Monday, December 23, 2024

ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యమంతా ఒకటే అంటరానిదంటూ లేదు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, సాహితీవేత్త మృణాళిని కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారితో మనతెంగాణ దినపత్రిక తరపున జర్నలిస్టు, కవి యర్రవల్లి జగన్మోహన రావు ఇంటర్వూ…

ప్రశ్న : భాష అంటేనే యాసశ్వాసగా నిలిచేది కదా. మాండలిక భాషలలో వెలువడేలేదా ముద్రితం కాకుండా మౌఖికంగా ప్రాచుర్యం పొంది ఉన్న గీతాలు, జానపద రచనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసేందుకుఏదైనా ప్రణాళికను ఏర్పర్చుకున్నారా?
జవాబు : మీ ప్రశ్న యథాతథంగా కేంద్ర సాహిత్య అకాడెమీ పరిధిలోకి రాదు కానీ, మౌఖిక సాహిత్యానికి అకాడెమీ గణనీయమైన స్థానం ఇస్తుంది. అంటే జాతీయ సదస్సుల్లోనూ, ప్రాంతీయభాషా సదస్సులలోనూ ఓరల్ ఎపిక్స్, ఓరల్ లిటరేచర్ అనే వాటికి స్థానం ఉంటుంది. కొన్నిసార్లు సదస్సుల ప్రసంగాలు ప్రచురణ రూపం దాల్చినపుడు సహజంగానే వీటికి సంబంధించిన పత్రాలుంటాయి. అవి ప్రచురింపబడతాయి కూడా. తెలుగు కార్యక్రమాల్లోనూ మౌఖిక సాహిత్యంపై సదస్సులు నిర్వహించవచ్చు.
ప్రశ్న : తొలి మహిళా కన్వీనర్ అంటున్నారు కదా. దీని గురించి మీ వివరణ?
జవాబు : తొలి మహిళా కన్వీనర్ అనడానికి కారణం ఇది కొత్త పదవి అని కాదు. అకాడెమీ పెట్టినప్పటినుంచి అన్ని భాషలకూ కన్వీనర్లు ఉన్నారు. అది ఎప్పుడూ ఉండే పదవే. ఆ పదవిలో తెలుగులో ఇప్పటివరకూ స్త్రీలు లేరు కనక, ఇప్పుడు అందరి దృష్టికీ ఈ పదవి వస్తోంది కానీ, మామూలుగా ప్రతి ఐదేళ్లకూ కొత్త కన్వీనర్లు వస్తూనే ఉన్నారు. చక్కగా పని చేస్తూనే ఉన్నారు. పైగా అకాడెమీలో కన్వీనర్లు ఒక్కరే పని చెయ్యరు. పదిమందితో కూడిన సలహామండలి పనిచేస్తుంది. ఈసారి నాకు తోడుగా, సాహిత్యరంగంలో ఇప్పటికే లబ్ధప్రతిష్ఠులైన డా. ఎస్వీసత్యనారాయణగారు. మందలపర్తికిశోర్ గారు, ప్రసేన్ గారూ కౌన్సిల్ సభ్యులుగా, మరో ఆరుగురు సాహిత్య కృషీవలురవంటి వారు సలహామండలి సభ్యులుగా ఉన్నారు. ఇంతకూ విషయమేమిటంటే, ఈసారి ఒక మహిళ ఎన్నికైనందుకు కొంత ప్రచారం ఎక్కువైంది. తెలుగులో జనరల్ కౌన్సల్ లో స్త్రీలు ఉండడం కూడ అరుదే. కనక కన్వీనర్ కావడం ఇంతవరకూ జరగలేదు. అందుకూ ఈ ప్రచారం. కన్వీనర్లు ఎవరైనా బాధ్యతలు అవే. ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు భాషాసాహిత్యాలపై కార్యక్రమాలు చేయడం, మంచి పుస్తకాలను ప్రచురించడం, రచయితలు, రచయిత్రులతో పాఠకులకు అనుసంధానం ఏర్పరచడం వంటివి.
