హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅధ్యక్షతన జరిగిన ఈ సంబురాల్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు పౌసమి బసు, శృతి ఓజ, విజయలక్ష్మి, జోనల్ కమిషనర్లు వి.మమత, యుసిడి ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య, సిఎంహెచ్‌ఓ పద్మజలు హజరయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య మహిళా కార్మికుల ఘనంగా సన్మానించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆది పరాశక్తులని, స్త్రీ లేకపోతే సృష్టే లేదన్నారు. మహిళలు ఆధునిక కాలంలో కూడా ఎంతో సహనంతో కుటుంబ బాధ్యతలను నేరవేరుస్తున్నారని తెలిపారు. 7 ఏళ్ల కిత్రం ఉన్న మహిళలు, నేటి మహిళల్లో ఎంతో వ్యాతాసం ఉందని పేర్కొన్నారు. కోవిడ్ 19 విపత్తు కాలంలో ఆశా వర్కర్లు, సఫాయి కార్మికులు విశేష కృషి చేసి చేశారని కొనియాడారు.
నగరవాసులకు కోవిడ్ కిట్‌లను సకాలంలో అందించడంలో వారి సేవలు మరువలేనివన్నారు. ప్రభుత్వం మహిళల కోసం కెసిఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, న్యూట్రిషన్ కిట్, డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, స్వయం సహాయక బృందాలకు రుణాలు, మహిళలకు సర్టిఫికేట్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు నిరంతరాయంగా అందిస్తోందని తెలిపారు. మహిళలు ఇళ్లకే పరిమితం కాకుండా సమాజంలోకి వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మాట్లాడుతూ మహిళలకు సామాజిక సంస్థలో ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్‌ను వినియోగించుకోవాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ మహిళా దినోత్సవం న్యూయార్క్ నగరం నుంచి శ్రామిక మహిళల కోసం ఏర్పాటైన నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నమన్నారు. స్త్రీ పురుషుల సమానత్వం పాటించాలన్నారు. మహిళలపై చూపుతున్న వివక్షపై మహిళలు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. సమావేశం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు అధికారులు కార్మికులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.