పర్యావరణాన్ని పరిశుభ్రంలో రాబందులు కీలకం
పిసిసిఎఫ్ రాకేష్ మోహన్ డోబ్రియాల్
హైదరాబాద్ : పర్యావరణ హిత బంధువులైన రాబందులను సంరక్షణ ప్రక్రియలో అందరూ భాగం కావాలని, సరైన అవగాహనతో వాటిని కాపాడాలని పిసిసిఎఫ్ రాకేష్ మోహన్ డోబ్రియాల్ కోరారు. రాబందులపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఆధ్వర్యంలో పిసిసిఎఫ్ రాకేష్ మోహన్ డోబ్రియాల్, ఓఎస్డీ శంకరన్, డబ్ల్యుడబ్ల్యుఎఫ్ స్టేట్ డైరెక్టర్ ఫరీదా టంపాల్ చేతుల మీదుగా రాబందుల సంరక్షణపై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ రాబందులపై ఉన్న అపోహలు, మూఢనమ్మకాలు వలన వాటిని వేటాడటం, వాటి ఆవాసాలను నాశనం చేయడంతో రాబందుల సంఖ్య దేశంలో మరింత ప్రమాదకర స్థాయిలో తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబందుల సంఖ్య పెరగాలంటే వాటి గురించి సరైన అవగాహన ప్రజలకు అవసరమని అన్నారు.
రాబందులు మన వాతావరణంలో కుళ్లిన జంతు కళేబరాల నుంచి హానికరమైన వ్యాధులు ప్రబలకుండా వాటిని తిని పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని, అవి తగ్గడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుదని తెలిపారు. పర్యావరణ హిత బంధువులైన రాబందులను సంరక్షణ ప్రక్రియలో అందరూ భాగం కావాలని కోరారు. సరైన అవగాహనతో వాటిని కాపాడాలని పిసిసిఎఫ్ కోరారు. సిఈఒ డాక్టర్ రవిసింగ్, నేషనల్ కన్జర్వేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ దివాకర్‌శర్మ మాట్లాడుతూ రాబందులను కాపాడాలంటే వాటికి సంబంధించి సరైన అవగాహన అవసరమని, రాబందుల సంఖ్యను పెంచడంలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో వరల్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రతినిధులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.