ప్రశ్న : ఓ జర్నలిస్టుగా ప్రముఖ తెలుగు పత్రికలలో పనిచేసిన విశేషానుభవం ఉండి, మరో వైపు సామాజిక చైతన్యపు హక్కుల కార్యకర్తగా కూడా పనిచేసిన మీరు, ఈ సేవను ఇప్పటి మీ ఈ బాధ్యతలలో ఏ విధంగా మేలుకలయికగా సమ్మిళితం చేసుకుంటారు?
జవాబు : ఈ పదవికి ప్రత్యక్షంగా జర్నలిజంతో సంబంధం లేదు. కానీ, జర్నలిజం వల్ల అనేక రంగాల వారితో, అనేక వర్గాల పాఠకులతో పరిచయాలు ఏర్పడడం, అవి ఈనాటికీ నిలిచివుండడం వల్ల పాఠకులకు ఏవి అవసరమో గుర్తించగల నైపుణ్యం ఏర్పడివుండవచ్చు. రచనా రంగం, విద్యారంగం, పత్రికారంగం, ఆడియో, విజువల్ మీడియాలతో నాకు చిరకాల సంబంధం ఉంది కనక, వీటిన్నిటినీ సమన్వయపరిచే సాహిత్య కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అందులోనూ తులనాత్మక అధ్యయన రంగంలో పనిచేశాను కనక, సాహిత్యం అనే దాన్ని ఒక ఏకాంత ద్వీపంలాకాక, ఇతర లలిత కళలతో, ఇతర సామాజిక రంగాలతో దానికి వున్న సంబంధాన్ని విశ్లేషించే కార్యక్రమాలు కొన్నయినా రూపొందింవచ్చునని అనుకుంటున్నాను.
ప్రశ్న : యువతకు భాషా పరిజ్ఞానం పెంపొందింపచేయడానికి, యాసబాసల గురించి ఏదైనా చైతన్యపూరిత కార్యక్రమం చేపడుతారా?
జవాబు : యువత కేంద్రితంగా చెయ్యాలని ఉన్నట్టు ఇదివరకే చెప్పాను. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే, మామూలుగా తెలుగు సాహిత్య సదస్సుల్లో వేదికపైనా, కిందా కూడ అందరూ సాహిత్యంలో తలపండినవారే ఉంటారు. పైన ఉన్నవారు ఏంచెప్తారో కింద కూర్చున్నవారికీ తెలుసు. మనం కొత్తగా పంచేస్తున్న జ్ఞానం ఏమీ లేదు. కనక, సాహిత్య సదస్సుల్లో ‘గుడుగుడు గుంజం గుండా రాగం’ పోయి, కొత్త తరానికి ఆసక్తి కలిగిచేలా ఏవైనా చెయ్యగలమా అన్నది ముఖ్యమైన ఆలోచన. వారిని కూడ కలుపుకుపోగలిగితే, తెలుగు సాహిత్యం అంతరించిపోతోంది, కొత్త రచయితలు, పాఠకులు లేరు అని బాధపడే పరిస్థితి కొంతైనా తగ్గుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి యువతరాన్ని తెలుగుభాషా, సాహిత్యాలవైపు మళ్లించడం అంత సులభం కాదని తెలుసు. కానీ ప్రయత్నలోపం ఉండకూడదు కదా.
ప్రశ్న : ప్రాంతీయ భాషలలో ప్రచురితం అయ్యే వివిధ రచనలు భాషాపరమైన ప్రతిబంధకాలతో ప్రాంతీయ స్థాయికే పరిమితం అవుతున్నాయా? జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు మార్గం ఉందా?
జవాబు : అనువాదాల ద్వారా మాత్రమే ప్రాంతీయ భాషా రచనలు ఇతరుల దృష్టికి వస్తాయి. సాహిత్య అకాడెమీ లక్ష్యాలలో ఇది ముఖ్యమైనదే. ఇటీవలి కాలంలో అకాడెమీ వంటి సంస్థల సహాయం లేకుండానే చాలామంది రచయితలు, స్వీయప్రయత్నంతో, తమ రచనలను అనువదింపజేసుకుంటున్నారు. అది చాలామంచి పని. కాకపోతే అలా చేయించుకోలేని వాళ్లలో మంచి రచయితల (ఇక్కడ రచయితలంటే స్త్రీపురుషులిద్దరూ) రచనల అనువాదానికి ప్రణాళిక రూపొందించవచ్చు. అనువాదంపై వర్క్ షాపులు నిర్వహించి, అక్కడ రూపొందిన అనువాదాలను ప్రచురించవచ్చు. ఇదివరకే అలాంటి ప్రయత్నాలైతే జరిగాయి. ఇకపోతే, అకాడెమీ పురస్కారం వచ్చిన పుస్తకాలు ఎలాగూ అనువాదమౌతాయి. కానీ అలా పురస్కారాలు రాని మంచి పుస్తకాలెన్నో ఉన్నాయి. వాటి అనువాదాలకోసం ప్రయత్నిస్తాం.
