Friday, November 15, 2024

అదే నాకు దక్కిన ఉత్తమ అభినందన

- Advertisement -
- Advertisement -

Interview with actor Vaishnav Tej

 

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతున్నాడు. బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను స్వచ్ఛమైన ప్రేమ కథగా తీసుకొస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

చాలా చేయాలనుకున్నాను…

నేను హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను మొదట వ్యోమగామి కావాలని, అలాగే కొన్నాళ్లు సైన్యంలో చేరాలని… ఇలా ఉండేవి నా ఆలోచనలు. కొన్నాళ్ల పాటు విఎఫ్‌ఎక్స్ కూడా నేర్చుకోవాలనుకున్నాను. ఇలా చాలా చేయాలనుకున్నాను. అయితే గ్రాడ్యుయేషన్ తరువాత నేను బరువు తగ్గడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నాకు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. చివరికి నాకు ‘ఉప్పెన’ కథ బాగా నచ్చింది.

మామయ్య వల్లే…

ఈ కథ నచ్చాక నేను మామయ్య చిరంజీవిని సంప్రదించాను. ఆయనకు ఈ సినిమా గురించి వివరించాను. మామయ్య కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనే నన్ను పూర్తిగా ప్రోత్సహించారు. మామయ్య వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను.

సంతోషంగా ఫీలయ్యారు…

నేను సినిమాలనే కెరీర్‌గా ఎంచుకున్నానని తెలిసి మరో మామయ్య పవన్‌కళ్యాణ్ సంతోషంగా ఫీలయ్యారు. ఆయన ‘ఉప్పెన’ ట్రైలర్ చూశారు. ఆయనకు బాగా నచ్చింది. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు ఉంటాయి.

40 రోజులు వర్క్‌షాప్…

నేను పరిశ్రమలోకి రావడానికి ముందు నటనలో శిక్షణ తీసుకున్నాను. నా పాత్ర కోసం, నేను ఒక జాలరిలా కనిపించడానికి అచ్చం నా బాడీ లాంగ్వేజ్‌ను కూడా అలాగే మార్చుకోవడానికి ప్రాక్టీస్ చేశాను. మాకు 40 రోజులు వర్క్‌షాప్ కూడా జరిగింది. ప్రీ -ప్రొడక్షన్ కంటే నేను సెట్స్‌పై చాలా నేర్చుకున్నాను.

ఆయనకు అభిమానిని అయ్యా…

విజయ్ సేతుపతి వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. ఆయన చాలా నిజాయితీ గల నటుడు. నేను ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. అన్నింటికన్నా నేను ఆయన ప్రవర్తనకు అభిమానిని అయ్యాను, ఆయన ఎప్పుడూ మానిటర్‌ను చూడడు.

అదే నాకు ఉత్తమ అభినందన…

ఈ చిత్రంలో నా నటన గురించి చిరంజీవి మామయ్య ఏమంటాడో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. ఆయన సినిమా చూసిన క్షణం ‘సూపర్‌గా చేశావురా’ అన్నారు. అది నా జీవితంలో దక్కిన ఉత్తమ అభినందన. ఆయనకి సినిమా నచ్చింది కాబట్టి ప్రేక్షకులకు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందని నా అభిప్రాయం.

మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి?

నేను ఒక యాక్షన్ సినిమా ప్రేమికుడిని. మెగా హీరోల యాక్షన్ చిత్రాలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ల సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. నేను విజయవంతమైతే, సరైన సమయం వచ్చినప్పుడు అలాంటి సినిమాలు చేయాలని ఆశ.

సొంత సోదరుడిగా చూశారు…

ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించిన విధానాన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. నేను రామ్‌చరణ్ ఇంట్లో ఎన్టీఆర్ అన్నను కలిశాను. అప్పటి నుండి ఆయన నన్ను తన సొంత సోదరుడిగానే చూశారు. ఆయన ఎల్లప్పుడూ నన్ను పిలిచి నా షూట్, నా భవిష్యత్తు సినిమాల గురించి ఆరా తీస్తారు. అలాగే మంచు మనోజ్ నన్ను ప్రోత్సహించే విధానం కూడా గొప్పది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News