోకం తనకు జన్మనిచ్చిన తల్లిని పూర్తిగా మరచి చీపురులా ఓ మూల పడేస్తున్నారు. ఆమెకు జ్వరం వచ్చిన, మూల్గుతున్నా కాబట్టకుండా వెళ్ళిపోతున్నారు. అంత బాధలోనూ ఆమె కళ్ళు పిల్లల ఎదుగుదల చూసి సంబరపడుతుంది. కానీ తన బాధ వ్యక్తం చేయదు ఇది అమ్మ ప్రేమ. పిల్లలు పుట్టాక అమ్మ జీవితం ఆగిపోతుంది. ఆమెకు మరే దానిపైనా ఆలోచనలు, కోర్కెలు వుండవు. భర్త పైన కన్నా పిల్లలపైనే మమకారం పెరిగిపోతుంది. ఆమె కంటూ స్వంత కోర్కెలు కూడా ఆనాటితో సమాధి అయిపోతాయి. అమ్మ నిజంగా దేవుడిచ్చిన వరం. పెదవే పలికే మాటల్లోనే తీయని పలుకే అమ్మ అని ఓ సినీ కవి రాశాడు. నిజమే పాప కళ్ళు తెరిస్తే చూసేది మొదటగా అమ్మనే. పెదవులు పలికాక పిలిచే మొదటి పదం ‘అమ్మ’ అనే. అంతటి అమృత తుల్యమైనది అమ్మ అనే పదం. ఈ రోజు పిల్లలు అమ్మ గుండెల్లో తూట్లు పొడుస్తున్నారు. పట్టుమని 10 నిముషాలు అమ్మ దగ్గర కూర్చుని ఆమె మనసులోని భావాల్ని పంచుకోలేక పోతున్నాడు. ఆ తల్లి పిల్లాడి చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేయాలని ఎంతో తాపత్రయ పడుతుంది. కానీ మనం దొరకంగా! మనకలాంటి ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కడేడ్చాయి గనుక! ఆ విషయంలో మన ప్రధాని మోడీని అందరం అభినందించక తప్పదు. ఏడాది కోసారైనా వెళ్ళి అమ్మతో ఓ గంట అయినా గడుపుతారు. ఆ తల్లి పెట్టే ముద్దలు ఆనందంగా తింటారు. ఎంతమంది చేస్తున్నారు. ఇలాంటి పని. భారత దేశాన్నంతటినీ పరిపాలిస్తున్నా అమ్మ ప్రేమ రుచిని మరచిపోని మహా వ్యక్తి అతడు. ఆ తల్లి కళ్లల్లో అప్పుడు భారత ప్రధాని కనపడడు. బుడి బుడి అడుగుల చిన్ననాటి మోడీనే కన్పిస్తారు. పి.వి నర్సింహరావు గారు భారత ప్రధాని అయ్యాక ఓ బంగారు మాట చెప్పారు. దేశానికి ప్రధాని అయినా, నేనూ ఓ తల్లికి బిడ్డనే అని ఎంత విలువైన పదం అది. గత కాలంలో అమ్మంటే గౌరవం, ప్రేమ గుండెల నిండా వుండేది. అమ్మతన రక్త మాంసాలు ధారపోస్తూ బిడ్డల ఎదుగుదలకు తివాచి పరిసేది.
