Thursday, January 9, 2025

‘ఇంటర్నెట్’ స్రవంతిలో గ్రామీణం

- Advertisement -
- Advertisement -

స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో ఇంటర్నెట్ వినియోగం కూడా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించింది.2022 సెప్టెంబర్‌లో గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 32.3 కోట్ల వరకు ఉండగా, 2024 మార్చి నాటికి 39.8 కోట్ల వరకు పెరిగింది. అంటే 16% పెరిగిందని స్పష్టమవుతోంది. చాలా మంది వినియోగదరులు ఆన్‌లైన్ గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, సోషలైజింగ్ కోసం ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. దేశం మొత్తం మీద ఇంటర్నెట్ వినియోగదారులు 2022 సెప్టెంబర్ నాటికి 81.5 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి 95.4 కోట్లకు చేరుకున్నారు. ఇదే కాలంలో రూరల్ సబ్‌స్రైబర్ల వాటా 40% నుంచి 42 % పెరగ్గా అర్బన్ ఏరియాల్లోని ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.7 కోట్లు నుంచి 55.6 కోట్లుకు అంటే 9.6% పెరిగింది.

రూరల్ ఇంటర్‌నెట్ సబ్‌స్క్రిప్షన్లలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి. ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ) 2023 నివేదిక ప్రకారం దేశంలో దాదాపు రూరల్ ఏరియా నుంచి 24.5 కోట్ల సబ్‌స్రైబర్లతో కలుపుకుని మొత్తం 43.8 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఆన్‌లైన్ గేమింగ్ కోసం ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని తేలింది. దాదాపు గ్రామీణ భారతంలోని 37.5 కోట్ల మంది కలుపుకుని మొత్తం 70.7 కోట్ల మంది ఒటిటి ( వీడియో, ఆడియో) కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 29.9 కోట్ల మంది సోషల్ మీడియా కోసం ఇంటర్నెట్‌ను వినియోగిస్తుండగా, 31.7 కోట్ల మంది కమ్యూనికేషన్ కోసం వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేర్చుకోడానికి ఇంటర్నెట్‌ను వినియోగించేవారిలో 5 కోట్ల మంది ప్రయత్నం వట్టి పనికిమాలినదిగా ఉంటోంది.

గ్రామీణ ప్రాంతాల్లో మాల్స్, సినిమాలు, ఇతర వేదికలు వంటి ఎంటర్‌టైన్‌మెంట్ అవకాశాల అనుసంధానం లోపిస్తోంది.స్థానిక భాషల కంటెంట్‌ను కల్పించే మొబైల్‌లోని ఒటిటి ప్లాట్‌ఫారమ్స్ సమీప నగరాల్లోని ప్రధాన స్రవంతి భాషల కంటెంట్ కన్నా మరింత ఆకర్షణీయంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఎంటెర్‌టైన్‌మెంట్ కుటుంబాల వారీగా షేర్ చేసుకోవచ్చని ఎవరైనా గుర్తించగలుగుతున్నారు. అదే అర్బన్ ఏరియాలకు దూరంగా ఉంటోంది. యూ ట్యూబ్ ఆధిక్యత కారణంగా ఇంటర్నెట్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో రూరల్ సబ్‌స్ర్కైబర్ల వినియోగం అత్యధికంగా ఉంటోందని ముంబైలోని కెజె సోమైయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ రామ్‌కిషన్ వై. పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న స్పోర్ట్ సెలబ్రెటీస్ వంటి రూరల్ సెలబ్రెటీస్ ఇంటర్నెట్ ద్వారా కనిపిస్తుండటం గ్రామీణ ప్రాంతాల ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఆదరణ పొందుతోంది. ఆమేరకు అత్యధిక వినియోగ రేట్లు చెల్లించడమవుతోంది. ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుసంధానం, సమర్థత, సాంస్కృతిక ఔచిత్యం, ఇవన్నీ గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ విశేష వినియోగానికి దోహదంచేస్తోంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వర్క్ ఫ్రంహో, ఆన్‌లైన్ విద్యకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత రెండేళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం దాదాపు 500 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పల్లెప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు చేరువచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌నెట్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.

ఇందులోని వైఫై విభాగంలో 2021 ఆగస్టు నాటికే 13 లక్షల మంది వినియోగదారులు నమోదయ్యారు. అలాగే 2021 డిసెంబర్ నాటికి 20 లక్షల మంది బ్రాడ్ బ్యాండ్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందగలరని ఆనాడు అంచనా వేయడమైంది. భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు (ఫైబర్ టు హోం ), వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ) చూసుకుంటాయి. ఈ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా 1.15 లక్షల పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 2021 వరకు 98 వేలకు ఇచ్చారు. మరోవైపు 2021 జూన్ నాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పంచాయతీలు కలిపి 13 వేల టెరాబైట్ల డేటా వినియోగించడం గమనార్హం. 2020లో ఇది ఆరువేల టెరాబైట్లు ఉండగా, 2019లో 300 నుంచి 400 మధ్య ఉంది.

కె. యాదగిరి రెడ్డి
98667 89511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News