Monday, January 20, 2025

పేద కళాకారులకు సేవ చేస్తా

- Advertisement -
- Advertisement -

Interview with Shivaji raja

 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వంలో కళ్ళు అనే నాటిక ఆధారంగా ‘కళ్ళు’ పేరుతో రూపొందిన చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు శివాజి రాజా. ఈ సినిమా ద్వారా ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు స్వీకరించాడు. ఆ తరువాత సపోర్టింగ్ నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. గుణ్ణం గంగరాజు నిర్మాణ సారథ్యంలో జెమినీ టీవీలో ప్రసారమై బాగా ప్రాచుర్యం పొందిన అమృతం ధారావాహికలో కొన్ని ఎపిసోడ్లలో అమృతం పాత్రను పోషించాడు. నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన శివాజి రాజా ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఆదివారం శివాజీ రాజా జన్మదినం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

500కు పైగా సినిమాల్లో…

సినిమా రంగంలోకి నేను ప్రవేశించి దాదాపు 37 సంవత్సరాలు అయింది. నేను మద్రాసులో కెరీర్ మొదలెట్టాను. 1985 ఫిబ్రవరి 24న చెన్నైలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. చాలా మంది సినిమా వాళ్లతో నాకు దగ్గరి అనుబంధం ఉంది. నా అసలు పేరు శివాజీ రాజు. కానీ ఒకరోజు ఏచూరి అడిగి.. శివాజీ రాజు ఏమిటి రాజా అని పెట్టు అని చెప్పగా నా పేరు శివాజీ రాజాగా మారిపోయింది. ఇక నటుడిగా నేను దాదాపు 500 సినిమాలకు పైగా నటించాను. నటుడిగా భిన్నమైన సినిమాలు, పాత్రలు చేశాను.

పేద కళాకారులకు సేవ చేస్తా…

నేను ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశాను. నేను పనిచేసినప్పుడు పించన్ వేయి రూపాయలు ఉన్నదాన్ని ఐదువేలు అందేలా చేశాను. నేను మరోసారి ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటే ఓల్డేజ్ హోమ్ కట్టాలన్న ఆలోచన ఉండేది కానీ దానిపై నీళ్లు చల్లారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నేను 20 ఏళ్లుగా రకరకాల బాధ్యతలు నిర్వర్తించాను. ఇక శివాజీ రాజా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి పేద కళాకారులకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది. మొగిలయ్య లాంటి కళాకారుల ప్రతిభ గుర్తించి సపోర్ట్ చేస్తే వాళ్ళ జీవితాలు మారతాయి.

గొప్పదిశలో టాలీవుడ్…

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గొప్ప దిశలో ముందుకు సాగుతోంది. నేను మొదటినుండి చిరంజీవి అభిమానినే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్‌లను చూస్తుంటే నిజంగా అబ్బో అనిపిస్తుంది. ఈ మధ్య ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ని చూస్తుంటే ఒకప్పుడు అమీర్ ఖాన్‌ని చూసినట్టు ఉంది.

మంచి పేరు తెచ్చిపెట్టాయి…

నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ పాత్రల్లో ప్రేక్షకులు ఆదరించారు. కృష్ణవంశీ ఇచ్చిన పాత్రలు నాకు ఏ రేంజ్ పేరు తెచ్చాయో అందరికీ తెలుసు. అలాగే నా రాజా ప్రొడక్షన్ బ్యానర్‌పై తీసిన సినిమాలు, సీరియల్స్ కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా నేను చేసిన సీరియల్స్ అన్నింటికీ నంది అవార్డులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News