నితిన్ హీరోగా రాబోతున్న కొత్త చిత్రం ‘మాస్ట్రో’. నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ సందర్భంగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
లవ్‌స్టోరీ, క్లైమాక్స్‌లో మార్పులు…
అరకు దగ్గరలోని టైడా అనే ఊరిలో మొదటిసారి ఈ బాలీవుడ్ మూవీ ‘అందాధున్’ చూశా. ’అందాధున్’ చూడగానే మూవీలోని థ్రిల్లింగ్ మూమెంట్స్ నచ్చాయి. క్రైం, డార్క్ హ్యూమర్ బాగా ఆకట్టుకున్నాయి. రీమేక్ చేస్తే ఇలాంటి సినిమా చేయాలని అనిపించింది. చివరికి నితిన్, సుధాకర్ రెడ్డిలతో మాట్లాడి ఈ సినిమా చేశాం. అయితే ఈ సినిమా ఒరిజినల్ వర్షన్‌లోని లవ్ స్టోరీ, క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేయడం జరిగింది.
అంధుడిగా క్యారెక్టర్‌లో లీనమై…
ఈ చిత్రంలో అంధుడిగా నితిన్ బాగా చేశారు. కోవిడ్ సంబంధిత కొన్ని కారణాల వల్ల ప్రారంభంలోనే దుబాయ్ షెడ్యూల్ చేసి క్లైమాక్స్ షూట్ చేశాం. ఫస్ట్ షాట్‌లోనే అంధుడిగా ఆ క్యారెక్టర్‌లో లీనమై చేశారు నితిన్. దీంతో ఈ సినిమా చేసేయొచ్చు అనే నమ్మకం వచ్చేసింది. టబు చేసిన పాత్రలో తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. ఆమె కమర్షియల్ హీరోయిన్ కాబట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. తమన్నా యాక్ట్ చేస్తుంటే చూసి నేనే షాకయ్యా.
చివరకు ఈ టైటిల్…
మహతి స్వర సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలు చాలా కొత్తగా చేశారు. ‘మాస్ట్రో’ అంటే మాస్టర్ ఆఫ్ మ్యూజిక్. చాలా టైటిల్స్ అనుకున్నాం కానీ చివరకు ఈ టైటిల్ ఫిక్స్ చేశాం.
ఇక రీమేక్‌లు చేయను…
రీమేక్ సినిమాలు చేస్తే ఒరిజినల్ వర్షన్‌తో పోల్చి చూస్తారు. కాబట్టి ఈ సినిమా తర్వాత ఇక రీమేక్ సినిమాలు చేయను. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి నితిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భవిష్యత్తులో నితిన్‌తో ఓ స్ట్రైయిట్ సినిమా కూడా చేస్తా.