స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ’ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ఎంతో టెన్షన్‌గా ఫీలయ్యా…
బాలకృష్ణ వంటి పెద్ద హీరోతో నేను ఇదివరకు ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనతో పనిచేసిన మొదటి రోజు ఎంతో టెన్షన్‌గా ఫీలయ్యాను. కానీ కలిసిన ఐదు నిమిషాల్లోనే ఆయన ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయనలాంటి పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. క్రమశిక్షణ, సమయపాలనలో ఆయన గ్రేట్. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.
చాలా కష్టపడ్డా…
నేను ఈ చిత్రంలో శ్రావణ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర పోషించాను. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఇదివరకు చూసిన ప్రగ్యా కనిపించొద్దని బోయపాటి అన్నారు. నా పాత్రను పోషించేందుకు చాలా కష్టపడ్డాను. నాది చాలా ముఖ్యమైన పాత్ర. నా క్యారెక్టర్ చుట్టే కథ తిరుగుతుంది. నాకు ఎదురైన సంఘటనల వల్లే రెండో పాత్ర అయిన అఖండ ఎంట్రీ ఉంటుంది. అలా ఈ సినిమాలో నాకు నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దక్కింది.
ఆయన మీద ఆ నమ్మకం ఉంది…
నాకు దర్శకుడు బోయపాటి మీద చాలా నమ్మకం ఉంది. ఆయక ఒక పాత్ర కోసం ఒకరిని అనుకున్నారంటే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఛాయిస్‌లా ఉంటుంది. ఆయన ఎంతో ఆలోచించి గానీ ఒక పాత్రకు ఆర్టిస్ట్‌ను ఎంచుకోరు. ఆయనకు ఎలాంటి వారు కావాలి.. సినిమాను ఎలా తీయాలి అనేది బాగా తెలుసు. అందుకే ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను. నాకు ఆయన మీద ఆ నమ్మకం ఉంది.
అలాంటి పవర్ఫుల్ పాత్ర చూడలేదు…
‘అఖండ’ లాంటి కథ, అలాంటి క్యారెక్టర్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఇక్కడే అని కాదు… ఇతర భాషల్లోనూ అలాంటి పవర్ఫుల్ పాత్రను నేను చూడలేదు. బాలకృష్ణ ఆ పాత్రలో డిఫరెంట్ లెవెల్లో కనిపిస్తారు.
రెండో పాటలో ఆ అవకాశం…
కమర్షియల్ చిత్రాల్లో ఉండేట్టుగా ఇందులో పాటలు ఉండవు. అడిగా అడిగా… అనే మెలోడి పాట ఇప్పటికే రిలీజ్ అయింది. ఇంకో పాటను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున విడుదల చేస్తున్నాం. మాస్ బీట్‌లో ఆ పాట ఉంటుంది. నాకు డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. రెండో పాటలో నాకు అవకాశం వచ్చింది. ఆ పాట రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా.