Thursday, January 23, 2025

మహిళకు మంచి రోజు?

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు స్త్రీల స్థితిగతుల గురించి మాట్లాడుకోడం ఒక సంప్రదాయంగా మారిపోయింది. కొత్త బట్టలు తొడుక్కొని, గుడికి వెళ్ళి, పంచభక్ష పరమాన్నాలు భుజించి పండుగలు నిర్వహించుకొనే స్థాయికి చేరిపోయింది. ఆ రోజున అందరూ మహిళాభ్యుదయాన్ని గురించి ప్రస్తావించుకోడం మామూలైపోయింది. కలాలు, గళాలు రాపాడించి ఫుంఖానుఫుంఖాలుగా రచనలు, ఉపన్యాసాలు చేయడం తద్వారా ఆమె పురోభివృద్ధి కోసం గట్టిగా వాదించడం జరిగిపోతుంది. ఏడాది తిరిగి ఆ రోజు మళ్ళీ వచ్చే వరకు వాటన్నింటినీ మరచిపోడం అలవాటైపోయింది. అందుకే మహిళల ప్రగతి ప్రస్థానం ముళ్ళదారి నడకగా మారిపోయింది.

ప్రపంచంలోని నిరక్షరాస్యులైన జనాభాలో మూడింట రెండు వంతుల మంది మహిళలేనని ఐక్యరాజ్య సమితి స్వయంగా నిర్వహించిన అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా గల శరణార్థుల్లో 80 శాతం మంది స్త్రీలేనని మరొక పరిశోధన వెల్లడించింది. ప్రపంచ వనరుల్లో కేవలం 1 శాతం మాత్రమే మహిళల సొంతమై వున్నాయని, ప్రపంచ ఆదాయంలో పదింట ఒక వంతు మాత్రమే వారికి చెంది వుందని, గణాంకాలు చెబుతున్నాయి. ఇంతటి హీనస్థితిలో వున్న స్త్రీ పురుషుడితో సమాన స్థాయికి చేరడం ఎన్ని శతాబ్దాలు గడిస్తే సాధ్యపడుతుంది, అందుకు మరెన్ని లక్షల, కోట్ల మహిళా దినోత్సవాలు జరుపుకోవాలి? మూలం ఎక్కడుందో తెలుసుకోకుండా ప్రశంసలతో, పవిత్రమైన ప్రస్తావనలతో మహిళను ఆకాశానికి ఎత్తేస్తే ఆమె పురుషుడితో సమాన స్థాయికి చేరుకొంటుందా? ఐక్యరాజ్య సమితి గాని, మరే అంతర్జాతీయ సంస్థ గాని ఇంత వరకు మహిళకు పట్టిన దుర్గతికి సిసలైన కారణాన్ని పేర్కొని దాని నిర్మూలనకు ప్రయత్నించిన జాడ లేదంటే అది అతిశయోక్తి కాబోదు.

మహిళను గురించి పురుషుడి దృక్కోణంలో చూసినంత కాలం ఆమెకు జరిగేది, ఒరిగేది పెద్దగా వుండదు. అఫ్ఘానిస్తాన్‌లో విశ్వవిద్యాలయాలను తెరిచారు గాని అందులో మహిళలకు ప్రవేశం నిషేధించారని తెలియజేస్తున్న తాజా వార్త స్త్రీల వాస్తవ దుస్థితిని చాటుతున్నది. ఇతర దేశాల్లో కూడా ఆమె పరిస్థితి ఘనంగా ఏమీ లేదు. అన్ని అవకాశాలు కల్పిస్తున్నట్టే కనిపిస్తున్నా ఆమెను పట్టి వెనక్కి లాగే పగ్గాలు అసంఖ్యాకంగా వుంటాయి.మహిళను ఎక్కడైతే గౌరవంగా చూస్తామో అక్కడ అంతా సవ్యంగా, అమోఘంగా వుంటుందని మాటల్లో చెప్పే చోటనే ఆచార, సంప్రదాయాల పేరిట అనేక అపనీతులతో ఆమె పురోగతిని అడ్డుకుంటూ వుంటారు. భారత దేశంలో భర్త చనిపోతే అతడి చితి మీద పడి ఆమె కూడా సహగమనం చేయాలనే అమానుష సంప్రదాయం రాజ్యమేలిన రోజులున్నాయి.

రాజారామ్ మోహన్ రాయ్ వంటి వారి కృషితో అటువంటి దుర్మార్గాల నుంచి బయటపడినప్పటికీ అనేక దుష్ట సంప్రదాయాలు భారతీయ మహిళను ఇప్పటికీ బాధిస్తూనే వున్నాయి. భార్య, భర్త ఒక సామాజిక ఒప్పందానికి లోబడి వుండాలని ఈ ఒప్పందం ప్రకారం భర్త పట్ల భార్య తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే ఆమెను అతడు విడిచిపెట్టవచ్చునని దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి సైద్ధాంతిక మార్గదర్శి అయిన ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ స్వయంగా ఉద్బోధించి ఎంతో కాలం కాలేదు. నువ్వు నా ఇంటి బాధ్యతలను నెరవేర్చాలి, నేను నీ భద్రతను, అవసరాలను చూసుకొంటూ నిన్ను సురక్షితంగా వుంచుతాను అని భర్త తన భార్యకు ఈ సామాజిక ఒప్పందం ద్వారా అభయమిస్తాడని ఆయన పేర్కొనడంలో సర్వసమానత్వాన్ని చాటిచెప్పే మన రాజ్యాంగ నీతి ఎంతగా సమాధి అయిపోయిందో వివరించి చెప్పనక్కర లేదు.

లింగపరమైన అసమానత విషయంలో 191 దేశాల్లో భారత దేశం అత్యంత అధమంగా 132వ స్థానంలో వున్నదని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ సంస్థ (యుఎన్‌డిపి) 2021లో విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదిక మన పరువును తీసి నడి బజారున వేసింది. పురుషులతో సమానంగా మహిళలకు విద్య, ఆరోగ్య తదితర సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగావకాశాలు అందుబాటులో లేకపోడమే ఇందుకు కారణం. ఒక్క ఇండియాలోనే కాదు తరతమ తేడాలతో అన్ని దేశాల్లోనూ స్త్రీ పరిస్థితి పురుషుడి అడుగు జాడలను అనుసరించి నడవడమే. సాటిలేని ప్రజాస్వామిక దేశంగా చెప్పుకొనే అమెరికాలో అనేక రాష్ట్రాల్లో గర్భస్రావ హక్కును నిషేధించారంటే ఇంకేమనాలి? అందుచేత స్త్రీ సమస్యలను విడదీసి ప్రస్తావిస్తూ వున్నంత కాలం ఆమెకు నిజంగా జరిగేదేమీ వుండదు. ఆమె సమస్యలకు మూలాలు మతంలో, సామాజిక వ్యవస్థలో వున్నాయి. వాటిని సరిచేయకుండా, పురుషాధిపత్య కోరల నుంచి ఆమెకు విముక్తి కలిగించకుండా నిజమైన మహిళా దినోత్సవం జరుపుకొనే రోజు రాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News