అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా బుధవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిరి జిల్లాల సంక్షేమ అధికారుల పరిధిలోని వయో వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు, బాలసదన్ల నుండి సుమారు 1600 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నట్లు రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా. కె. రజని ప్రియ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో మహిళా వృద్ధులకు, చిన్నారులచే పుష్పగుచ్చాలు అందజేశారు. తదుపరి గీతాలాపన, నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు, రంగారెడ్డి జిల్లా సంక్షేమ అధికారి పద్మజ రమణ, మేడ్చల్- మల్కాజిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ రెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా వయో వృద్ధులైన 20 మంది మహిళలను సన్మానించారు. జిల్లా సంక్షేమ అధికారులు మాతృ మూర్తి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అమ్మ మన జీవితంలో ప్రతిరోజూ తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తుందని అన్నారు. మేడ్చల్-మల్కాజిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ మాతృ దినోత్సవం కేవలం సంవత్సరంలో ఒక రోజు మాత్రమే కాదని ప్రతి రోజు జరుపుకోవాల్సిన పండుగ అని తెలిపారు. ఈ కార్యక్రమం వృధాశ్రమాలలో ఉంటున్న వృద్ధులు, బాల సదనం లో ఉంటున్న చిన్నారులను అనుసంధానం చేసే విధంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రపతి నిలయ సందర్శన ప్రతిరోజూ 5 గంటలకు ఉంటుందని, వారాంతంలో 7 గంటల వరకు ఉంటుందని రాష్ట్రపతి నిలయ అధికారి డా. కే.రజని ప్రియ తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న 1600 మందికి రాష్ట్రపతి నిలయ ఉచిత సందర్శన కల్పించారు.