ప్రశ్న : ఏ ప్రాతిపదికన మిమ్మల్ని ఈ సాహిత్య జాతీయస్థాయి హోదాకు ఎంపిక చేశారని అనుకుంటున్నారు?
జవాబు : కన్వీనర్ ఎంపికను అకాడెమీ ముందస్తు ప్రణాళికతో చెయ్యదండి. అది ఆయాభాషల సంఘాలపై ఆధారపడివుంటుంది. కేంద్ర అకాడెమీపై కాదు. కన్వీనర్ కంటే ముందు జనరల్ కౌన్సిల్ సభ్యుల ఎంపిక జరుగుతుంది. విశ్వవిద్యాలయాలు, రాష్ట్రప్రభుత్వాలు, సాహిత్యసంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, యోగ్యులని భావించిన వారిని ఔట్ గోయింగ్ జనరల్ కౌన్సిల్ సభ్యులు (అంటే అయిదేళ్ల టర్మ్ ముగించుకున్న పూర్వ జనరల్ కౌన్సిల్) ఎంపిక చేస్తారు. ఆ ఎంపికైన నలుగురిలో ఒకరు కన్వీనర్ గా ఎంపికవుతారు. కన్వీనర్ ఒక్కోసారి ఏకగ్రీవంగా ఎంపిక కావచ్చు. ఒక్కోసారి ఎన్నిక జరగవచ్చు.
ప్రశ్న : తెలుగు భాషకు జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యే సమావేశాల గురించి ముందుగా రచయితలకు తెలియచేయడం జరుగుతుందా?
జవాబు : జాతీయ స్థాయి సమావేశాల్లో ఏదో ఒక సదస్సులో, కవి సమ్మేళనంతో లేదా కథాపఠనంలో తెలుగు వారికి ప్రాతినిధ్యం కల్పించడం ఇప్పటికే బాగా జరుగుతోంది. తెలుగు సలహామండలి సూచన మేరకు ఆ ప్రతినిధుల పేర్లు నిర్ణయిస్తారు. కనక మనవారు ఎన్నోఏళ్లుగా జమ్ము నుంచి కేరళ వరకూ ఎన్నో సదస్సుల్లో పాల్గొంటున్నారు. కాకపోతే, దానికి మన రాష్ట్రాల్లో రావలసినంత ప్రచారం రావడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని కొందరు కవులు, రచయితలు తాము పాల్గొన్న అకాడెమీ సమావేశాల గురించి అందరితో పంచుకుంటున్నారు. ఇది మంచి పరిణామం.
ప్రశ్న : తెలంగాణ మాండలికంలో బతుకమ్మ లేదా లంబాడీల జానపద మౌఖిక పాటలు అత్యద్భుతమైన జనజీవిత మిళిత గానాలతో ఉంటున్నాయి. అయితే వీటిని కేవలం సినిమా వాళ్లు తమ సొంతపుబాణీలుగా మల్చుకుంటున్నారు, ప్రపంచ వ్యాప్తి గడిస్తున్నారు. అయితే వీటికి ప్రాణప్రదంగా ఉండే సగటు గ్రామీణ జానపద గుర్తింపులేని రచనలను మరింతగా పదిలం చేసేందుకు సమగ్ర రీతిలో సంకలనం చేసి అందరికీ పరిచయం చేసేందుకు వీలుందా?
