Wednesday, January 22, 2025

కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సర్వే దేశానికే ఆదర్శం
 ఏడు జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తి
 16 రోజుల్లోనే వేగంగా పూర్తి చేసిన రికార్డు
 సర్వే విధుల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు
 కులగణనపై చిత్తశుద్ధి చాటుకున్న ప్రజా ప్రభుత్వం
 తొలి ఏడాదిలోనే సామాజిక సాధికారతకు పెద్దపీట
ములుగు, జనగాం జిల్లాలలో వంద శాతం సర్వే పూర్తి
90 శాతానికి పైగా సమగ్ర ఇంటింటి సర్వే పూర్తిచేసుకొన్న17 జిల్లాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది. అతి తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఇంత తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించి కొత్త రికార్డు నెలకొల్పింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే రాష్ట్రం నలుమూలాల విజయవంతంగా సాగుతోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్లో 99.9%, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99% శాతం సర్వే పూర్తయింది. కామారెడ్డిలో 98.5%, మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇండ్లకు తాళాలున్నవి.. ఇలాంటివి మినహాయిస్తే వీటన్నింటా సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు.

మొదట్లో అనుమానాలు, అపోహలు వ్యక్తమైనప్పటికీ కుల గణనతో సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వటంతో అన్ని వర్గాల్లో సర్వేపై సానుకూలత వ్యక్తమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వివిధ దశల్లో దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవటం విశేషం. సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో బాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలున్నట్లు గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి సర్వే ప్రారంభించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించటం ప్రారంభించింది. మొత్తం 1,16,14,349 కుటుంబాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183, పట్టణ ప్రాంతాల్లో 51,73,166 కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో లెక్కతేలింది.

ఈ సర్వే చేపట్టేందుకు మొత్తం 87,807 మంది ఎన్యుమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించటంతో పాటు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 8788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక కోటి గృహాల సర్వే పూర్తయింది. నవంబర్ 6న ప్రారంభమైన సర్వే ద్వారా శుక్రవారం నవంబర్ 22 నాటికి 90 శాతం చేరుకుంది. జన సాంద్రత ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే నెమ్మదిగా సాగుతోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుంది. అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 4వ తేదీన సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటయిన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది. అక్టోబర్ 9వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో జీవో నెం.18 జారీ చేసింది.

ముమ్మరంగా సాగుతున్న సమగ్ర సర్వే : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే జనగాం, ములుగు జిల్లాలలో గురువారం నాటికి వంద శాతం సర్వే పూర్తయింది. నల్గొండ జిల్లా 99.7 శాతం పూర్తిచేసుకుని వంద శాతం లక్షానికి చేరువలో ఉంది. కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, కొమరం భీం ఆసీఫాబాద్, నారాయణ్ పేట్, జయశంకర్ భూపాల పల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. హన్మకొండ(75.7 శాతం), మేడ్చల్ మల్కాజ్‌గిరి (71.2 శాతం) మినహా మిగతా జిల్లాల్లో 80 శాతానికి పైగా సర్వే పూర్తయింది. జి.హెచ్.ఎంసీ పరిధిలో కూడా సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గురువారం నాటికి జిహెచ్ ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా 15,17,410 నివాసాలు సర్వే పూర్తిచేసి 60.60 శాతం లక్ష్యాన్ని సాధించింది. సర్వే సకాలంలో పూర్తి చేసేలా జిల్లా ఇన్ చార్జ్ అధికారులు కలెక్టర్లు ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News