2022 ఏడాది అంతా వెసులుబాటు
అమెరికా విదేశాంగశాఖ
ముంబయి: నాన్ ఇమ్మిగ్రేంట్ వర్క్ వీసాదారులకు వ్యక్తిగత ఇంటర్వూలకు హాజరు కావాలన్న నిబంధనను తాత్కాలికంగా సడలిస్తున్నట్టు అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. 2022, డిసెంబర్ 31 వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. వీసాదారుల డిపెండెంట్లకూ(జీవిత భాగస్వాములు, వారసులు) ఈ సడలింపు వర్తిస్తుందని తెలిపింది. స్థానిక కాన్సులేట్ అధికారులకు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారమిస్తున్నట్టు తెలిపింది. ఈ వెసులుబాటు వర్తించే వీసాదారుల జాబితాను ప్రకటించింది. వారిలో ప్రత్యేక వృత్తి నిపుణులు(హెచ్1బి వీసాలు), ట్రైనీలు లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ విజిటర్లు(హెచ్3 వీసాలు), కంపెనీల అంతర్గత బదిలీలపై వెళ్లేవారు(ఎల్ వీసాలు), అసాధారణ సామర్థం కింద వెళ్లేవారు(ఒ వీసాలు), క్రీడాకారులు, కళాకారులు (పి వీసాలు), అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనేవాళ్లకి(క్యూ వీసాలపై వెళ్లేవారికి) ఈ సడలింపులు వర్తిస్తాయని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది.
ఎఫ్, ఎం వీసాలపై వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులు, జె వీసాలపై వెళ్లే విద్యార్థులకు కూడా ఇంటర్వూల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని కాన్సులేట్ అధికారులకు కల్పిస్తున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. అమెరికా వీసాలు జారీ చేయడానికి కాన్సులేట్ అధికారులు వ్యక్తిగతంగా ఇంటర్వూ చేయడం ఇప్పటివరకు తప్పనిసరి నిబంధనగా ఉండేది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌తో మరోసారి కరోనా ఉధృతి తలెత్తడంతో వ్యక్తిగత ఇంటర్వూలను తాత్కాలికంగా నిలిపివేసి వీసాల జారీని సులభతరం చేయాలని అమెరికా నిర్ణయించింది.