నేటి నుంచి 23వ తేదీ వరకు రాత్రి వేళల్లో సేవలు నిలిపివేత
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే రిజర్వేషన్ సేవలను ఈనెల 21 నుంచి 23వ తేదీ రాత్రి వేళల్లో పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సిపిఆర్వో సిహెచ్ రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు. దీనికోసం చార్టింగ్, కరెంట్ బుకింగ్, పిఆర్‌ఎస్ ఎంక్వైరీ, టికెట్ రద్దు, చార్జీలు వాపసు పొందడం వంటి పిఆర్‌ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 21వ తేదీ రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు, తిరిగి 22వ తేదీ రాత్రి 11.45 నుంచి 23వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు నిలిచిపోతాయని ఆయన తెలిపారు. ఈ వేళల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్ చార్టులు, కరెంట్ బుకింగ్ చార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.