పటియాలా : పంజాబ్ లోని పటియాలాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి రాళ్లు రువ్వుకోవడంతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. పటియాలా జిల్లా పరిధిలో శనివారం మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్ సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేసింది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పటియాలా జిల్లా పరిధిలో ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొంది. అలాగే ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంది. పటియాలా రేంజ్ ఐజీ రాకేశ్ అగర్వాల్ , సీనియర్ ఎస్పీ నానక్‌సింగ్, ఎస్పీలను తక్షణమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్థానంలో ముఖ్విందర్ సింగ్ చిన్నాను కొత్త ఐజీగా నియమించిన ప్రభుత్వం , దీపక్ పారిక్‌ను సీనియర్‌ఎస్పీగా , వాజిర్ సింగ్‌ను ఎస్పీగా నియమించినట్టు సీఎంవో కార్యాలయ అధికార ప్రతినిధి వెల్లడించారు.
మరోవైపు పటియాలాలో పరిస్థితి అదుపులోనే ఉందనీ, నగరమంతా శాంతియుత వాతావరణమే నెలకొని ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హిందూ సంస్థలకు చెందిన గ్రూపులు బంద్‌కు పిలుపునివ్వడంతో కాళీమాత ఆలయం సమీపంలో (శుక్రవారం ఘర్షణలు జరిగింది ఈ ప్రాంతం లోనే )భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. శివసేన (బాల్‌థాక్రే)వర్గంగా ప్రకటించుకొన్న ఓ బృందం ఖిలిస్థాన్ వ్యతిరేక మార్చ్ జరపగా, కొంతమంది సిక్కులు దీనికి అభ్యంతరం తెలుపుతూ పోటీ ర్యాలీ నిర్వహించడంతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. కాళీమాత ఆలయం వద్ద ఎదురుపడిన రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి, రాళ్లు రువ్వుకున్నారు. ఓ పోలీసు, మరో ముగ్గురు గాయపడ్డారు. పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపు లోకి తెచ్చేందుకు గాలి లోకి కాల్పులు జరిపారు. అంతేకాకుండా శుక్రవారం 11 గంటల పాటు కర్ఫూ కూడా అమలు చేశారు.