Monday, December 23, 2024

మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ‘ఇంటింటి రామాయణం’..

- Advertisement -
సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విలేకర్ల సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న వెంకట్ కి నిర్మాతగా మారమని సూచించాను. అలా మారుతి గారిని వెళ్లి కలవగా.. ఆయన వీరిద్దరికి(నిర్మాతలు వెంకట్, గోపీచంద్) ఇచ్చిన బహుమతి ఈ సినిమా. మొదట దీనిని డిజిటల్ సినిమాగానే ప్రారంభించడం జరిగింది. అవుట్ పుట్ చూసిన తరువాత థియేటర్ లో ఆడుతుందన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఇటీవల వచ్చిన దిల్ రాజు గారి బలగం సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలోనే రూపొందింది. ఈ సినిమా దానికి భిన్నంగా ఉంటుంది. నా స్నేహితులు నిర్మాతలుగా పరిచయమవుతున్న ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “సురేష్ నా దగ్గర కొత్తజంట నుంచి ఐదారు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. ఆ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టిన సురేష్ ఒకసారి కథ రాసుకున్నాను అని చెప్పాడు. కథ వినగానే నాకు చాలా నచ్చింది. ఇది ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ.  ఇతర భాషల్లో విడుదల చేసినా ఈ సినిమాకి ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. నాగవంశీ గారితో కలిసి నేను ప్రొడక్షన్ చేసిన మొదటి సినిమా లవర్స్. అప్పటినుంచి నిర్మాతలుగా మా ప్రయాణం మొదలైంది. వెంకట్ గారు సినిమా మీదున్న ప్రేమతో డిస్ట్రిబ్యూషన్ లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. లాభనష్టాల గురించి ఆలోచించకుండా సినిమాను ప్రేమించే వెంకట్, గోపీచంద్ లను ఈ సినిమాతో నిర్మాతలుగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. రాహుల్ రామకృష్ణ పేరుని సురేషే సూచించాడు. రాహుల్ కేవలం కథ విని ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. నరేష్ గారు తెలంగాణ మాండలికాన్ని అద్భుతంగా పలికారు. ఆయన ఏ పాత్రనైనా సునాయాసంగా పోషిస్తారు. చిన్న సినిమాలను ఆదరించండి. ముఖ్యంగా ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించండి. థియేటర్ కి వెళ్లి చూడండి.. ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ.. “ముందుగా నాగవంశీ గారికి, మారుతి గారికి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని ఆహా ఒరిజినల్ ఫిల్మ్ గా తీశాం. అయితే ఇంతమంచి సినిమాని ప్రేక్షకులకు థియేటర్ అనుభూతి కలిగిస్తే బాగుంటుందని వంశీ గారు, మారుతి గారు సూచించడంతో ఇది సాధ్యమైంది. నరేష్ గారికి, రాహుల్ గారికి, నవ్య గారికి నా సినిమాలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీమ్ అందరి కృషి వల్ల అనుకున్నదానికంటే తక్కువ రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. నా నిర్మాతలు వెంకట్ గారికి, గోపి గారికి.. అలాగే థియేటర్ రిలీజ్ కి ఒప్పుకున్న ఆహా వారికి నా ప్రత్యేక కృతఙ్ఞతలు. ఇది ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. ఓ విభిన్న కథాంశంతో తెరకెక్కింది. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో కలిసి ఈ సినిమా చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. లాక్ డౌన్ తర్వాత భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను వెతుక్కొని మరీ చూస్తున్నారు. అలాంటి వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కళ్యాణి మాలిక్ గారు, కాసర్ల శ్యామ్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. తెలంగాణ మాండలికంలో కాసర్ల శ్యామ్ గారు ఎంతో సాయం చేశారు” అన్నారు.
ప్రముఖ నటుడు నరేష్ మాట్లాడుతూ.. “ఇది మట్టి కథ. ప్రతి ప్రాంతంలోని మాండలికానికి ఒక తియ్యదనం ఉంటుంది. తెలుగువారిగా మనం అన్ని యాసలను ఇష్టపడతాం. ఇది తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. మట్టి వాసన నచ్చే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే సినిమా కాదు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అలరించింది. ఆ సినిమాతో పోల్చడం కాదు కానీ ఈ సినిమాని కూడా గ్రామీణ నేపథ్యంలో దర్శకుడు అద్భుతంగా రూపొందించాడు. మారుతి గారి సినిమాలంటే నాకిష్టం. భలే భలే మగాడివోయ్ చేసేటప్పుడు సినిమా అంతా నవ్వుతూనే ఉన్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి అలా నవ్వాను. ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ రథానికి రెండు చక్రాలులా ఉన్న నాగవంశీ గారికి, మారుతి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ” నేను ఈ సినిమా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం సురేష్ గారు రాసిన కథ. రెండో కారణం ఏంటంటే ఈ సినిమాలో భాగమైన వంశీ గారికి, మారుతి గారికి, నరేష్ గారికి, నవ్య గారికి, గంగవ్వకి అందరికీ అభిమానిని. సినిమా చేసిన తర్వాత సురేష్ గారికి కూడా అభిమాని అయ్యాను. నేనొక ఫ్యాన్ బాయ్ గా ఈ సినిమా చేశాను. ప్రాంతాలకు, భేదాలకు భిన్నంగా ఉన్న సిసలైన కల్మషం లేని సినిమా ఇది. మన మనస్తత్వాలను, మన మనోభావాలను చాలా అలవోకగా, చాలా సులభంగా చూపిస్తూ మా నుంచి మంచి మంచి నటనను రాబట్టుకున్నారు దర్శకుడు. నాకు ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి, మారుతి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.
నటి నవ్యస్వామి మాట్లాడుతూ.. “చాలా చాలా సంతోషంగా ఉంది. కల నిజమైన సమయం ఇది. టెలివిజన్ లో చేస్తున్నప్పుడు సినిమాలు చేయాలి అనుకునేదానిని. ఇక టెలివిజన్ లో చేసింది చాలు, సినిమాలు చేద్దాం అనుకున్న సమయంలో ఇంటింటి రామాయణం అవకాశం వచ్చింది. ఇంతమంచి సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నాగవంశీ గారికి, మారుతి గారికి కృతఙ్ఞతలు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. లెజెండరీ యాక్టర్ నరేష్ గారితో కలిసి నటించడం గర్వంగా ఉంది. రాహుల్ గారు, గంగవ్వ, అంజి గారు అందరితో కలిసి పనిచేయడం సరదాగా కుటుంబంతో గడిపినట్లు అనిపించింది” అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News