Monday, December 23, 2024

వైజ్ఞానిక రంగంలో మహిళలు

- Advertisement -
- Advertisement -

ప్రతి సంవత్సరం మనం మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా “వుమెన్ ఇన్ సైన్స్‌” అనే అంశంపై దృష్టి సారిద్దాం. అన్ని రంగాలలో స్త్రీలు ముందడుగు వేస్తున్నారు. సమాజ స్వరూపాన్ని కొద్ది కొద్దిగా మార్చేస్తున్నారు. అయితే ఇప్పటికీ శాస్త్ర సాంకేతిక రంగాలలో వారి పాత్ర అంతంత మాత్రంగానే వుంది. మన దైనందిన జీవితానికీ, శాస్త్ర సాంకేతిక రంగాలకూ విడదీయరాని బంధం ఏర్పడి వుంది. అందువల్ల సమాజ పురోగతికీ, దేశాభ్యున్నతికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే ఈ రంగాలలో సహజంగా మహిళలు ఇంకా ఎక్కువగా పాల్గొనాల్సి వుంది. అన్నిటినీ అధిగమించి, ఏళ్ళకేళ్ళు వైజ్ఞానిక పరిశోధనా రంగంలో నిలదొక్కుకుని వుండగలగడం స్త్రీలకు కష్టసాధ్యమే తప్ప, సామాన్యంగా, సహజంగా జరిగే పని కాదు. సైన్స్‌లో పట్టభద్రులైన మహిళలు జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులవుతున్నారు తప్పితే, శాస్త్రవేత్తలు కావడం లేదు.

గతంలో తలిదండ్రులు తమ కూతుళ్ళకు భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి విషయాలలో మాత్రమే చదువు చెప్పిస్తూ వచ్చారు. సైన్సు, టెక్నాలజీలు ఆడపిల్లలకు ఎందుకులే అనే భావం వుండేది. క్రమంగా మార్పు వచ్చింది. మెడిసిన్, ఇంజినీరింగ్, కంపూటర్స్‌లలో అమ్మాయిల్ని చేర్పించసాగారు. ఫలితంగా ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారు. వైజ్ఞానిక, పరిశోధనా శాలల్లో కర్మాగారాలలో స్త్రీలు పని చేయడం లేదని కాదు. వర్కర్లుగా, రిసెప్షనిస్టులుగా, టెలిఫోన్ ఆపరేటర్‌లుగా, క్లర్కులుగా, టైపిస్టులుగా ఎంతో మంది పని చేస్తున్నారు. నిజమే కాని, శాస్త్రవేత్తలుగా, సాంకేతిక నిపుణులుగా చాలా కొద్ది మంది మాత్రమే ఎదగగలుగుతున్నారు. బాధ్యతాయుతమైన డైరెక్టర్, సెంటర్ ఇన్‌చార్జి వంటి ఉన్నత పదవులలో కొద్ది మంది మహిళలు మాత్రమే వుంటున్నారు. అదీగాక, స్వాతంత్య్రానంతరం భారతీయ వైజ్ఞానిక పరిశోధనలు పరిశీలిస్తే అందులో మహిళా శాస్త్రవేత్తల కృషి పెద్దగా చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఒక జగదీశ్ చంద్రబోస్, ఒక సి.వి. రామన్ వంటి మహిళా శాస్త్రవేత్తలింకా తయారు కాలేదు. శ్రీనివాస రామానుజన్, మహేంద్ర లాల్ సర్కార్, బోస్, సాహా, భట్నాగర్, సలీం అలీ, హోమీ జె బాబా, రాజా రామన్న వంటి శాస్త్రవేత్తల స్థాయికి ఎదిగిన మహిళా శాస్త్రవేత్తలు కూడా మనకు లేరు. అయితే తప్పు వారిది కాదు, పురుషాధిక్య ప్రపంచానిది. అగ్రవర్ణాల వారు శూద్రుల్ని విద్యకు దూరం చేసిన విధంగానే పురుష ప్రపంచం చాలా కాలం స్త్రీలను విద్యకు దూరం చేసింది.

పూర్వ కాలంలో కూడా నృత్యాంగనలు, గాయనీమణులు, కవయిత్రులు వుండేవారు తప్పిస్తే, ఆర్యభట్టు, వరాహమిహిరుడు వంటి వారి స్థాయి గల మహిళా శాస్త్రవేత్తలు ఎవరూ లేరు. ఆనాటి పురుష ప్రపంచం తమ ఆనంద విలాసాల కోసం స్త్రీలను ఆ మేరకే ప్రోత్సహించింది, అనుమతించింది. పరిపాలన, రక్షణ, ఆర్థిక రంగాలలో వారిని భాగస్వాములుగా చేయలేదు. అందుకే రాజుల ఆస్థానాలలో స్త్రీలు మంత్రులుగా, సలహాదారులుగా, కోశాధికారులుగా, సైన్యాధిపతులుగా లేరు. ఇటీవల కాలం వరకు పరిస్థితి అలాగే కొనసాగింది. అచిర కాలంలో స్త్రీలు పేరు, డబ్బు సంపాదించుకోవాలంటే వారు సినిమా, టివి , కళాకారులుగానో, యాంకర్లుగానో, మోడల్స్‌గానో లేక అందాల పోటీల్లో పోటీదారులవుతున్నారు తప్పితే, మహోన్నత వ్యక్తులుగా, మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా, ఇంజినీర్లుగా నిలబడుతున్న వారు చాలా కొద్ది మంది మాత్రమే. అందుకు వ్యవస్థలోని లోపాలు, వివక్ష వంటివి ముఖ్య కారణాలు.

