Thursday, December 19, 2024

అంతరాష్ట్ర గంజాయి రవాణా ముఠాల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః గంజాయి రవాణా చేస్తున్న రెండు అంతరాష్ట్ర ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 1,228 కిలోల గంజాయి, కార్లు, కంట్రీమేడ్ పిస్తోల్, 14 రౌండ్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తన గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ముజఫర్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇనాం, బంటీ కశ్యాప్ అలియాస్ బంటి కుమార్, మహ్మద్ సాద్, హర్యానా రాష్ట్రానికి చెందిన లలిత్‌కుమార్ కశ్యాప్ రాజ్‌పుత్,మహారాష్ట్ర, సోలాపూర్‌కు చెందిన బాబ్లూ షిండే, ఎపిలోని అరకుకు చెందిన సుభాష్ కలిసి గంజాయిని ఎపి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. బబ్లూ షిండే, సుభాష్ పరారీలో ఉన్నారు. నిందితులపై ఉత్తర్‌ప్రదేవ్‌లో కేసులు ఉన్నాయి.

మహ్మద్ ఇనాం ఇంటర్ వరకు చదివి ఆపివేశాడు. వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలు చేయడంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గతంలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అందరూ కలిసి ఎపిలోని అరకులో గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, సోలాపూర్‌కు చెందిన బబ్లూ షిండేకు అప్పగించాలి. దీనికి బబ్లూ ఆర్డర్ చేయడంతో 508కిలోల గజాయిని తీసుకుని వచ్చేందుకు నిందితులు అరకుకు కార్లలో వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత అటవీ ప్రాంతంలో కార్లు పార్కింగ్ చేసి గంజాయి సప్లయ్ చేస్తున్న సుభాష్‌కు ఫోన్ చేసి చెప్పారు. సుభాష్ కార్లలో రెండు, మూడు కిలోల ప్యాకెట్లలో గంజాయిని నింపి కారులో లోడ్ చేశాడు.

తర్వాత వీరికి చెప్పడంతో కార్లు తీసుకుని హైదరాబాద్ మీదుగా సోలాపూర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. వీరికి పైలెట్‌గా స్విఫ్ట్ కారు ముందు వెళ్తుండగా వెనుక గంజాయి ఉన్న కార్లు వస్తున్నాయి. పోలీసుల తనిఖీలు ఉంటే ముందుగానే చెప్పేందుకు పైలట్ కారును వాడారు. ఈ విషయం మేడ్చెల్ ఎస్‌ఓటి, దుండిగల్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. నిందితులు అరకులో రూ.3,000కిలో చొప్పున కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.25,000లకు చొప్పున విక్రయించేందుకు ప్లాన్ వేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1,49,10,500 ఉంటుంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మాదాపూర్ ఎస్‌ఓటి…
డిసిఎంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ ఎస్‌ఓటి, నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి 720 కిలోల గంజాయి, డిసిఎం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.1,64,00,000 ఉంటుంది. మహారాష్ట్ర, సతారా జిల్లాకు చెందిన విశాల్ చంద్రకాంత్ షిండే, సాగర్ భాబన్ దేశ్‌ముఖ్, ఎపికి చెందిన రెహ్మన్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు. వీరిలో రెహ్మన్ పరారీలో ఉన్నాడు.

రెహ్మన్ గంజాయి రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు రవాణా చేస్తున్నాడు. రెహ్మన్ ఆదేశాల మేరకు మహారాష్ట్రకు చెందిన ఇద్దరు రాజమండ్రికి వచ్చారు. వీరికి ట్రిప్పుకు చెరొకరికి రూ.12,000 చొప్పున ఇస్తున్నాడు. డిసిఎం వ్యాన్‌కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని గంజాయిని తీసుకుని వెళ్లేందుకు వచ్చారు. రాజమండ్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో గంజాయిని లోడ్ చేసుకుని, కాలీ వెజిటెబుల్ బాక్స్‌లను డిసిఎంలో వేసుకుని ఎపి నుంచి మహారాష్ట్రకు బయలు దేరాడు. ఈ విషయం మాదాపూర్ ఎస్‌ఓటి, నార్సింగి పోలీసులకు తెలిసింది. మహారాష్ట్ర, ఔరంగబాద్‌లో గంజాయిని అందించేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. ఎన్‌సిసి అర్బన్, మంచిరేవుల సమీపంలో పట్టుకున్నారు. నిందితులు రాజమండ్రిలో రూ.4,000 కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.20,000లకు విక్రయిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్లు శివప్రసాద్, శివ, ఎస్సైలు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News