న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 202425 బడ్జెట్‌లో యువతకు ఉద్యోగాల కల్పనకు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ కొత్త పథకం ప్రకారం వచ్చే ఐదేళ్లలో కోటి మంది యువతకు 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ అంటే పరిమిత వ్యవధిలో ఒక సంస్థ అందించే శిక్షణ. ఈ శిక్షణార్థులకు (ఇంటర్న్‌లు) నెలకు రూ. 5000 అలవెన్ను, రూ.6000 వన్‌టైమ్ అసిస్టెన్స్ కూడా అందిస్తారు.
“ప్రధాని ప్యాకేజీ ఐదో స్కీమ్ కింద తమ ప్రభుత్వం కోటి మంది యువతకు ఐదేళ్లలో 500 టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తుంది ” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ పథకంలో ఇంటర్న్‌కు 12 నెలల పాటు రియల్‌లైఫ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ లో అనుభవం అందించడమే లక్షంగా పెట్టుకున్నారు. దీని ద్వారా వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలపై యువత అవగాహన పెంచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఆయా కంపెనీలు యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తాయి.
ఈ శిక్షణ కోసం కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సిఎస్‌ఆర్ ) ఫండ్స్ నుంచి 10 శాతం వరకు నిధులు కేటాయిస్తాయి. అంటే సామాజిక కారణాల కోసం కంపెనీలు ఖర్చు చేయవలసిన డబ్బులో కొంత భాగం ఇంటర్న్‌లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించడమవుతుంది. దీని ద్వారా యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది. ఇదే సమయంలో కంపెనీలకు సిఎస్‌ఆర్ బాధ్యతలను నెరవేర్చినట్టు అవుతుంది. మరోవైపు మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా రూ.3 లక్షల కోట్లతో పథకాల్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందులో భాగంగా విద్య, ఉపాధి , నైపుణ్యాభివృద్ధి కోసం రూ.1.48 లక్షల కోట్లు వెచ్చించారు. దీంతోపాటు దేశ వ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఈ కొత్త ఇండస్ట్రియల్ పార్కులతో మరింత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కే వీలు కలుగుతుంది.