Thursday, January 9, 2025

అంతరాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.65 టన్నుల పత్తి విత్తనాలు, బిజి, హెచ్ కాటన్ సీడ్స్, బోలేరో, ఎనిమిది మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం, యాద్గిరి జిల్లా, పుట్‌పాక్ మండలానికి చెందిన సదా శివరెడ్డి, కుమ్మరి తయ్యప్ప, బుడ్డన్నోడు రామచందర్, బోగుడు సురేష్, సింగ్ కలిసి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడు.

ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా సింగ్ పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు సదాశివరెడ్డి రాఘవేంద్ర సీడ్స్ పేరుతో కర్ణాటకలో షాపు ఏర్పాటు చేసి విత్తనాలు విక్రయిస్తున్నాడు. గతంలో నిందితుడు వసంత బయోటెక్‌లో పనిచేయడంతో పత్తి విత్తనాల గురించి పూర్తి అవగాహన ఉంది. పత్తి విత్తనాల తయారీ, విక్రయం తదితరాలపై పూర్తిగా అవగాహన ఉంది. మిగతా నిందితులతో కలిసి నకిలీ విత్తనాల బ్రాండ్ పేరు పెట్టి విత్తనాలను ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. విత్తనాలను ప్యాక్ చేసే పౌచ్‌లను నిందితులు నగరంలోని మీర్‌పేటలో తయారు చేయించారు. అంతేకాకుండా అసలు విత్తనాల కంటే వీటిని 50శాతం తక్కువ ధరకు ఇస్తామని చెప్పడంతో చాలామంది రైతులు కొనుగోలు చేస్తున్నారు.

తీర పంట చేతికి వచ్చే సమయంలో వీటి గురించి తెలియడంతో నిండాముగునుగుతున్నారు. నిందితులు బోలేరో వాహనంలో 1,400 కిలోల విత్తనాలను విక్రయించేందుకు తీసుకుని రాగా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 24 బ్యాగుల్లో ఉన్న 1.4టన్నుల పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు ప్యాక్ చేసే పౌచులు, బోలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బాలానగర్, బాచుపల్లి, బాలానగర్ ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. కాగా, నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న మరో ముఠాను రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, షాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 25 బ్యాగుల నకిలీ పత్తి విత్తనాలు, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ముగ్గురు నిందితుల వద్ద నుంచి 1,50 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40లక్షలు ఉంటుంది. ఎపిలోని నెల్లూరు జిల్లా, కావలికి చెందిన గట్టమనేని వెంకటరమణ, నారాయణపేట జిల్లా, మంగనూర్‌కు చెందిన రఘుపతి రెడ్డి, కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి కలిసి నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడు వెంకటరమణ 30 ఏళ్ల క్రితం వికారాబాద్‌కు బతుకు దెరువు కోసం వచ్చి ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు గతంలో భవ్య బయోటెక్, వసంత బయోటెక్, ఆదిత్య బయోటెక్ కంపెనీల్లో పనిచేయడంతో విత్తనాలు తయారీ, విక్రయంపై పూర్తి అవగాహన ఉంది. దీంతో నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసి విక్రయించాలని ప్లాన్ వేశాడు.

నిందితుడు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని అందులో వచ్చిన విత్తనాలు తీసి కర్ణాటక రాష్ట్రంలోని గిన్నింగ్ మిల్లులో ప్రాసెస్ చేసి వాటికి కలర్ కోటింగ్ వేసి ఇక్కడ విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి దాడులు చేసి పట్టుకున్నారు. నకిలీ విత్తనాలు గతంలో వెంకటరమణ విక్రయించడంతో వికారాబాద్, మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన నిందితుడు మళ్లీ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నాడు. విలేకరుల సమావేశంలో డిసిపి శ్రీనివాసరావు, ఎడిసిపిలు శోభన్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News