జవాబు : ఈ ప్రశ్న కేంద్ర సాహిత్య అకాడెమీ పరిధిలోది కాదు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తెలంగాణాలోనూ, ఆంధ్రలోనూ సాహిత్య అకాడమీలున్నాయి. అవి చేసే పనులు ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానమివ్వగలుగుతాయి. తెలంగాణా సాహిత్య అకాడెమీ ఇప్పటికే ఈ విషయాలపైనా, ముఖ్యంగా స్థానిక సాహిత్యాలు, చరిత్రల నమోదుపైనా శ్రద్ధగా పనిచేస్తోందని అందరికీ తెలుసు. వీటికి ఒకటిరెండు సదస్సుల్లో చోటు కల్పించడం వరకు కేంద్ర సాహిత్య అకాడెమీ చేయగలదు. అకాడెమీ రెండు రాష్ట్రాలలోనూ సమానంగా పనిచేయవలసివుంటుంది.
ప్రశ్న : తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా అనుభవం ఉన్న మీరు , ఈ అనుభవాన్ని మీ సరికొత్త బాధ్యతల నిర్వహణకు ఏ విధంగా ఉపయోగిస్తారు?
జవాబు : తెలుగు సాహిత్య అధ్యాపకురాలిగా అనుభవం వల్ల తెలుగు సాహిత్యం ఎంత విస్త్రృతమైనదో, వైవిధ్యభరితమైందో నాకు తెలుసు. ఇప్పుడు కూడ కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతిగా పనిచేస్తు తెలుగు సాహిత్యాన్ని బోధిస్తున్నాను. తెలుగు సాహిత్యాన్ని ప్రాచీనసాహిత్యం, ఆధునిక సాహిత్యమని రెండుగా స్థూలంగా విభజించుకుంటే, ఒకదాన్ని ద్వేషించడమే మరోదాన్ని గౌరవించడమనే ఒక సంకుచితభావన ఇప్పుడు బలంగా ఉంది. ఇది అశాస్త్రీయమైన దృక్పథం. సాహిత్యం ఒక స్రవంతి. అకస్మాత్తుగా ఎక్కడినుంచో పుట్టదు. కాలక్రమానుసారంగా వచ్చిన సాహిత్యాన్ని వివేకంతో, కొత్త ఆలోచనా దృక్పథంతో విశ్లేషించాలే తప్ప, కొన్ని శతాబ్దుల సాహిత్యాన్ని ‘అంటరానిదాని’గా చూడ్డం సాహిత్యం తెలీనివాళ్లు చేసే పని అని నేననుకుంటాను. ప్రాచీనసాహిత్యంలోని మంచిచెడ్డలను బేరీజువేయగల సమర్థులు ఎందరో ఉన్నారు. కొత్త కోణాలనుంచి గతించిన సాహిత్యాన్ని చూడగల మేధావులూ ఉన్నారు. అలాంటి విషయాలకు కూడ కార్యక్రమాల్లో చోటివ్వాలని నా అభిప్రాయం. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా, తెలుగు సాహిత్య ఔన్నత్యమే లక్ష్యంగా పెట్టుకున్నపుడు మాత్రమే సమదృష్టి సాధ్యమవుతుంది. ఇప్పుడు అకాడెమీలో జరగాల్సింది అదే.
ప్రశ్న : దేశ భాషలలో ఇప్పుడు ఏదో ఒక భాష సంబంధిత సాహిత్య ఆధిపత్య ధోరణి నెలకొని ఉందా?
జవాబు : ఈ ప్రశ్న వెనక మీ ఉద్దేశం జాతీయస్థాయిలో ఒక భాషను రుద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అని అయితే, అది ఎలాగూ జరగదు. ఇన్ని సుసంపన్నమైన భాషావారసత్వాలున్న భారతదేశంలో ఏ ఒక్క భాషా ఎంత ప్రయత్నించినా ఆధిపత్యం సాధించలేదని నా నమ్మకం.
ప్రశ్న : కేంద్ర సాహిత్య అకాడమీ బాధ్యతలు స్వీకరించిన దశలో మూడు ప్రాంతాల తెలుగు సాహిత్య ప్రచారానికి ప్రాంతాలవారీగా ఏదైనా కార్యక్రమం చేపడుతారా?
జవాబు : అన్ని ప్రాంతాలలోనూ మంచి కార్యక్రమాలు జరపాలన్నదే ప్రధాన లక్ష్యం. తప్పక అదే ప్రయత్నంలో ఉంటాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News