ఘన విజయాలు సాధించిన పురుషుల జీవితాలలో స్త్రీలు ఉన్నట్టుగానే, స్త్రీల జీవితాలలో కూడా పురుషులు వుంటారు. వుండాలి కూడా! ఉదాహరణకు మనం కొందరిని గుర్తు చేసుకోవచ్చు. వైద్య శాస్త్రంలో తొలి అమెరికన్ డిగ్రీ సాధించిన ఆనందీ బాయి జోషి భర్త గోపాల రావు జోషి ఒక మామూలు గుమస్తా. పద్నాలుగేళ్ళకే తల్లయి కొడుకును పోగొట్టుకున్న ఆమె ఎలాగయినా తను వైద్య శాస్త్రం చదవాలనుకుంది. భర్త సహకరించి తోడ్పడి అమెరికా పంపించాడు. 1886లో ఎం.డి పట్టా స్వీకరించిన ఆనందీ బాయి తిరిగి వచ్చి స్వదేశానికి ఉపయోగపడలేకపోయింది. డిగ్రీ తీసుకున్న సంవత్సరానికే క్షయ వల్ల మరణించింది. అయితే ఆమె చూపిన చొరవ ఎంతో మంది భారతీయ మహిళలకు స్ఫూర్తి నిచ్చింది. వృక్ష శాస్త్రంలో మిషిగన్ అమెరికాలో పరిశోధనలు చేసిన జానకీ అమ్మాళ్ జమ్మూలోని రీజినల్ రీసెర్చ్ లాబోరేటరీలో మూడున్నర వేల వృక్ష జాతుల జన్యువుల మీద పరిశోధనలు చేశారు. బ్రిటీష్ ఇండియాలో సైన్స్‌లో తొలి డాక్టరేజ్ సాధించిన అసీమా ఛటర్జీ, అమెరికా వెళ్ళి విస్కాన్సిన్, కాలిఫోర్నియాలలో పరిశోధనలు చేసి వచ్చారు.

దేశంలో మలేరియా, కేన్సర్‌ల నివారణకు ఆమె పరిశోధనల ఫలితంగానే మందులు తయారయ్యాయి. నీరా (తాటికల్లు)లోని పోషక విలువలపై పరిశోధనలు చేసి రాష్ట్రపతి అవార్డు స్వీకరించిన ధీర వనిత కమలా సోహానీ. ఈమె ప్రతిభను గుర్తించి కేంబ్రిడ్జి యూనివర్శిటీ వారు ఆహ్వానించారు. అప్పుడక్కడ గింజ ధాన్యాలలోని పోషక విలువలపై పరిశోధనలు చేశారు. దేశంలోనే తొలి వాతావరణ శాస్త్రవేత్త అన్నామణి. బాల్యంలో ఆమె తండ్రి ఆమెకు వజ్రాల చెవిరింగులు కొనిపెడతానంటే తనకు అవి అవసరం లేదనీ, తనకు ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కొనిపెట్టమని మారాం చేసింది. ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించిన అన్నామణి ప్రపంచ వాతావరణ సంస్థకు (డబ్లుఎంఒ)కు కన్సల్టెంట్‌గా కూడా వున్నారు. ఇలా వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే మహిళా శాస్త్రవేత్తలలో ఎక్కువ మంది మన దక్షిణ భారత దేశానికి చెందిన వారు కావడం మనకు గర్వకారణం. అంతకంటే ప్రపంచంలోనే తొలి అనెస్థీషియా నిపుణురాలు మన హైదరాబాద్ నగరానికి చెందిన రూపాబాయి ఫర్దూన్జీ.

హైదరాబాద్‌లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టి హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుండి హకీం (డాక్టరు) పట్టా తీసుకొని, ఎన్నో విదేశీ సంస్థలలో పరిశోధనలు చేసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చి, ఏళ్ళకేళ్ళు శస్త్ర చికిత్సలలో తన సహకారం అందించారు. 1920లో ఛాదర్ ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇటీవలి కాలంలో “మిస్సైల్ వుమెన్‌”గా ప్రసిద్ధి చెందిన టెస్సీ థామస్ అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు నేతృత్వం వహించడం మరొక ఎత్తు! అంటార్కిటికాను చుట్టి వచ్చిన తొలి భారతీయురాలు అదితి పంత్‌తో సహా అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు దేశ పురోగతిలో భాగస్వాములవుతున్నారు. అవకాశం వస్తే తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని మహిళలు తేల్చి చెపుతున్నారు. అయితే, మారిన పరిస్థితుల్లో వైజ్ఞానిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఇంకా గణనీయంగా పెరగాల్సే వుంది.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News