పిల్లలందర్నీ కూర్చో బెట్టుకొని అందరికీ ముద్దలు తినిపించేది. పడుకొనేటప్పుడు ఎన్ని పాటలో, ఎన్ని కథలో….. అన్నింటిలోనూ ఎంతో కొంత నీతి, లౌక్యం దాగి వుండేది. ప్రతి ఏటా చెట్టులా పెరుగుతున్న పిల్లల్ని చూసుకొని మనసులోనే సంబర పడిపోయేది. పిల్లలు కూడా అమ్మ.. అమ్మా అంటూ అమ్మ కొంగు పట్టుకు తిరిగేవారు. ఇప్పుడేమైంది. చిన్న పిల్లలు కూడా టివిలకో, స్మార్ట్ ఫోన్లకో అంకితమై అమ్మ గూర్చి పూర్తిగా గ్రహించలేక పోతున్నారు. అమ్మను ఓ యంత్రంలా చూసుకొంటున్నారు. ఇలాంటి పరిణామాలు ఏ మాత్రం వాంఛనీయం కాదు. అమ్మ మనసులోకి తొంగి చూడండి. ఆమె చిన్ని చిన్ని కోర్కెలు అనగా గుడి కెళ్ళడం, బంధువుల్ని చూడాలన్న లాంటి కోర్కెల్ని తీర్చండి. వృద్ధాప్యం వచ్చాక తల్లుల్లో ఇలాంటి అభిలాష ఎక్కువగా వుంటుంది. తండ్రి తోడు లేకున్నా వుంటే అలాంటి వారి బాధలు వర్ణనాతీతం. అన్నీ మనసులో దాచుకొంటారు. పెరిగిన పిల్లల ఆదరణ ఆప్యాయతలు బట్టి వీళ్ళు మనసు విప్పుతుంటారు. అది గ్రహించాల్సింది పిల్లలే. రుణం తీర్చుకోవాల్సింది పిల్లలే. చిన్న జ్వరం వచ్చినా మీ తోడు, మీ ఆప్యాయత, మీ పలకరింపు ఆమెలోని జ్వరాన్ని తరిమేస్తాయి. అమ్మ మనసుకు చిన్ని గాయం చేసేందుకైనా ప్రయత్నించకండి. మనల్ని చిన్నప్పుడు ఎలా చూసుకొందో మనమూ వారు పెద్దయ్యాక పిల్లల్లాగే చూసుకోవాలి.
ఈ కాలపు పిల్లల్లో కొందరి రాక్షసత్వాన్ని కూడా మనం తెలుసుకొంటే మదర్స్ డే అర్థం బోధపడుతుంది. తల్లి తండ్రులపై పైశాచికంగా ప్రవర్తిస్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ భారత దేశంలోనే 4వ స్థానంలో వుంది. ఇవి 2019 ప్రభుత్వ క్రైం బ్యూరో లెక్కలు. 2020 అక్టోబర్‌లో హయత్ నగర్‌లో కీర్తి అనే అమ్మాయి బాగానే చదువుకొంది. కానీ చెడు తిరుగుళ్ళు మరిగింది. అది తట్టుకోలేని తల్లి కూతుర్ని మందలించింది. చెడు సావాసాలు మంచివి కాదంది. మరి బిడ్డ తన వైఖరి మార్చుకోలేదు. తల్లిపై కక్ష కట్టి అడ్డు తొలగించుకోవాలనుకొంది. ఒక రోజు బాయ్ ఫ్రెండ్‌తో కలసి తల్లి ఎదరొమ్ముపై కూర్చోని, గొంతు నులిమి చంపేసి, రెండు రోజుల తర్వాత సమీపంలోని రైలు పట్టాలపై తల్లి శవాన్ని పడేసింది. ఇంట్లో తల్లి శవం వుండగానే ప్రియుడితో శృంగారంలో కూడా పాల్గొనింది. ఎద రొమ్ముపై కూర్చున్నపుడైనా ఆ రాక్షస కూతురికి తనకు చిన్నప్పుడు పాలిచ్చిన తల్లి స్థనాలు గుర్తుకు రాలేదా! మనుషులంతా సిగ్గు పడాల్సిన నీచపు గాథ ఇది. అదే నెలలో గుంటూరులోని మాచర్లలో భార్గవి అనే అమ్మాయి కూడా ఇలాంటి నీచ కార్యామే చేసింది. తల్లి ఒంటరిగా జీవిస్తున్నది. ఆస్తంతా తల్లి పేరునే వుంది. భర్త వదిలేశాడు. తల్లిని చంపేస్తే ఆస్తి అంతా తనకే దక్కుతుందని దురాలోచనకు వచ్చింది. వచ్చినదే తడవుగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తన తల్లిని చంపేసింది. తాజాగా మరో ఇద్దరి కూతుళ్ల రాక్షసత్వం చుద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా కొటాల పర్రులో వెంకాయమ్మ అనే వృద్ధురాలు కూతుళ్ల దగ్గర వుంటున్నది. తన 5 లక్షల ఆస్తి ఇద్దరి పంచేసింది. ఈ నెల 6న తల్లికి కరోనా అని తెలియగానే పిల్లలిద్దరూ మాల్తేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర వదిలేశారు. ఆమె ఏడుస్తూ కూర్చోవడం చూసి ఎవరో ఆదరించారు. ఇక కుమారుడు బాగోతాలు కూడా విందాం.
2019 డిసెంబర్‌లో అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో ఓ తాగుబోతు చిన్న కొడుకు పీకల దాకా తాగివచ్చి దుశ్శాసనుడిలాగా నడి బజారులో తల్లి కొంగు లాగి వివస్త్రను చేయ చూశాడు. చివరికి తండ్రి దానిని చూసి తట్టుకోలేక ఆ నీచపు కొడుకును మట్టు పెట్టాడు. మనుషులెవరూ ఈ గాథను చెవిన వినడానికి కూడా సాహసించరు. ఆ తల్లి మనసు ఎంత గా రోధించి వుంది! బ్రతికుండే నరకం చూసింటుంది. మరో కొడుకు ప్రబుద్ధుడు గుంటూరు జిల్లాలో తల్లిని తీసుకొని 1.7.20న హెల్త్ పరీక్షలకై హాస్పిటల్‌కు తీసుకెళ్ళాడు. పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఆ దుర్మార్గుడు ఆమెను బస్టాండ్‌లో వదిలేసి పరారయ్యాడు. అమ్మను అలా గాలికి వదిలేసే కొడుకులకు రాజ్యాంగంలో ఏ శిక్షలూ లేవా? ఇలాంటి మరో నీచున్నీ చూం. జూలై 7.1920న ఘట్‌కేసర్ మండలంలో అన్నోజీగూడ తాండాలో జరిగింది. తల్లి దగ్గరున్న రూ. 80 వేలు వాడేసుకొన్నాడు కుమారుడు. ఆమె భిక్షమెత్తి సంపాదించుకొన్న మరో 20 వేల రూ. పై కూడా వాడికి కన్నుపడింది. హాస్పిటల్ ఖర్చులకని ఆ డబ్బులూ తీసేసు కొన్నాడు. తల్లికి భార్యను తోడిచ్చి భువనగిరి హాస్పిటల్‌లో కని ఆటోలో పంపాడు. అక్కడికెళ్ళాక కోడలు ఆమె దగ్గరున్న మందుల పేపర్లని లాగేసుకొని చించేసి, అక్కడే ఒంటరిగా ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది. దారి తెలియని వృద్ధురాలు ఏం చేయాలో తెలియక ఓ బండి క్రింద కూర్చుని రోధిస్తూ రాత్రంతా గడిపింది. చివరికి ఎవరో ఆశ్రమ నిర్వాహకులు ఆమెను తీసుకెళ్ళారు. ఇదీ నా దేశం! ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట మనందరికీ గుర్తురావడం లేదా! ఎకరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. ఎన్ని కథలు చదువుతున్నా, ఎన్ని ఘోరాలు వింటున్నా అమ్మ మనసు ఒక్కటే మలినం కానిది. అది పాలవలె తెల్లగా, స్వచ్ఛందంగా వుంటుంది. సినిమా నటీమణులకు గుళ్ళు కట్టిస్తుండడం చూస్తున్నాం. మనందరం మన తల్లులకు గుళ్ళు కట్టించాల్సిన పని లేదు. మన గుండెల్లో స్థానం కల్పిస్తే చాలు.
మదర్స్ డే తూతూ మంత్రం కాకూడదు. ప్రపంచంలోని ప్రతి బిడ్డ ఈ రోజు కొన్ని క్షణాలైనా జన్మనిచ్చిన తల్లిని గుర్తు చేసుకోండి చనిపోయి వుంటే ఆ తల్లి జ్ఞాపకాల ఆనందపు శిఖరాల్లో విహరించండి. బతికున్న తల్లులందరి పాదాలకు ప్రణమిల్లండి. ఈ వొక్క రోజైనా వారికి ఆనందాన్నీయండి. ఆమె కళ్ళలోకి తొంగి చూడండి. వాటి భావాలు చదవండి. అర్థం చేసుకోండి. తల్లిని మించిన దైవం లేదు. కుదిరితే రోజంతా కూడా ఆమెతో గడపండి. మనల్ని కన్నప్పుడు ఆ తల్లి కళ్ళలో కోటి మెగా వాట్ల విద్యుత్ కాంతులుంటాయి. ఆమె మనల్ని వదలి వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో జలపాతాలు కన్పిస్తాయి. ‘తాను వెళ్ళి పోతున్నాను. తన పిల్లలకు ఎలాంటి కష్టాలు రాకూడదు దేవుడా!’ అంటూ ఆఖరి మూగ భాషతో మనల్ని విడచి వెళ్ళిపోతుంది. ఓ తరం, ఓ నక్షత్రం, ఓ ప్రేమ పర్వతం రాలిపోతుంది.
డా.సమ్మెట విజయ్ కుమార్
8886381999